కారు కొన్న రోజే యాక్సిడెంట్.. ఫ్లైఓవర్ పై నుంచి నదిలో పడిన కారు.. ఆ తర్వాత!!
ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు ముఖ్యంగా కారు లేదా బైక్ కొనుగోలు చేసినట్లయితే వాటిని చాలా అపురూపంగా చూసుకుంటారు. కొందరు తాము ఇష్టంగా కొనుగోలు చేసిన వాహనానికి చిన్న మరక పడినా తట్టుకోలేరు. కానీ ఇక్కడ కారును కొనుగోలు చేసిన మొదటి రోజే తీవ్రమైన చేదు అనుభవాన్ని చవిచూశాడు ఓ యజమాని. అసలేం జరిగిందంటే..
కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందాన్ని కాసేపైనా ఆస్వాదించకముందే ఓ యజమానికి అనుకోని షాక్ తగిలింది. కారును డెలివరీ తీసుకున్న రోజే ఈ ఘటన జరిగింది. గుజరాత్‌లోని బిల్మోరాలో ఇటీవల ఈ సంఘటన చోటుచేసుకుంది. కొత్తగా హ్యుందాయ్ వెర్నా(Hyundai Verna)ను డెలివరీ తీసుకున్న యజమానికి ఆ ఆనందం ఒక్కరోజు కూడా లేదు.

హ్యుందాయ్ వెర్నా(Hyundai Verna) కారు కొన్న ఆనందంలో అందులో తన స్నేహితులను ఎక్కించుకుని అర్ధరాత్రి డ్రైవ్‌కు వెళ్లాడు వెర్నా యజమాని. ఈ క్రమంలో హ్యుందాయ్ వెర్నా ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు కారు వంతెనపై నుంచి పడి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ప్రమాదం జరిగిన ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి కారు కాస్త వేగంతో ఉంది. అనంతరం వేగాన్ని అదుపులోకి తెచ్చేందుకు డ్రైవర్ బ్రేక్‌లు వేసేందుకు ప్రయత్నించాడు. అయితే బ్రేక్‌కి బదులు యాక్సిలరేటర్ పెడల్‌ను తొక్కాడు. దీంతో హ్యుందాయ్ వెర్నా కారు అధిక వేగంతో దూసుకెళ్లి రెప్పపాటు సమయంలో ఫ్లై ఓవర్‌ను ఢీకొని నదిలో పడిపోయింది.

అదృష్టవశాత్తూ నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోలేదు. కానీ కారు పడిన ప్రాంతంలో బురద ఉండటంతో వాహనం మొత్తం బురదమయమైంది. ఘటనలో కారు స్వల్వంగా మాత్రమే దెబ్బతింది. కానీ నీటి ప్రవాహం అధికంగా ఉంటే ప్రభావం మరింత తీవ్రంగా ఉండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో కారును పైకి చేర్చారు. అదృష్టవశాత్తు వెర్నాలో ఉన్న ముగ్గురికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా సురక్షితంగా బయటపడ్డారు. వీడియో, ఫొటోలను పరిశీలిస్తే వాహనం అతి తక్కువగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

కారు నదిలోకి పడినప్పుడు తలక్రిందులుగా పడి ఉండటాన్ని గమనించవచ్చు. పైకప్పుపై పెద్ద డెంట్ తప్ప, ఎటువంటి నష్టం జరగలేదు. కనీసం 20 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనపై నుంచి పడిపోయిన తర్వాత కూడా అది ఇంత తక్కువ నష్టాన్ని చవిచూసిందంటే ఆశ్చర్యమే. కానీ నష్టం పెద్దగా వాటిల్లకపోయినా కారు కొన్న సంతోషం యజమానికి ఒక్కరోజు కూడా లేదన్నది నిజం.
సేఫ్టీలో వెర్నా భేష్: కాగా ప్రమాదంలో డ్యామేజ్ అయిన కారు ఏ వేరియంట్ అనేది స్పష్టత లేదు. కానీ కొత్త హ్యుందాయ్ వెర్నా టాప్ వేరియంట్లలో 30 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఇది అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)తో సహా మరింత భద్రతా సాంకేతికతతో తయారు చేయబడింది.
ప్రామాణిక భద్రతా లక్షణాలలో భాగంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్‌లు, మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ఇంపాక్ట్-సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ABS, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హెడ్‌ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్, ISOFIX, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఇలా అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఆల్-డిస్క్ బ్రేక్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, TPMS, కార్నరింగ్ ల్యాంప్స్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే అందుకే కారు అంత లోతుకు పడిపోయినా, సేఫ్టీ ఫీచర్ల వల్లే ప్రయాణికులు బతికిపోయారన్నది వాస్తవం.
భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ. 10,96,500 ప్రారంభ ధర నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ కారుకు భారతీయ ఆటో మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. హ్యుందాయ్ మోటార్స్ పూర్తిగా భిన్నమైన ఫీచర్లు ఆకర్షణీయమైన లుక్‌తో హ్యుందాయ్ వెర్నా కారును సిద్ధం చేసి మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications








