హైదరాబాద్ వాసులకు క్యాబ్ డ్రైవర్ల షాక్.. కార్లలో ‘NO AC' అంటూ క్యాంపెయిన్..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు(Summer Heat) అల్లాడిపోతున్నారు. ఇక వాహనదారులకు అయితే ప్రయాణంలో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకే చాలా మంది ఈ హాట్ సమ్మర్‌లో ఎక్కువగా క్యాబ్‌లపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కస్టమర్లకు క్యాబ్ డ్రైవర్లు గట్టి షాక్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 'No AC' క్యాంపెయిన్ నడుస్తోంది. క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన ఈ ప్రచారంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాధారణ ఎండలకే కారులో ఏసీ లేకుండా ప్రయాణించడం కష్టమవుతుండగా.. 42 డిగ్రీల ఉష్ణోగ్రతతో మండిపోతున్న ఈ వేసవికి క్యాబ్ డ్రైవర్లు ఏసీ ఆన్ చేయడం లేదు. అయితే క్యాబ్‌లలో ఏసీ ఆన్ చేయకపోవడానికి గల కారణాలేంటంటే.!!

హైదరాబాద్ మహా నగరం(Cab Drivers No AC Campaign)లో ఓలా, ర్యాపిడో, ఉబర్ క్యాబ్‌లకు ఆదరణ ఎక్కువగా ఉంది. ఆఫీసులు, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్ ఇంకా దూర ప్రాంతాలు ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా చాలా మంది క్యాబ్‌లపైనే ఆధారపడుతున్నారు. చాలా తక్కువ ఖర్చులో ఎంచక్కా ఏసీ ఆన్ చేసుకుని వెళ్లిపోవచ్చు. ఈ వేసవిలో అయితే క్యాబ్‌ల్లో ఇక ఏసీ లేకుండా వెళ్లడం కష్టం.
అయితే ఇప్పుడు ప్రయాణికులకు క్యాబ్ డ్రైవర్లు(No AC Campaign In Hyderabad) ఏసీ విషయంలో అనుకోని షాకిచ్చారు. క్యాబ్ ఎక్కిన ప్రయాణికులకు సారీ నో ఏసీ అంటూ బోర్డు పెట్టేస్తున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న ప్రయాణికులు కారు ఎక్కిన తర్వాత ఏసీ ఆన్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ ఆన్ చేయమని కోరితే టిప్ లేదా అదనపు ఛార్జీలు చెల్లిస్తే ఆన్ చేస్తామని చెబుతున్నారు.
గత రెండురోజులుగా హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు తమను అర్థం చేసుకోవాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. అయితే ఇందుకు గల కారణాలేంటంటే.. ఏసీతో నడిపించాలంటే అగ్రిగేటర్ సంస్థలు చెల్లించే కమీషన్ సరిపోవడం లేదని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. ఈ మేరకు క్యాబ్ డ్రైవర్లకు మద్దతుగా తెలంగాణ గ్రిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్ల యూనియన్(TGPWU) వాదిస్తోంది.
ఏసీ ఆన్ చేయడం ద్వారా డీజిల్ ఎక్కువగా తీసుకుంటుందని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. క్యాబ్ బుకింగ్‌లో అగ్రిగేటర్ కమీషన్ పోను వచ్చే ఆదాయం.. ఏసీ ఛార్జీలకే పోతుందని.. తమకు ఏం మిగలట్లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో డ్రైవర్లకు కమీషన్లు పెంచాలని క్యాబ్ అగ్రిగేటర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు యూనియన్ చెబుతోంది. లేదా కర్ణాటకలో మాదిరిగా క్యాబ్‌లకు యూనిఫాం ధరలు అమలు చేయాలని కోరుతోంది.
ఏది ఏమైనప్పటికీ క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన No AC Campaign In Cabs తీరుతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పీక్ అవర్స్, ఇతర ఛార్జీల పేరుతో కొన్నిసార్లు తక్కువ దూరానికి కూడా క్యాబ్ అగ్రిగేటర్లు అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారని ప్రయాణికులు అంటున్నారు. ఇప్పుడు ఏసీ సర్వీస్ పేరుతో అదనంగా ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయా సంస్థలతో క్యాబ్ డ్రైవర్లు చర్చలు జరిపి తేల్చుకోవాలని.. ఇలా ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రయాణికులు అంటున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత ఇలా నో ఏసీ అంటూ చెప్పడమేంటని వాదిస్తున్నారు. అయితే క్యాబ్ డ్రైవర్ల నో ఏసీ క్యాంపెయిన్‌పై అగ్రిగేటర్లు స్పందించారు.
క్యాబ్‌ల్లో ఏసీ ఆన్ చేయకపోతే చర్యలు తప్పవని సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడితే ట్రిప్ ఛార్జీల్లో 25 శాతం కోత విధిస్తామని.. అంతేకాకుండా వారి అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తామని స్పష్టం చేశాయి. ఈ ప్రభావం ఇన్సెంటివ్స్‌పై కూడా పడుతుందని వెల్లడించాయి. అయినప్పటికీ.. 'నో ఏసీ క్యాంపైన్'పై మాత్రం క్యాబ్ డ్రైవర్లు పట్టు వీడడం లేదు.


Click it and Unblock the Notifications








