వాహనదారులకు గుడ్ న్యూస్.. దీపావళి కానుకగా త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరుగుతుండటంతో వాహనదారుల జేబులకు చిల్లలు పడుతున్నాయి. ఈ క్రమంలో రాఖీ పండుగ సందర్భంగా గ్యాస్ సిలిండర్ ధర రూ. 200 తగ్గిస్తూ మహిళలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురునందించింది. అయితే త్వరలో వాహనదారులకు కూడా కేంద్రం ఊరట కల్పించనుంది.
దేశంలో LPG ధరలను భారీగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది వాహనదారులకు దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

అనుకున్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే దీపావళి సందర్భంగా వాహనదారులు కాసింత ఉపశమనం పొందవచ్చు. గ్యాస్ సిలిండర్ ధర తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా లీటర్‌కు రూ. 3 నుంచి రూ. 5 వరకు తగ్గే అవకాశం ఉందని JM ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్ నుంచి వెలువడిన నివేదిక పేర్కొంది.
కాగా ఈ నివేదికను ఓ వార్తా సంస్థ ఉదహరించింది. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో గత కొన్ని రోజులుగా అదే ధర వద్ద నిలకడగా ఉన్నాయి. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా ధరలు తగ్గిస్తే.. రానున్న ఎన్నికల్లో ఈ తగ్గింపు నిర్ణయం ప్రభుత్వానికి ఉపయోగపడనుంది.

కేంద్ర ప్రభుత్వం గత వారం రాఖీ పౌర్ణమి సందర్భంగా 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఆగస్టు 2023 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ధర తగ్గింపు దేశవ్యాప్తంగా చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలపై సానుకూల ప్రభావం చూపింది. దేశంలో 33 కోట్లకు పైగా వినియోగదారులకు ఉపశమనం కలిగించిందనే చెప్పవచ్చు.
అయితే ధర తగ్గింపు నిర్ణయం ప్రజలకు ఊరట కలిగించినప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. రాబోయే కొద్ది నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే కూడా OMC లపై మరింత భారం పడే అవకాశం ఉందని తెలిపింది.

ఈ నేపథ్యంలో నేడు రెండు తెలుగు రాష్టాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీ, అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలను ఓసారి పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109. 66, లీటర్ డీజిల్ ధర రూ. 97. 82 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి వ్యత్యాసమూ లేదు.
ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.37 గానూ, లీటర్ డీజిల్ ధర రూ. 99.15 గానూ కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72 గానూ, లీటర్ డీజిల్ ధర రూ. 89. 62 గానూ ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.31 గానూ, లీటర్ డీజిల్ ధర రూ. 94.27 గా ఉంది.
కేంద్రం గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం గానీ, తగ్గించడం కానీ చేయలేదు. గతంతో పోల్చితే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ, దేశంలో ఇంధన ధరలు మాత్రం దిగి రావట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో వచ్చే ఆదాయమే ఎక్కువ వాటాను కలిగి ఉంటుంది. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా ధరలు తగ్గిస్తే వాహనదారులకు ఊరట కలగనుంది.


Click it and Unblock the Notifications








