2000 Note Ban ఇదేం పద్ధతి గురూ.. రూ.2000 నోట్ వద్దని పెట్రోల్ ఖాళీ చేయించిన బంకు సిబ్బంది.. వీడియో వైరల్!!
దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు సమయంలో నోట్లు మార్చుకోవడానికి జనం బ్యాంకుల వద్ద క్యూ కట్టడం, సంచుల కొద్దీ నల్లధనం పోగేసుకున్న బడాబాబులు వాటిని మార్చే వీలులేక రోడ్లపై పారబోయడం ఇలా ఎన్నో చూశాం. పెట్రోలు బంకుల్లోనూ, వ్యాపార లావాదేవీల్లో ఆయా నోట్లను స్వీకరించకపోవడం చూశాం. డీమానిటైజేషన్ సృష్టించిన అలజడి అలాంటిది.
తాజాగా భారత ప్రభుత్వం మరియు ఆర్బీఐ తీసుకున్న మరో నిర్ణయం రూ. 2000 నోట్లను సెప్టెంబర్ 30వ తేదీలోగా మార్చుకోవాలని లేదా ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించడం. ఈ చర్య ఇప్పుడు డీమానిటైజేషన్ రోజులను గుర్తు చేస్తోంది. నోట్ల రద్దు మాదిరిగానే ఈ ఆకస్మిక ప్రకటన దేశంలో కలకలం సృష్టించింది. ఈ నోట్లను మార్చుకోవడానికి అనేక మంది వ్యక్తులు బ్యాంకులు, వ్యాపారాలు మరియు పెట్రోల్ పంపుల వద్దకు పరుగెత్తుతున్నారు.

కానీ దేశవ్యాప్తంగా చాలా చోట్ల వ్యాపారులు చాలా మంది ఈ నోట్లను అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ప్రజలకు సమస్య తలెత్తుతోంది. తాజాగా యూపీలో చోటుచేసుకున్న ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదెక్కడి చోద్యం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే. తన స్కూటర్‌లో ఇంధనం నింపడానికి పెట్రోల్ బంకుకు వెళ్లిన వ్యక్తి రూ. 2000 నోటు చెల్లించడమే ఇందుకు కారణం.
ఓ వ్యక్తి తన స్కూటర్‌లో పెట్రోల్ నింపించేందుకు ఓ పెట్రోల్ బంకుకు వెళ్లారు. అక్కడ కొంత మొత్తానికి పెట్రోల్ నింపిన అనంతరం సిబ్బందికి రూ. 2000 నోటు ఇచ్చాడు. దీంతో ఈ నోటు తీసుకోవడానికి ఉద్యోగి తిరస్కరించిన స్కూటర్‌లో నింపిన పెట్రోల్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోలో వారి సంభాషణను చూడవచ్చు.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లోని ఓరై కొత్వాలి ప్రాంతంలోని డీమార్ట్ ఎదురుగా ఉన్న హిందుస్థాన్ పెట్రోల్ పంపు వద్ద ఈ సంఘటన జరిగింది. అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి తన యాక్టివా స్కూటర్‌లో రూ. 400 పెట్రోల్ నింపమని బంకు సిబ్బందిని అడిగారు. పెట్రోల్ నింపిన అనంతరం రూ. 2000 నోటు చెల్లిస్తుండగా దానిని తీసుకునేందుకు నిరాకరించారు. వేరే నోటు ఇవ్వమని అడిగారు. లేదని చెప్పడంతో అతని స్కూటర్‌లో నింపిన ఇంధనాన్ని తిరిగి తీసుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ తరహా ఘటనలు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో చోటుచేసుకుంటున్నారు. ఈ నోట్లను తీసుకుని తంటాలు తెచ్చుకోవడం ఎందుకని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. రూ. రెండు వేల నోటును స్వీకరించబోమని బోర్డులు కూడా పెట్టేశాయి.
ఆర్బీఐ ఇటీవల అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. 2016లో ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోటు చట్టబద్ధంగా ఉంది. అయితే పౌరులు ఈ నోట్లను సెప్టెంబర్ 30, 2023లోగా డిపాజిట్ లేదా మార్చుకోవాలని కోరింది. ఈ పరిస్థితి డీమోనిటైజేషన్ ప్రక్రియను గుర్తుకుతెస్తోంది. అయితే ఈసారి ఆ ప్రభావం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఎక్కువ కాలం పాటు నోట్లు ఉపసంహరించుకునే అవకాశం ఇచ్చింది.
రిజర్వు బ్యాంక్ అధిక విలువ కలిగిన నోట్ల చలామణిని తగ్గించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అంతే కాకుండా గత నాలుగేళ్లుగా 2000 రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల కారణంగా భారత ప్రభుత్వం ఈ చర్యను అమలు చేసిందని ఊహాగానాలు తలెత్తుతున్నాయి. కాగా ఈ నిర్ణయం పట్ల RBI లేదా భారత ప్రభుత్వం ఏ కారణం వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








