వాహనదారులకు NHAI షాక్.. ఫాస్టాగ్‌లో ఈ తప్పు ఉంటే ఇక అంతే.. వెంటనే అకౌంట్ బ్లాక్
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. మీ ఫాస్టాగ్ (FASTag) విషయంలో మీరు చేసే చిన్న పొరపాటు మీ ప్రయాణాన్ని నరకప్రాయంగా మార్చేస్తుంది. ఫాస్టాగ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, బ్యాంకింగ్ సంస్థలకు ఎన్‌హెచ్ఏఐ కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) సరిగ్గా లేని లేదా చెల్లుబాటు కాని ఫాస్టాగ్ అకౌంట్లను వెంటనే బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని స్పష్టం చేసింది. డిజిటల్ టోల్ వసూళ్లలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు వాహనదారుల్లో చర్చనీయాంశమైంది.
NAHI కఠిన ఆదేశాలు - అసలేం జరిగింది?
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజాగా ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకులకు ఒక పక్కా ఆదేశాన్ని జారీ చేసింది. తమ ద్వారా ఫాస్టాగ్ పొందిన ప్రతి వాహనదారుడి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN)ను వెంటనే వెరిఫై చేయాలని కోరింది. ఒకవేళ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పుగా ఉన్నా, లేదా ఒక వాహన నంబర్‌తో మరొక వాహనం ఫాస్టాగ్ వాడుతున్నా అటువంటి వాటిని తక్షణమే బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని సూచించింది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC) వ్యవస్థలో డేటా ఖచ్చితత్వాన్ని పెంచడం, టోల్ ఎగవేతను అరికట్టడమే ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది?
టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ రీడర్లు రికార్డ్ చేస్తున్న వాహన నంబర్లకు, కారు నంబర్ ప్లేటుపై ఉన్న నంబర్లకు మధ్య భారీగా తేడాలు ఉన్నట్లు ఎన్‌హెచ్ఏఐ గమనించింది. చాలా మంది వాహనదారులు ఒక వాహనం పేరు మీద ఫాస్టాగ్ తీసుకుని, దానిని వేరే వాహనాలకు ఉపయోగిస్తున్నారు. మరికొందరు తమ ఫాస్టాగ్‌ను కారు అద్దానికి అంటించకుండా జేబులో పెట్టుకుని, టోల్ వద్ద మాత్రమే స్కానర్ దగ్గర చూపిస్తున్నారు. దీనివల్ల చట్ట అమలు యంత్రాంగాలు బలహీనపడటమే కాకుండా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. అందుకే మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Vahan డేటాబేస్‌తో అనుసంధానం
గతంలో ఫాస్టాగ్ జారీ చేసే ప్రక్రియ అంతా మాన్యువల్‌గా జరిగేది. దీనివల్ల వెరిఫికేషన్ పద్ధతులు పరిమితంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఫాస్టాగ్ జారీ చేసే ప్రతి బ్యాంక్ తప్పనిసరిగా వాహన్ (Vahan) డేటాబేస్‌తో వివరాలను సరిపోల్చుకోవాలి. పాత ఫాస్టాగ్‌లు ఉన్నవారు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని కేంద్ర రవాణా శాఖ గుర్తించింది. రాబోయే రోజుల్లో మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోలింగ్ వంటి అధునాతన సాంకేతికతలు వస్తున్న తరుణంలో, ఈ డేటా సరిగ్గా ఉండటం అత్యంత అవసరం.

ఓవర్ లోడింగ్ పై 4 రెట్ల జరిమానా
కేవలం నంబర్ ప్లేట్ నిబంధనలే కాకుండా.. ఏప్రిల్ 15 నుంచి మరో కఠిన నియమం కూడా అమలులోకి వచ్చింది. నేషనల్ హైవేలపై వెళ్లే వాహనాలు నిర్దేశిత సామర్థ్యం కంటే ఎక్కువ బరువు (Overloading) మోసుకెళ్తే, ఫాస్టాగ్ ద్వారా వసూలు చేసే జరిమానాను 4 రెట్లు పెంచారు. ఇది ముఖ్యంగా రవాణా వాహనాలకు పెద్ద భారంగా మారనుంది. నిబంధనల ప్రకారం కాకుండా ఓవర్ లోడ్ తో వెళ్లే లారీలు, ట్రక్కులు ఇకపై భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
వాహనదారులు ఏం చేయాలి?
మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ పనులు చేయండి. మొదట మీ ఫాస్టాగ్ మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌తోనే లింక్ అయి ఉందో లేదో మీ బ్యాంక్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోండి. కేవైసీ (KYC) వివరాలు పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయండి. ఫాస్టాగ్‌ను ఎప్పుడూ కారు విండ్‌షీల్డ్ పైనే అంటించి ఉంచాలి. పర్సులోనో, డ్యాష్ బోర్డ్ మీదో పెట్టుకుంటే అది నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. పొరపాటున మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ అయితే, మీరు టోల్ వద్ద రెట్టింపు లేదా నాలుగు రెట్ల నగదు చెల్లించాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.
ప్రభుత్వ హెచ్చరిక - మీ బాధ్యత
టోల్ ప్లాజాల వద్ద ప్రయాణం సాఫీగా సాగాలన్నా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ప్రతి వాహనదారుడు నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. తప్పుడు మార్గాల్లో టోల్ ఎగవేసేందుకు ప్రయత్నిస్తే కేవలం ఫాస్టాగ్ బ్లాక్ అవడమే కాకుండా, చట్టపరమైన జరిమానాలు కూడా పడతాయి. ఇప్పటికే బ్యాంకులు తమ కస్టమర్లకు మెసేజ్‌ల ద్వారా అలర్ట్ పంపిస్తున్నాయి. ప్రయాణానికి ముందే మీ ఫాస్టాగ్ స్టేటస్‌ను చెక్ చేసుకుని, నిరంతరాయంగా ప్రయాణించండి.


Click it and Unblock the Notifications








