ఒక్కో కారు ధర రూ.4 కోట్లు.. ఇండియాకు మూడు వస్తే రెండు అంబానీనే కొన్నాడు..రేంజ్ అంటే ఇది కదా!
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గ్యారేజీలోకి మరో రెండు అద్భుతమైన లగ్జరీ కార్లు వచ్చి చేరాయి. సాధారణంగానే అంబానీ గ్యారేజీని జియో గ్యారేజీ అని పిలుస్తారు. అక్కడ ఇప్పటికే 150కి పైగా ప్రపంచ స్థాయి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రెండు మెర్సిడెస్ మేబ్యాక్ SL 680 (Mercedes-Maybach SL 680) మోనోగ్రామ్ ఎడిషన్ రోడ్‌స్టర్ కార్లు ఆ జాబితాలో చేరాయి.
ముకేశ్ అంబానీ విలాసవంతమైన జీవనశైలి గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుంది. తాజాగా ఆయన గ్యారేజీలోకి రెండు మెర్సిడెస్ మేబ్యాక్ SL 680 మోనోగ్రామ్ ఎడిషన్ (Monogram Edition) కార్లు చేరాయి. వీటి ధర ఒక్కొక్కటి దాదాపు రూ.4.20 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. అయితే, ఆర్టీవో, ఇన్సూరెన్స్, అంబానీకి నచ్చినట్లుగా చేయించుకున్న కస్టమైజేషన్లు కలిపితే ఒక్కో కారు ధర రూ.5 కోట్లకు పైగానే ఉంటుంది.

అంటే రెండు కార్ల కోసం ఆయన సుమారు రూ. 10 కోట్లు ఖర్చు చేశారు. ముంబై వీధుల్లో ఈ కొత్త కార్లు తెల్లటి రంగులో ధగధగలాడుతూ తిరుగుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మెర్సిడెస్ మేబ్యాక్ సంస్థ ఈ SL 680 మోనోగ్రామ్ సిరీస్‌ను అత్యంత పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేస్తోంది.
భారత మార్కెట్ కోసం గతేడాది కేవలం 3 యూనిట్లను మాత్రమే కంపెనీ కేటాయించింది. ఆశ్చర్యకరంగా.. ఆ మూడు కార్లలో ఏకంగా రెండు కార్లను అంబానీ కుటుంబమే సొంతం చేసుకుంది. ఈ కారును వైట్ (White Ambience), రెడ్ (Red Ambience) థీమ్స్‌లో ఆఫర్ చేస్తున్నారు.

అంబానీ వద్దకు ఓపాలైట్ వైట్ మాగ్నో (Opalite White Magno) రంగులో ఉన్న రెండు కార్లు వచ్చినట్లు సమాచారం. సాధారణంగా భారీ సెక్యూరిటీ కాన్వాయ్ మధ్య వెళ్లే అంబానీ కుటుంబం, ఇలాంటి టూ-సీటర్ ఓపెన్-టాప్ రోడ్‌స్టర్లలో కనిపించడం ఆటోమొబైల్ ప్రేమికులకు పెద్ద సర్ప్రైజ్.
మేబ్యాక్ SL 680 డిజైన్ పరంగా ప్రపంచంలోనే అత్యంత అందమైన కార్లలో ఒకటిగా పేరు పొందింది. ఈ కారు బోనెట్, సాఫ్ట్-టాప్ రూఫ్‌పై వందలాది చిన్న చిన్న మేబ్యాక్ లోగోలు (Monogram Pattern) గ్రాఫిక్ రూపంలో ప్రింట్ చేయబడి ఉంటాయి. ఇది కారుకు ఒక విలక్షణమైన ఐడెంటిటీని ఇస్తుంది.
ముందు భాగంలో వెలిగిపోయే క్రోమ్ గ్రిల్ (Illuminated Radiator Grille), కారు లోపల వైట్ నాప్పా లెదర్ అప్హోల్స్టరీ లగ్జరీని మరో స్థాయికి తీసుకెళ్లాయి. దీని 21-ఇంచుల మల్టీ-స్పోక్ ఫోర్జ్డ్ అలాయ్ వీల్స్ కారుకు తిరుగులేని రాజసాన్ని తెచ్చిపెట్టాయి.

ఈ కారు కేవలం చూడటానికి మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్‌లోనూ అదరగొడుతుంది. దీని కింద 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 585 bhp పవర్, 800 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న ఈ కారు, కేవలం 4.1 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడు గంటకు 260 కిలోమీటర్లుగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో పరిమితం చేయబడింది. లోపల 11.9-ఇంచ్ అడ్జస్టబుల్ టచ్‌స్క్రీన్, బుర్మెస్టర్ 4D సౌండ్ సిస్టమ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి.
అంబానీ గ్యారేజీలో మేబ్యాక్ SL 680తో పాటు ఇప్పటికే అనేక అరుదైన కార్లు ఉన్నాయి.
రోల్స్ రాయిస్ కల్లినన్ (Rolls-Royce Cullinan): దీని ధర సుమారు రూ. 13 కోట్లు.
మెర్సిడెస్ మేబ్యాక్ S680 గార్డ్ (Mercedes-Maybach S680 Guard): ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు, దీని ధర దాదాపు రూ. 10 కోట్లు.
ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్ (Ferrari 812 Superfast): రేసింగ్ ప్రియుల కోసం.
బెంట్లీ బెంటాయ్గా (Bentley Bentayga): రాయల్ ఎస్‌యూవీ.
ఇప్పుడు ఈ రెండు స్పోర్టీ రోడ్‌స్టర్లు చేరడంతో అంబానీ కార్ల సేకరణ మరింత విభిన్నంగా మారింది. ఈ కార్లు అంబానీ లగ్జరీ అభిరుచికి, కార్ల పట్ల ఆయనకున్న మక్కువకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.


Click it and Unblock the Notifications








