గలీజు టాయిలెట్ ఫోటో తీసి పంపండి.. రూ.1000 గెలుచుకోండి.. కేంద్రం బంపర్ ఆఫర్
హైవేల మీద ప్రయాణించేటప్పుడు చాలా మంది ప్రజలు మురికిగా ఉండే పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించడానికి వెనుకాడుతుంటారు. ఈ సమస్యను అధిగమించి స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రోత్సహించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైవేపై ప్రయాణించేటప్పుడు ఏదైనా పబ్లిక్ టాయిలెట్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి, ఆ సమాచారాన్ని NHAI కి అందిస్తే, ఆ వ్యక్తికి రూ.1000 బహుమతి ఇవ్వనుంది. ఈ మొత్తం ఫాస్టాగ్ రీఛార్జ్ రూపంలో లభిస్తుంది.
స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రోత్సహించడానికి ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. హైవేలపై ఉన్న పబ్లిక్ టాయిలెట్లలో ఎక్కడైనా అపరిశుభ్రత కనిపిస్తే, దాని గురించి NHAIకి సమాచారం అందించిన ప్రయాణికులకు రూ.1000 రివార్డు లభిస్తుంది. ఈ రివార్డును ఫాస్టాగ్ రీఛార్జ్ రూపంలో అందిస్తారు. ఈ పథకం వివరాలు, ఫిర్యాదు చేసే విధానం ఇక్కడ తెలుసుకుందాం.

NHAI ఇటీవల స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రోత్సహించడానికి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. హైవేలపై ప్రయాణించేవారికి మెరుగైన పరిశుభ్రత సదుపాయాలు కల్పించడం, వాటి నిర్వహణను పర్యవేక్షించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. హైవేపై నిర్మించిన టాయిలెట్లలో ఎక్కడైనా అపరిశుభ్రత కనిపిస్తే, ఆ సమాచారాన్ని NHAIకి అందించిన వ్యక్తికి రూ.1000 రివార్డు ఇస్తారు. ఈ రివార్డును నగదు రూపంలో కాకుండా, వారి ఫాస్టాగ్ రీఛార్జ్ రూపంలో అందిస్తారు.
NHAI ప్రారంభించిన ఈ కొత్త పథకం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. అక్టోబర్ 31, 2025 వరకు కొనసాగుతుంది. ఈ పథకం లక్ష్యం ప్రయాణీకులకు మెరుగైన పరిశుభ్రత సౌకర్యాలను అందించడం, జాతీయ రహదారులపై పరిశుభ్రతను కొనసాగించడం. ఈ పథకం కింద ఫిర్యాదు చేసిన వారికి రూ. 1000 విలువైన ఫాస్టాగ్ రీఛార్జ్ బహుమతిగా లభిస్తుంది. వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మాన్యువల్ వెరిఫికేషన్ ద్వారా అధికారులు తనిఖీ చేస్తారు.

ఫిర్యాదు చేసే విధానం, పాటించాల్సిన నియమాలు
ఈ పథకంలో పాల్గొని రివార్డు పొందాలంటే కొన్ని నిర్దిష్ట పద్ధతులను పాటించాలి. ముందుగా మీ మొబైల్‌లో రాజ్‌మార్గ్ యాత్ర (RajmargYatra App) యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
గలీజుగా ఉన్న టాయిలెట్ క్లియర్ ఫోటోను, జియో-ట్యాగ్డ్, టైమ్-స్టాంప్డ్ వివరాలతో సహా యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. అంటే, ఫోటో తీసిన ప్రదేశం, సమయం కచ్చితంగా ఉండాలి. ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత మీ పేరు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ (VRN), ఆ టాయిలెట్ ఉన్న లొకేషన్, మీ మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. మీ సమాచారం సరిగ్గా ఉన్నట్లు కన్ఫాం చేసినట్లు అయితే, NHAI మీ ఫాస్టాగ్ ఖాతాలో రూ.1000 రీఛార్జ్ చేస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు
ఈ పథకం కింద ఫిర్యాదు చేసేవారు కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకోవాలి. ఈ పథకం కేవలం NHAI నిర్మించిన, నిర్వహించే టాయిలెట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. పెట్రోల్ బంకులు, ధాబాలు లేదా ఇతర ప్రైవేట్ ప్రాంతాలలో ఉన్న టాయిలెట్‌లకు ఇది వర్తించదు.
ఒక వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌కు పథకం అమలులో ఉన్న సమయంలో ఒకే ఒక్క రివార్డు మాత్రమే లభిస్తుంది. ఒకే టాయిలెట్‌పై చాలా మంది ఫిర్యాదు చేసినా, మొదట రిపోర్ట్ చేసిన వ్యక్తికి మాత్రమే రివార్డు లభిస్తుంది. అప్‌లోడ్ చేసిన ఫోటో ఒరిజినల్‌గా ఉండాలి. దానిని యాప్ ద్వారానే తీసి ఉండాలి. ఫోటోలను మార్చడం లేదా పాత ఫోటోలు అప్‌లోడ్ చేయడం వంటివి చేస్తే ఫిర్యాదును తిరస్కరిస్తారు.


Click it and Unblock the Notifications








