ఇక రోడ్ల మీద ఛార్జింగ్ అయిపోందన్న బాధలేదు.. ఏపీ, తెలంగాణలో 14 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు..24 గంటలు సేవలు!
మీకు ఎలక్ట్రిక కారు ఉండి ఏపీ, తెలంగాణ హైవే రోడ్ల మీద ప్రయాణిస్తున్నారా.. అయితే, ఇకపై మీ కారు చార్జింగ్ మధ్యలో అయిపోతుందనే భయం అక్కర్లేదు. దేశంలోనే అతిపెద్ద ఫోర్ వీలర్ ఈవీ తయారీ సంస్థ అయిన టాటా.ఈవీ (TATA.ev), వోల్ట్రాన్ (Voltron) సంస్థతో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకంగా 14 భారీ ఫాస్ట్-చార్జింగ్ కేంద్రాలను (Fast-Charging Stations) ప్రారంభించింది.
ఈ కేంద్రాలు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకే కాక, చెన్నై-హైదరాబాద్‌ను కలిపే ముఖ్యమైన రహదారిపై ఏర్పాటు కావడంతో తమిళనాడులోని ఈవీ వాహనదారులకు కూడా ఎంతో మేలు చేయనున్నాయి. ఈ కొత్త చార్జింగ్ స్టేషన్ల ప్రత్యేకతలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఛార్జింగ్‌పై రాయితీ వివరాలు తెలుసుకుందాం.

టాటా.ఈవీ, తన ఓపెన్ పార్ట్‌నర్‌షిప్ 2.0(Open Partnership 2.0) పథకంలో భాగంగా, వోల్ట్రాన్ సంస్థతో కలిసి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో 14 పెద్ద ఫాస్ట్-చార్జింగ్ కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాలు ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా చెన్నైకి వెళ్లే ప్రధాన రహదారులపై ఏర్పాటు చేశారు.
ఆంధ్రా, తమిళనాడు (Tamilnadu) రాజధానులను కలిపే ఈ మార్గంలో ప్రతి 100 కిలోమీటర్ల దూరంలో ఒక చార్జింగ్ కేంద్రం ఉండేలా దాదాపు 450 కిలోమీటర్ల పొడవునా ఈ నెట్‌వర్క్‌ను విస్తరించారు. చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించే ఈవీ వాహనదారులు, ఒంగోలు, నెల్లూరు హైవేలపై తమ వాహనాలను ఛార్జ్ చేసుకుంటూ హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు.

ఈ కొత్త చార్జింగ్ కేంద్రాలు కేవలం ఛార్జింగ్ సదుపాయాన్ని మాత్రమే కాక, ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఈ కేంద్రాలలో కనీసం 120 kW సామర్థ్యం గల అతివేగ చార్జర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి కేంద్రంలో 4 నుంచి 12 వరకు ఛార్జింగ్ సాకెట్లు ఉన్నాయి.
ప్రతి కేంద్రంలో ఏసీ కాఫీ షాప్, పరిశుభ్రమైన టాయిలెట్లు, ఫ్రీ వైఫై వంటి సౌకర్యాలు ఉన్నాయి. టాటా ఈవీ వాహనదారులకు ఛార్జింగ్ ధరలపై 25% తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ కేంద్రాల్లో ఛార్జింగ్ కోసం ఎటువంటి మొబైల్ యాప్ అవసరం లేదు. కస్టమర్లు తమ డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ లేదా నగదు ద్వారా కూడా నేరుగా చెల్లింపులు చేయవచ్చు.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో టాటా.ఈవీ ఈ విస్తరణను చేపట్టింది. 2027 నాటికి దేశవ్యాప్తంగా 4 లక్షల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా, ప్రస్తుతం 500 టాటా ఈవీ ఛార్జింగ్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్య నగరాల మధ్య నిరంతరాయంగా సుదూర ఈవీ ప్రయాణాన్ని సులభతరం చేయడమే దీని ఉద్దేశం.
టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ ఆఫీసర్ బాలాజే రాజన్ మాట్లాడుతూ.. ఈ 14 కేంద్రాలు 24 గంటలూ శిక్షణ పొందిన సిబ్బందితో నిర్వహించబడే భారతదేశపు మొట్టమొదటి ఛార్జింగ్ హబ్‌లలో ఒకటి అని, ఇది రాష్ట్రాల మధ్య ఈవీ ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని తెలిపారు.


Click it and Unblock the Notifications








