Ola Electric: ఎలక్ట్రిక్ వాహన విక్రయాల్లో దూసుకుపోతున్న Ola.. ఏప్రిల్‌లో షాకింగ్ రిజల్ట్స్..!
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారత్‌లోనే అతిపెద్ద సంస్థగా ఓలా ఎలక్ట్రిక్ పేరుగాంచింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సరఫరాలో అగ్రస్థానంలో నిలిచేందుకు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేస్తోంది. అయితే ఈ సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్‌లో EV స్కూటర్ మార్కెట్‌లో భారీగా వాహన విక్రయాలు జరిపినట్లు వెల్లడించింది.
2023 ఏప్రిల్‌లో తన విక్రయాల వివరాలను వెల్లడించింది. నెలవారీ విక్రయాల పరంగా ఈ నెలలో అత్యధిక విక్రయాలు చేసినట్లు వెల్లడించింది. అంటే ఏప్రిల్ నెలలో 30,000 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. దీంతో వరుసగా 8 నెలలపాటు ఎలక్ట్రిక్ వాహన విక్రయాల్లో అగ్రస్థానంలోనే రాణిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో 40 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు తెలిపింది.

ఏప్రిల్ నెల విక్రయాలపై ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్సుల్ ఖండేవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జోరందుకోవడం ICE (ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్) వాహనాలు అంటే పెట్రోల్, డీజిల్‌లో నడిచే వాహనాల చివరి దశగా పేర్కొన్నారు. వినియోగదారుల అభిరుచులు, డిమాండ్‌కు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఓలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అనేక ప్రాంతాల్లో ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. త్వరలో 500 ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను (EC) ప్రారంభించేందుకు సిద్ధం చేస్తోంది.
ఆ సంవత్సరం ఆగస్టు నాటికి ఈ 1000 ECలు ఏర్పాటుచేసే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ సెంటర్లు అనేక రకాలైన సేవల్ని ఒకే దగ్గర అందించనున్నాయి. భారత్‌లో 2025 నాటికి దేశంలోని ద్విచక్రవాహనదారులను విద్యుత్ వాహనాల వినియోగం వైపు మార్చే లక్ష్యంతో ఓలా పనిచేస్తోంది.
రూ.130 కోట్లు రిఫండ్ : భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం FAME పథకాన్ని అమలుచేస్తోంది. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించి కొన్ని సంస్థలు ఎలక్ట్రిక్ ఉపకరణాలను విడిగా విక్రయించాయి.
ఓలా ఎలక్ట్రిక్ తన S1 ప్రో స్కూటర్‌కు ఆఫ్‌బోర్డ్ ఛార్జర్‌లను విక్రయించింది. ఇందుకోసం రూ.9000 నుంచి రూ.19000 వరకు వినియోగదారుల నుంచి వసూలు చేసింది. దీనిపై సమీక్షించిన ఆధీకృత నియంత్రణ వ్యవస్థ వసూలు చేసిన నగదును వెంటనే చెల్లించాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.
దీనిపై ఓలా స్పందించింది. తమ ఉల్లంఘనలను అంగీకరించింది. ఆఫ్ బోర్డ్ ఛార్జర్లు, ఛార్జింగ్ యాక్సెసరీలను కొనుగోలు చేసిన తమ వినియోగదారులకు సూమారు 130 కోట్ల రూపాయలను రిఫండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓలా వెల్లడించింది. ఈ నిర్ణయంపై పలువురు వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఓలా భారత్‌లో అతిపెద్ద మొబిలిటీ ప్లాట్‌ఫాం. రైడ్ హెయిలింగ్ సంస్థల్లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సంస్థ. మూడు ఖండాల్లో సుమారు 3 బిలియన్ ప్రజలకు అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో సుస్థిరమైన మొబిలిటీ ప్లాట్‌ఫాంగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను తమిళనాడులోని ఓలా ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. అయితే ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.


Click it and Unblock the Notifications








