రాత్రివేళల్లో స్వయంగా ప్రకాశించే రోడ్డు!
చిమ్మ చీకటిగా ఉండే రోడ్డుపై ఎలాంటి వీధి లైట్లు లేకుండానే కాంతి వస్తే ఎలా ఉంటుంది..? ఏంటీ కల కంటున్నారా.. అంటారా..? కానీ ఈ కలం త్వరలోనే నిజం కానుంది. వీధి లైట్లు అవసరం లేకుండానే స్వయంగా ప్రకాశించే రోడ్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటికే ఈ తరహా స్వయం ప్రకాశిత రోడ్లను నెథర్లాండ్స్‌లో ప్రయోగపూర్వకంగా పరీక్షించారు. గ్లో ఇన్ ది డార్క్ రోడ్ (చీకటిలో ప్రకాశించే రోడ్డు) స్మార్ట్ హైవేను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోడ్డును అభివృద్ధి చేశారు.
డాన్ రూస్‌గార్డ్ అనే డిజైనర్ మరియు పరిశోధకుడు డచ్ సివిల్ ఇంజనీరింగ్ సంస్థ హీజ్‌మ్యాన్స్‌తో కలిసి ఈ తరహా రోడ్లకు జీవం పోశారు. దాదాపు 500 మీటర్ల రహదారిని ఏర్పాటు చేసి, అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.

ఫోటో ల్యూమినైజింగ్ పౌడర్ కలిగిన పెయింట్‌తో రోడ్డుపై మార్కింగ్స్ వేస్తారు. ఈ ఫోటో ల్యూమినైజింగ్ పౌడర్‌కు ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. అదేంటంటే, ఈ పౌడర్ పగటిపూట సూర్యకాంతిని గ్రహించి చార్జ్ అయ్యి, రాత్రివేళల్లో నెమ్మదిగా కాంతిని విడుదల చేస్తూ లైట్ గ్రీన్ కలర్‌లో ప్రకాశిస్తూ ఉండి (రేడియం మాదిరిగా) వాహనా చాలకులకు దారి చూపుతుంది.
సూర్యకాంతిని గ్రహించే ఈ పెయింట్ రాత్రివేళల్లో 8 గంటల పాటు ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇక రోడ్లపై వీధి లైట్లను ఏర్పాటు చేయటం, వాటికి కరెంటును అందించటం వంటి సమస్యలు ఉండవు.
ఈ విశిష్ట టెక్నాలజీని ఈనెలలోనే అధికారికంగా విడుదల చేయనున్నారు, దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తే త్వరలోనే నెథర్లాండ్స్ రోడ్లన్నీ ఈ గ్లోయింగ్ పెయింట్‌తో వెలిగిపోనున్నాయి. దీని వలన కోట్ల రూపాయల విద్యుచ్ఛక్తి ఆదా అవుతుంది. మరి నచ్చిందా ఈ అద్భుతమైన టెక్నాలజీ.


Click it and Unblock the Notifications








