వాహనదారులకు అలర్ట్..ఏప్రిల్ 2026 నుంచి పెట్రోల్ బంకుల్లో కొత్త పెట్రోల్..కేంద్రం కీలక ఆదేశాలు
భారతదేశ ఇంధన రంగంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. పర్యావరణాన్ని కాపాడటం, విదేశాల నుంచి కొనే ఆయిల్ ఖర్చు తగ్గించుకోవడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 95 RON (రీసెర్చ్ ఆక్టేన్ నంబర్) ఉన్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే అమ్మాలని చమురు కంపెనీలను ఆదేశించింది. ఫిబ్రవరి 17న ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, ఇకపై పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం (E20 ఇంధనం) తప్పనిసరి. ఈ నిర్ణయం వల్ల రైతులకు లాభం కలగడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది.
ఏమిటీ E20 పెట్రోల్?
మనం వాడే మామూలు పెట్రోల్‌లో ఇథనాల్ అనే ఆల్కహాల్‌ను కలపడాన్నే ఇథనాల్ బ్లెండింగ్ అంటారు. E20 అంటే ఇందులో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటాయి. ఈ ఇథనాల్‌ను మొక్కజొన్న, ధాన్యాలు, చెరకు పిప్పి నుంచి తయారు చేస్తారు. ఇది పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన ఇంధనం. దీనివల్ల గాలి కాలుష్యం తగ్గుతుంది. గత పదేళ్లలో ఇలా ఇథనాల్ కలపడం వల్ల దేశానికి సుమారు రూ.1.40 లక్షల కోట్ల విదేశీ కరెన్సీ ఆదా అయ్యింది. అందుకే 2030 నాటికి అనుకున్న ఈ లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుగానే పూర్తి చేయాలని చూస్తోంది.

95 RON అంటే ఏంటి? ఇంజిన్‌కు ఎలా మేలు?
పెట్రోల్ బంకుల్లో మనకు 95 RON అనే మాట వినిపిస్తుంటుంది. ఆక్టేన్ నంబర్ అంటే.. ఇంజిన్ లోపల ఇంధనం ఎంత సాఫీగా మండుతుంది అని చెప్పే లెక్క. ఈ నంబర్ తక్కువగా ఉంటే ఇంజిన్‌లో నాకింగ్ అనే శబ్దం వస్తుంది. అంటే ఇంధనం సరిగ్గా మండక పేలుళ్లు వచ్చినట్టుగా శబ్దం వస్తూ ఇంజిన్ భాగాలు దెబ్బతింటాయి. ఇథనాల్‌కు సహజంగానే ఎక్కువ ఆక్టేన్ పవర్ ఉంటుంది. కాబట్టి పెట్రోల్‌లో ఇథనాల్ కలిపినప్పుడు ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా కొత్త రకం కార్లు, బైక్‌ల ఇంజిన్లు పాడవకుండా ఉండటానికే ప్రభుత్వం ఈ 95 RON నిబంధన పెట్టింది.
మైలేజీ తగ్గుతుందా?
చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇదే. నిజానికి మామూలు పెట్రోల్ కంటే ఇథనాల్‌లో శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. దీనివల్ల బండి మైలేజీ 3 నుండి 7 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బండి లీటరుకు 20 కిలోమీటర్లు ఇస్తుంటే, ఈ కొత్త పెట్రోల్‌తో అది 19 కిలోమీటర్లకు పడిపోవచ్చు. అయితే 2023 తర్వాత వచ్చిన కొత్త వాహనాలపై ఈ ప్రభావం పెద్దగా ఉండదు. పాత వాహనాల్లో మాత్రం స్వల్ప తేడా కనిపిస్తుంది.
పాత బండ్లు పాడైపోతాయా?
పాత వాహనాల్లోని పైపులు, సీల్స్ వంటి రబ్బరు భాగాలు కేవలం పెట్రోల్ కోసమే తయారయ్యాయి. ఇథనాల్ వల్ల కాలక్రమేణా ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. కానీ దీనికి భయపడాల్సిన పని లేదు. మార్కెట్లో ఇప్పటికే వీటికి సంబంధించిన కన్వర్షన్ కిట్లు దొరుకుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి కంపెనీలు ఇలాంటి కిట్లను తెచ్చాయి. బండిని సర్వీసింగ్ చేయించేటప్పుడు పెట్రోల్ ఫిల్టర్ మార్చుకోవడం, చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

పర్యావరణం, రైతులకు లాభం
చెరకు నుంచి తీసే ఇథనాల్ వల్ల కాలుష్యం 65 శాతం వరకు తగ్గుతుంది. మొక్కజొన్నతో 50 శాతం కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ లాంటి నగరాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకో వైపు ఇథనాల్ వాడకం పెరిగితే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. పంట వ్యర్థాల నుంచి కూడా దీనిని తయారు చేయవచ్చు కాబట్టి రైతులకు ఇది లాభసాటిగా మారుతుంది.
నడిపేటప్పుడు ఎలా ఉంటుంది?
E20 ఇంధనం వాడటం వల్ల బండి వేగం పుంజుకోవడం (యాక్సిలరేషన్) బాగుంటుందని పరిశోధనల్లో తేలింది. సిటీ ట్రాఫిక్‌లో బండి నడపడం చాలా సాఫీగా ఉంటుంది. ఇంజిన్ లోపల వేడి కూడా తగ్గుతుంది. మైలేజీలో వచ్చే చిన్న తేడా కంటే కాలుష్యం తగ్గడం, దేశానికి మేలు జరగడం అనేది మనందరికీ మంచి విషయమే.


Click it and Unblock the Notifications








