విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
ప్రేమికులు చాలా రకాలుగా తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. తమ ప్రేమను వ్యక్తపరిచిన మొదటి రోజు జీవితాంతం గుర్తుండిపోవాలని కోరుకుంటారు. అందుకే ప్రత్యేకమైన సందర్భాల్లో, ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఇష్టమైన వారికి ప్రపోజ్ చేస్తారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి తన ప్రేమను గాల్లో వ్యక్తపరిచాడు. అదేంటి అనుకుంటున్నారా.. ఈ స్టోరీ చదివేయండి.!!
రోజ్ ఫ్లవర్‌తో ఇష్ట సఖికి అబ్బాయిలు ప్రపోజ్ చేయడం షరా మామూలే. ప్రేమకు చిహ్నం గులాబీ. ఇక రకరకాల పువ్వులను కూడా తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు యువకులు ఉపయోగిస్తుంటారు. అయితే వాటిని ఎక్కడ ఎలా వాడారు అనే విషయంలోనే ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ఓ పైలట్ తన ప్రియురాలికి ఫ్లైట్‌లో ప్రపోజ్ చేశారు. ఆ కథేంటంటే..

ఇటీవల ఓ పైలట్ ఫ్లైట్(Pilot Proposes His Lover)లో ఉండగానే తన ప్రియురాలికి తన ప్రేమను తెలియజేసిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వార్సా నుంచి క్రాకోవ్( Kraków)కు వెళ్లే విమానంలో ఈ ప్రేమ సన్నివేశం చోటుచేసుకుంది. విమానం బయలుదేరే సమయంలో, పైలట్ కెప్టెన్ కొన్రాడ్ హాన్క్ తన ప్రియురాలికి మ్యారేజ్ ప్రపోజల్‌ను చాలా అద్భుతంగా తెలియజేశారు.
విమానంలో ఎయిర్‌హోస్టెస్‌గా పాల్ పని చేస్తోంది. అదే విమానంలో కెప్టెన్ కొన్రాడ్ హాన్క్ కూడా పనిచేస్తున్నారు. వీరిద్దరూ LOT పోలిష్ ఎయిర్‌లైన్స్‌లో గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇద్దరికీ పరిచయమైనప్పటి నుంచి హాన్క్.. పాల్‌పై మనసు పారేసుకున్నాడు. దీంతో ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించాలని కలలు కన్నాడు. ఇందుకు సరైన సందర్భం కోసం ఎదురుచూశాడు.

ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఇద్దరు ఒకే విమానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. తన ప్రేమను వ్యక్త పరచడానికి ఇదే సరైన సమయం అనుకుని కెప్టెన్ హాక్ భావించారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే కాసేపటికి ఆటో పైలట్ మోడ్‌లోకి వెళ్లగానే.. హాన్క్ తన ప్రియురాలికి తన ప్రేమను వ్యక్తపరిచేందుకు సిద్ధమయ్యారు.
కెప్టెన్ హాన్క్ విమానం కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చి ప్రయాణీకులతో పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా మాట్లాడారు. ఈ సమయంలో సుమారు ఏడాదిన్నర క్రితం తన ఉద్యోగం ద్వారా తాను ఎలా ఆమెను కలుసుకున్నాడో వివరించాడు. ఆమె తన జీవితంలో ఎంత ప్రభావం చూపింది.. ఆమెపై తన ప్రేమను తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

పాల్ తన ప్రేయసి అని, తాను ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పాడు. దీంతో పాల్ విమానం వెనక భాగంలో నుంచి నడుచుకుంటూ వచ్చి హాన్క్‌ను కౌగిలించుకుంది. ప్రయాణీకులు ఈ జంటను చూసి ముచ్చట పడ వారికి శుభాకాంక్షలు తెలిపారు. వెంటనే కెప్టెన్ హాన్క్ ఫ్లవర్ బొకేను పట్టుకుని తనను పెళ్లి చేసుకోమని తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు.
పాల్.. అతని ప్రతిపాదనకు అంగీకరించడంతో అతను ఉంగరాన్ని ఆమె వేలుకు తొడిగి తన ప్రేమను మరింతగా వ్యక్తపరిచాడు. దానితో విమానంలోని ప్రయాణీకులందరూ వారికి అభినందనలు తెలియజేస్తూ చప్పట్లతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సుందరమైన సన్నివేశాన్ని కొందరు వీడియో తీశారు. ఇంకా ఎయిర్‌లైన్ ఈ వీడియోను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది.

అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ జంట మొదట కలుసుకున్న క్రాకోవ్‌కు వెళ్లే విమానంలోనే ఈ ప్రపోజల్ జరిగిందని ఎయిర్‌లైన్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైన కాసేపటికే లక్షల కొద్దీ వ్యూస్‌ను సంపాదించుకుంది. 16,000 కు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇంత అందమైన ప్రేమకథను వీడియో తీసి కళ్ల ముందు ఉంచినందుకు ఓ నెటిజన్ ఎయిర్‌లైన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రేమ జంట.. జీవితాంతం సంతోషకరమైన క్షణాలను గడపాలని కోరుకున్నారు. పెళ్లి జీవితాన్ని త్వరగా ప్రారంభించి మరింత అద్భుతమైన క్షణాలను ఆస్వాదించాలని కోరుకున్నారు.


Click it and Unblock the Notifications








