15 రూపాయలకే లీటర్ పెట్రోల్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగస్థులు ప్రభుత్వ రవాణాపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వాహనదారులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే రానున్న కాలంలో ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జోస్యం చెప్పారు. అలా జరిగితే లీటర్ పెట్రోల్ రూ.15కే లభిస్తుందని వెల్లడించారు. లీటర్ పెట్రోల్ రూ. 15 అనగానే షాకయ్యారు కదా.. ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో ఈ కథనంలో చూద్దాం.

రాబోయే సంవత్సరాల్లో, దేశవ్యాప్తంగా రోడ్లపై అన్ని వాహనాలు ఇథనాల్ ఇంధనం ఆధారితమైనవిగా ఉంటాయని కేంద్ర మంత్రి అన్నారు. వాహనదారులు ఇలాంటి వాహనాలను ఎక్కువగా వాడితే లీటర్ పెట్రోల్ రూ.15కి పడిపోతుందని మంత్రి అంచనా వేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక పథకాలను అమలు చేస్తోంది.
జూలై 4 న రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. 'అన్నదాతగా ఉన్న రైతులే ఇక నుంచి ఇంధన ప్రదాతలుగానూ మారబోతున్నారు. రానున్న సంవత్సరాల్లో, అన్ని వాహనాలూ రైతులు ఉత్పత్తి చేసే ఇథనాల్‌తో నడుస్తాయి. 60 శాతం ఇథనాల్, 40 శాతం విద్యుత్ ఉపయోగిస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 15కు లభిస్తుంది.' అని ఆయన అన్నారు.

భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇథనాల్‌తో నడిచే వాహనాలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల వాయు కాలుష్యం తగ్గుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. అదేవిధంగా ముడి చమురు కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంధన దిగుమతులపై దేశంలోని రైతులకు దాదాపు రూ.16 లక్షల కోట్ల నిధులు వస్తాయని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఇథనాల్ ఇంధనాన్ని వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారు చేస్తారు. ఉదాహరణ వరి గడ్డి, బియ్యం. ఈ తరహా వాహనాల వినియోగం పెరిగినప్పుడు ఇథనాల్ ఇంధనానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడి రైతులకు నేరుగా డబ్బులు అందుతాయి. ప్రస్తుతం వివిధ టూ వీలర్స్ మరియు కార్ల తయారీ కంపెనీలు E20 (80 శాతం పెట్రోల్ మరియు 20 శాతం ఇథనాల్) ఆధారిత ఇంజిన్‌లతో వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి.
ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా టయోటా క్యామ్రీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఎడిషన్‌ను ఆగస్టు నెలలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్లెక్స్ ఇంధన కార్లు ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీంతో పాటు బజాజ్, టీవీఎస్, హీరో కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు 100 శాతం ఇథనాల్ టెక్నాలజీతో రానున్నాయని మంత్రి తెలిపారు.
అలాగే, దేశంలోని ఆటోమొబైల్ తయారీ కంపెనీలు ఇథనాల్ ఇంధనంతో పనిచేసే ఇంజిన్‌లను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే రానున్న రోజుల్లో ఇథనాల్‌తో నడిచే వాహనాలు రోడ్డెక్కుతాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పినట్లు పెట్రోల్ ధరలు బాగా తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు.


Click it and Unblock the Notifications








