వింటేజ్ రోల్స్ రాయిస్ కారు నడిపిన ధోనీ.. చక్కర్లు కొడుతున్న వీడియో..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కార్లన్నా, బైక్‌లన్నా మహా క్రేజ్. ఈ విషయం ఆయన గ్యారేజ్ చూస్తే అర్థమవుతుంది. రాంచీలోని తన ఫాంహౌస్‌లో ఉన్న గ్యారేజ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ధోనీ గ్యారేజ్‌లో విభిన్న రకాల మోడళ్ల బైక్‌లతో పాటు వింటేజ్ కార్లు కూడా ఉన్నాయి.
మిస్టర్ కూల్ ధోనీ దగ్గర అనేక రకాల విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అందులో ప్రఖ్యాత రోల్స్ రాయిస్ మరింత ప్రత్యేకం. తాజాగా ఈ కారులో ధోనీ చక్కర్లు కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. రాంచీ వీధుల్లో రాయల్ బ్లూ కలర్ కారులో ధోనీ రయ్‌మంటూ దూసుకుపోతున్న వీడియోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

మహేంద్ర సింగ్ ధోని 2020లో అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ల నుంచి రిటైర్ అయిన తర్వాత, అరుదైన పాతకాలపు కార్లను సేకరిస్తూ తన క్లాసిక్ కార్ గ్యారేజీని పెంచుకున్నారు. తాజాగా మిస్టర్ కూల్ ఇటీవల రాంచీ రోడ్లపై అత్యంత అరుదైన 1980ల నాటి రోల్స్ రాయిస్ కారును నడుపుతూ కెమెరాకు చిక్కారు.
కుష్మాహి7 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఎమ్‌ఎస్ ధోని డ్యూయల్ టోన్ రోల్స్ రాయిస్ నడుపుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ కారు చూడటానికి రోల్స్ రాయిస్ సిల్వర్ వ్రైత్ II కారును పోలి ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. 80ల కాలం నాటి లగ్జరీ సెడాన్ నడుపుతున్న ధోనీని కొందరు అభిమానులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

80ల నాటి లగ్జరీ సెడాన్ రూఫ్, హుడ్ మరియు బూట్‌పై లేత నీలం రంగుతో డ్యూయల్ టోన్ పెయింట్‌ను కలిగి ఉండి ఆకర్షణీయంగా ఉంది. డోర్‌తో సహా మిగిలిన భాగం ముదురు నీలం రంగులో ఉంటుంది. ఇతర క్రికెటర్ల మాదిరిగానే మిస్టర్ కూల్ ధోనీ ఆధునిక, లగ్జరీ కార్ల కంటే పునరుద్ధరించబడిన వింటేజ్ వాహనాలకు అభిమాని.
అంతే కాకుండా ధోనీ గతంలో రెండు వింటేజ్ కార్లలో ప్రయాణిస్తూ కనిపించారు. ఓసారి రోవర్ మినీ కూపర్ స్పోర్ట్ కారు, మరోసారి ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110లో రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఈ కార్లతో పాటు, మహేంద్ర సింగ్ ధోనీకి పాంటియాక్ ఫైర్‌బర్డ్ కూడా ఉంది. వీటితో పాటు ఒకప్పుడు సైన్యంలో ఉపయోగించిన నిస్సాన్ జోంగా కారు కూడా మరో ప్రత్యేకం.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్‌కు కార్లు మరియు బైక్‌లంటే చాలా ఇష్టం. అందుకే ధోనీ విభిన్న బైక్‌లు మరియు కార్లతో ప్రత్యేకమైన కలెక్షన్‌ను సేకరించారు. MS ధోని 90వ దశకంలో ఉపయోగించిన Yamaha Rajdoot 350 బైక్‌తో తన బైక్ సేకరణను ప్రారంభించారు. ఇప్పుడు పాతకాలపు బైక్‌లు, ప్రముఖ మోడల్ బైక్‌లు, విదేశీ స్పోర్ట్స్ బైక్‌లు ఇంకా స్కూటర్‌ల సేకరణతో ఆయన గ్యారేజ్ నిండిపోయింది.
ఇటీవల, భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్.. ధోనీ రాంచీ ఫామ్‌హౌస్‌లో భారీ గ్యారేజీని ప్రత్యేకంగా సందర్శించారు. అనేక మోడళ్ల బైక్‌లు మరియు వింటేజ్ కార్లను వీడియో తీసి అభిమానులతో పంచుకున్నారు. ఒక బైక్ షోరూమ్‌లో కూడా ఇన్ని బైక్‌లు ఉండవేమో అని వెంకటేష్ ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
MS ధోనీ వద్ద దాదాపు 50 కి పైగా బైక్‌లు ఉన్నాయి. హార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్, కవాసకి నింజా H2, డుకాటి 1098, యమహా RD350, సుజుకి హయాబుసా వంటి కాస్ట్లీ బైక్‌లు ఆ జాబితాలో ఉన్నాయి. ఇంకా యమహా రాజ్‌దూత్, యమహా RX 135 వంటి వింటేజ్ బైక్‌లతో పాటు, ఖరీదైన, అరుదైన బైక్ కాన్ఫెడరేట్ X132 హెల్‌క్యాట్ కలిగి ఉన్నారు.
MS ధోనీకి చెందిన ఐకానిక్ కార్లలో మహీంద్రా స్కార్పియో, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, హమ్మర్ H2 మరియు తాజా నిస్సాన్ జోంగా ఉన్నాయి. ధోనీ తన గ్యారేజ్‌లో కార్లను, బైక్‌లను ఓ క్రమపద్ధతిలో అమర్చిన తీరు కూడా వీక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. గ్యారేజీలో రెండు స్థాయిల బైక్ పార్కింగ్ ఉంది.


Click it and Unblock the Notifications








