Anti Sleep Alarm డ్రైవర్ నిద్రపోతే మోగనున్న అలారం.. సరికొత్త పరికరాన్ని తయారు చేసిన ఇండోర్ విద్యార్థులు..!
వాహన చోదకులు నిద్రమత్తులోకి జారుకోవడంతో దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. నిత్యం దినపత్రికల్లో, టీవీల్లో వీటిపై కథనాలను చూస్తూనే ఉన్నాము. మారుతున్న టెక్నాలజీతో పాటు చాలా రంగాల్లో అధునాతన పద్ధతులు వస్తున్నాయి. తాజాగా నిద్రలోకి జారుకుంటే అలర్ట్ చేసే పరికరాన్ని విద్యార్థులు తయారు చేశారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఇండోర్ కి చెందిన ఐదుగురు విద్యార్థులు యాంటీ స్లీప్ అలర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. డ్రైవర్ నిద్రలోకి జారుకున్నప్పుడు ఇది శబ్దం చేయడం ద్వారా డ్రైవర్ ని అలెర్ట్ చేస్తుంది. దీంతో పాటు వాహనాన్ని ఏకకాలంలో నిలిపివేస్తుందని వారు తెలిపారు. దీనిపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నట్లు వారు చెప్పారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

డ్రైవర్ కళ్లు మూసుకున్నప్పుడు ఈ పరికరంలోని సెన్సార్ సిస్టమ్ అతన్ని ఉత్తేజపరచేలా బజర్‌ను మోగిస్తుంది. వెంటనే బజర్ మోగిన తర్వాత కూడా డ్రైవర్ కళ్లు మూసుకుంటే కారు చక్రం కూడా ఆగిపోయే టెక్నాలజీని తయారు చేశారు. ఈ పరికరం డ్రైవర్లతో పాటు పెద్ద పెద్ద వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలను కాపాడవచ్చని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ స్లీప్-యాంటీ అలారం సిస్టమ్‌ను రూపొందించడానికి ఐదుగురు విద్యార్థులు దాదాపు మూడు వారాల పాటు కలిసి పనిచేశారు. అదే రాష్ట్రంలోని హోషంగాబాద్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ సీట్ లోని వ్యక్తి స్టీరింగ్‌పై నిద్రిస్తున్నట్లు వారు వివరించారు. దీంతో ట్రక్కు, బస్సు డ్రైవర్ల కోసం అలారం వ్యవస్థను రూపొందించడానికి తాము నిశ్చయించుకున్నామని విద్యార్థి ఒకరు చెప్పారు.
ఆ విద్యార్థులు తయారు చేస్తున్న యాంటీ స్లీప్ అలారం సిస్టమ్ వీడియోను ANI తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో పరికరం పనితీరు క్లియర్ గా వివరించారు. ఓ విద్యార్థి తను కళ్లు మూసిన వెంటనే బజర్ సౌండ్ చేస్తుంది. వెంటనే కళ్లు తెరవగానే బజర్ సౌండ్ ఆగిపోతుంది. పూర్తి పనితీరు వీడియో త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
వీడియోలో ప్రదర్శించిన పనితీరును మెచ్చిన పలువురు నెటిజన్లు విద్యార్థుల ప్రయత్నాలను అభినందించారు. త్వరలోనే ఇది అందుబాటులోకి తేవాలని సూచించారు. ఇలాంటి పరికరాలు ఎన్నో డ్రైవర్ కుటుంబాలను కాపాడతాయని అభిప్రాయపడ్డారు. మరికొందరు దీని పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. తమదైన శైలిలో రీట్వీట్ చేస్తూ ప్రశ్నల్నీ సంధించారు.
ఒక వేళ కారు లేదా పెద్ద వాహనాలు అధిక వేగంలో ఉన్నప్పుడు వాహనాన్ని సడెన్ గా నిలిపివేస్తే వాహనం కంట్రోల్ తప్పి పెద్ద ముప్పు జరుగుతుందని ట్విట్టర్ యూజర్ అన్నారు. అయితే అకస్మాత్తుగా చక్రాలను ఆపడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా.. లేదా అనే విషయంపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నట్లు విద్యార్థులు క్లారిటీ ఇచ్చారు.
ఈ యాంటీ-స్లీప్ అలారం ఒక్కసారి అందుబాటులోకి వస్తే ఉపయోగించడం చాలా సులువువని వారు చెప్పారు. పూర్తి స్థాయిలో దీనిని విడుదల చేసేందుకు చాలా పరీక్షలు, ఫిక్సింగ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా చేయడమే తమ లక్ష్యమని వారు వెల్లడించారు. ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా దీనిని మార్కెట్ లోకి తీసుకువస్తామని వివరించారు.
డ్రైవర్ల నిద్ర కారణంగా దేశంలో చాలా రోడ్డు ప్రమాద కేసులు నమోదవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఇది సరైన ప్రయత్నంగా చెప్పవచ్చు. సాధారణంగా హైవేలపై ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ముఖ్యంగా ట్రక్, బస్సు డ్రైవర్లు రాత్రిపగలు తేడా లేకుండా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సరకును త్వరగా రావాణా చేసేందుకు వాహనాలను ఎక్కువ కాలం విశ్రాంతి లేకుండా నడపాల్సి ఉంటుంది. ఈ పరికరం ఇలాంటి వారికి ఎక్కువగా ఉపయోగ పడనుంది.


Click it and Unblock the Notifications








