ఈ రోజు నుంచి షోరూమ్‌లలో సందడే సందడి.. జీఎస్టీ తగ్గింపు + ఆఫర్లతో కార్లు, బైకుల ధరలు భారీగా డౌన్
దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంస్కరణలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇప్పటి వరకు వాహనాలపై 28 శాతం పన్ను విధించగా, ఇక నుంచి అది కేవలం 18 శాతం మాత్రమే ఉండనుంది. ఈ మార్పు వల్ల ఆటోమొబైల్ మార్కెట్ కొత్త ఉత్సాహాన్ని సంతరించుకోబోతోంది. జీఎస్టీ తగ్గింపుతో ఇప్పటికే ప్రధాన కార్ల కంపెనీలు తమ కొత్త ధరలను ప్రకటించాయి. మారుతి సుజుకి నుంచి టాటా, మహీంద్రా, హ్యుందాయ్ వరకు అన్ని ప్రముఖ సంస్థలు తగ్గిన ధరల జాబితాను విడుదల చేశాయి. ఇవి ఈ రోజు నుంచి అధికారికంగా అమలులోకి రానుండగా, కొనుగోలు దారులకు ఇది నిజంగా బంగారు అవకాశమని చెప్పవచ్చు.
ఎందుకంటే ఈ తగ్గింపు వాహనాల ధరలో లక్షల్లో తేడా తీసుకొస్తుంది. దీనితో పాటు, దసరా పండుగ సీజన్ ఉండటంతో ఆటో కంపెనీలు ఇప్పటికే ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, జీరో ఇంటరెస్ట్ లోన్లు వంటి ఆఫర్లను జీఎస్టీ తగ్గింపుతో కలిపి లెక్కిస్తే, వాహనం కొనాలనుకునే వారికి ఇంతకుముందెన్నడూ లేని విధంగా ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ రోజు నుంచి, బైకులు, కార్లను అత్యంత తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు.

కుటుంబం కోసం చిన్న కారు కొనాలనుకున్నా, కలల SUVని తీసుకోవాలనుకున్నా లేదా కొత్త బైక్ పై రోడ్ మీద దూసుకెళ్లాలనుకున్నా, రోజు నుంచే కొనుగోలు ప్రారంభిస్తే వేలల్లో, లక్షల్లో డబ్బు ఆదా అవుతుంది. అందువల్ల, వాహనం కొనుగోలు చేయాలని ఎప్పటినుంచో ఆలోచిస్తున్నవారికి ఈ జీఎస్టీ సంస్కరణలు, పండుగ ఆఫర్లతో కలిపి నిజంగా పెద్ద లాభాలను అందిస్తున్నాయి. ఈ రోజు నుంచి ఆటోమొబైల్ షోరూమ్‌ల వద్ద కస్టమర్ల రద్దీ పెరగడం ఖాయం.
ఆటోమొబైల్ రంగంలో ముందంజలో ఉన్న అన్ని కంపెనీలు తగ్గింపు అందిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తన వాహనాల ధరలను గరిష్టంగా రూ.1.29 లక్షల వరకు తగ్గించింది. ఎస్-ప్రెస్సో, ఆల్టో K10, సెలెరియో, వ్యాగన్‌ఆర్, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6, ఇన్విక్టో, ఈకో వంటి దాదాపు అన్ని పాపులర్ మోడళ్లపై ఈ తగ్గింపు వర్తించింది.

ముఖ్యంగా ఎస్-ప్రెస్సో, సెలెరియో వంటి చిన్న కార్లు కేవలం రూ.3.50 లక్షల ఎక్స్‌షోరూమ్ ధర నుంచే అందుబాటులోకి రావడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద వరంలా మారింది. అలాగే, టాటా మోటార్స్ కూడా ధరల సవరణను ప్రకటించింది. ఈ కంపెనీ కార్ల ధరలు రూ.75,000 నుంచి గరిష్టంగా రూ.1.45 లక్షల వరకు తగ్గించబడ్డాయి. నెక్సాన్, టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ వంటి మోడళ్లపై ఊహించని స్థాయిలో తగ్గింపులు రావడం వినియోగదారులలో ఉత్సాహాన్ని నింపుతోంది.
దక్షిణ కొరియా దిగ్గజం కియా మోటార్స్ ఇండియా కూడా వెనుకంజ వేయకుండా తన ప్రీమియం మోడళ్లపై భారీ ఎత్తున తగ్గింపులను ప్రకటించింది. సోనెట్, సైరస్, సెల్టోస్, క్యారెన్స్, క్యారెన్స్ క్లావిస్, కార్నివాల్ వంటి మోడళ్లపై తగ్గింపులు అమలులోకి వచ్చాయి. ప్రత్యేకంగా కొన్ని మోడళ్లపై ఏకంగా రూ.4.48 లక్షల వరకు ధరలు తగ్గడం కియా అభిమానులకు నిజమైన సర్ప్రైజ్ అని చెప్పవచ్చు.

కార్లతో పాటు బైకులు, స్కూటర్లు కూడా భారీగా ధరలు తగ్గాయి. హీరోకి చెందిన డెస్టిని 125, HF డీలక్స్, స్ప్లెండర్, గ్లామర్ వంటివి, హోండా కంపెనీకి చెందిన యాక్టివా, షైన్ , డియో, బజాజ్ కు చెందిన ప్లాటినా పల్సర్ 150, సిటి 100, ఫ్రీడమ్ 125, పల్సర్ 125, NS125, రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350, హాంటర్ 350 వంటివి తక్కువ ధరకు లభిస్తాయి.
మొత్తానికి, జీఎస్టీ రేటు తగ్గింపుతో ప్రారంభమైన ఈ ధరల సంబరాలు ఆటోమొబైల్ మార్కెట్‌లో కొత్త జోష్‌ని తెచ్చాయి. ఇప్పటివరకు వాహనం కొనాలని ఆలోచిస్తూ వెనుకాడిన వారు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటే, లక్షల రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశముంది. ఇక పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుంటే, ఈ వారాల్లో కార్ల షోరూమ్‌లు కస్టమర్లతో కిటకిటలాడడం ఖాయం.


Click it and Unblock the Notifications








