పాస్‌పోర్ట్ లేకుండా బంగ్లాదేశ్‌లో ల్యాండ్ అయిన భారత ప్రయాణికులు.. లక్ అంటే మీదేనంటూ నెటిజన్ల కామెంట్స్
ముంబయి నుంచి అసోం గౌహతికి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం మంచు కురుస్తుండటంతో పరిస్థితుల ప్రభావం కారణంగా శనివారం(జనవరి 13 న) ఉదయం బంగ్లాదేశ్‌లో ల్యాండ్ అయింది. దీంతో 178 మంది ప్రయాణికులు పాస్‌పోర్టులు లేకుండానే బంగ్లాదేశ్‌లో ల్యాండ్ అయ్యారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ముంబయి నుంచి ఇండిగో ఫ్లైట్(Mumbai Guwahati Indigo Flight Landing In Dhaka) 6E 5319 ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం రాత్రి అస్సాంలోని గౌహతికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. దాదాపు 178 మంది ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకుని విమానం ఎక్కారు. కొన్ని గంటల్లో ప్రయాణికులందరూ గౌహతి విమానాశ్రయంలో ల్యాండింగ్ అవ్వాల్సి ఉంది.'

షెడ్యూల్ టైమ్ ప్రకారమే శుక్రవారం రాత్రి విమానం ముంబయి నుంచి గౌహతికి బయలుదేరింది. అయితే భారీగా మంచు కురుస్తుండటంతో పైలట్ అస్సాంలోని గౌహతి విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేయలేకపోయారు. దీంతో విమానాన్ని కోల్‌కతా విమానాశ్రయానికి తీసుకెళ్లాలని పైలట్ నిర్ణయించుకోగా.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు కూడా వాతావరణం అదే మాదిరిగా ఉండటంతో అక్కడ కూడా ల్యాండింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో పైలట్ ఒడిశాలోని భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ల్యాండింగ్ చేయాలని భావించారు. దాని కోసం భువనేశ్వర్ ఎయిర్‌పోర్టుకు అభ్యర్థనను పంపినప్పుడు.. అక్కడ రన్‌వే మూసివేయడంతో ఆ సమయంలో అక్కడ విమానం ల్యాండ్ చేయడానికి ఏర్పాట్లు చేయలేమని చేతులెత్తేశారు. దీంతో వేరే దారి లేక ఇండిగో 6E 5319 ఫ్లైట్ పైలట్.. బంగ్లాదేశ్‌లోని ఢాకా విమానాశ్రయంలో ల్యాండ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

ఇందుకోసం ఢాకాలోని ఎయిర్‌పోర్టు అధికారులను అనుమతి కోరారు. వారి నుంచి అనుమతి లభించడంతో బంగ్లాదేశ్‌లోని ఢాకా ఎయిర్‌పోర్టు(Indigo Flight Landing In Dhaka)లో ఇండిగో ఫ్లైట్‌ను ల్యాండ్ చేశారు. కానీ విమానం నుంచి ప్రయాణికులెవరూ దిగకూడదనే షరతుపై మాత్రమే ఈ అనుమతి మంజూరు చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలియజేయడంతో సరిగ్గా శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయింది.
అక్కడి నుంచి వాతావరణం తేలిపోయే వరకు ప్రయాణికులకు ఆశ్రయం కల్పించారు. ఆ సమయంలో వారికి భోజన సదుపాయం కల్పించారు. అంతేకాకుండా గౌహతి విమానాశ్రయంలో ఎందుకు దిగలేకపోయారో కూడా ప్రయాణికులకు వివరణ ఇచ్చారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఢాకా నుంచి గౌహతికి విమానాన్ని నడిపేందుకు ప్రత్యామ్నాయ సిబ్బందిని వినియోగించినట్లు ఢాకా విమానాశ్రయం అధికార ప్రతినిధి తెలిపారు. కాగా శనివారం ఉదయం 11 గంటలకు గౌహతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.
కాగా ఈ విమానంలో ముంబయి కాంగ్రెస్ నేత(Indigo Flight Landing In Bangladesh) సూరజ్ సింగ్ ఠాగూర్ ప్రయాణిస్తున్నారు. ఈ సంఘటన గురించి ఆయనే తన ఎక్స్ X(గతంలో ట్విట్టర్) సైట్‌లో పంచుకున్నారు. పొగమంచు కారణంగా పాస్‌పోర్ట్ లేకుండానే అంతర్జాతీయ పర్యటనకు వెళ్లినట్లు చమత్కరించారు. గౌహతిని మంచు కప్పేయడంతో ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగడానికి వీలుపడలేదని.. దీంతో తాము ఢాకాలో ల్యాండ్ అయ్యామని చెప్పారు.
సాధారణంగా ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ అవసరం. కస్టమ్స్ అధికారుల తనిఖీలు ఉంటాయి. వీటన్నింటి తర్వాతే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ 178 మంది ప్రయాణికులు దేశీయ విమానంలో పాస్‌పోర్ట్ లేకుండా విదేశాలకు వెళ్లడంతో నెటిజన్లు కంగ్రాచ్యులేషన్స్ అంటూ అభినందిస్తున్నారు.


Click it and Unblock the Notifications








