మోదీ కాన్వాయ్‌లో రెండే కార్లు.. తుపాకీ గుండ్లు, బాంబు దాడులు తట్టుకునే ఆ కార్ల ప్రత్యేకతలేంటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రంగా మారుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా భారీ భద్రతా ఏర్పాట్లతో ప్రయాణించే ప్రధాని కాన్వాయ్‌లో ఇకపై కేవలం రెండు వాహనాలే కనిపించనున్నాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చిన మోదీ(Modi), ఇప్పుడు అదే విషయాన్ని తన భద్రతా వ్యవస్థలో అమలు చేయడంతో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
15 కార్ల నుంచి 2 కార్లకు.. ఇదే అసలు షాక్!
ఇప్పటి వరకు ప్రధాని కాన్వాయ్‌లో 12 నుంచి 15 వరకు అత్యాధునిక భద్రతా వాహనాలు ఉండేవి. బుల్లెట్ ప్రూఫ్ కార్లు, జామర్ వాహనాలు, అంబులెన్స్‌లు, భద్రతా దళాల వాహనాలు వరుసగా సాగేవి. అయితే తాజా నిర్ణయంతో ఆ కాన్వాయ్‌ను భారీగా కుదించారు. ఇటీవల ఢిల్లీ వీధుల్లో మోదీ ప్రయాణిస్తున్న వీడియోల్లో కేవలం రెండు కార్లు మాత్రమే కనిపించాయి. ఒకటి అత్యంత భద్రత కలిగిన రేంజ్ రోవర్ సెంటినెల్ కాగా, మరొకటి ప్రత్యేక భద్రతా వ్యవస్థతో రూపొందించిన టయోటా ఫార్చ్యూనర్.

రేంజ్ రోవర్ కాదు.. కదిలే కోట
ప్రధాని ఉపయోగిస్తున్న రేంజ్ రోవర్ సెంటినెల్ సాధారణ కారు కాదు. ఇది ఒక కదిలే భద్రతా కోటలా ఉంటుంది. తుపాకీ గుళ్లు, గ్రెనేడ్ దాడులు, భారీ పేలుళ్లను కూడా తట్టుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. అంటే 7.62 ఎంఎం హై వెలాసిటీ తుపాకీ గుండ్లు కూడా దీనిని ఏమీ చేయలేవు. ఇందులో సొంతంగా మంటలను ఆర్పుకునే వ్యవస్థ, ఆక్సిజన్ సరఫరా సౌకర్యం కూడా ఉన్నాయి.
ఈ వాహనానికి అత్యున్నత స్థాయి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, స్టీల్ బాడీ, స్వయంగా మూసుకుపోయే ఇంధన ట్యాంక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టైర్లు పంక్చర్ అయినా కూడా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్లగల సామర్థ్యం ఈ కారుకు ఉంది. 15 కిలోల వరకు పేలుడు పదార్థాలు పేలినా లోపల ఉన్నవారికి ప్రమాదం లేకుండా రక్షణ కల్పించేలా దీన్ని తయారు చేశారు.

ఫార్చ్యూనర్ కూడా స్పెషల్ వెర్షనే
ప్రధాని కాన్వాయ్‌లో కనిపిస్తున్న ఫార్చ్యూనర్ కూడా షోరూమ్‌లో దొరికే సాధారణ మోడల్ కాదు. దీనిని ప్రత్యేక భద్రతా అవసరాల కోసం మార్చారు. ఇందులో ఎస్‌పీజీ అధికారులు ప్రయాణిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా దీనిని సన్నద్ధం చేశారు. భారతీయ రోడ్లపై అత్యంత విశ్వసనీయ ఎస్‌యూవీలలో ఫార్చ్యూనర్‌కు ఉన్న పేరే ఇప్పుడు ప్రధాని భద్రతా వ్యవస్థలోనూ కనిపిస్తోంది.
ప్రజలకు మెసేజ్ ఇదేనా?
ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తోంది. అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలని, సాధ్యమైన చోట ఇంటి నుంచే పని చేయాలని కూడా సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాని తన కాన్వాయ్‌ను తగ్గించడం ఒక సంకేతాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు.

ప్రధాని గుజరాత్, అస్సాం, హైదరాబాద్ పర్యటనల్లో కూడా ఈ చిన్న కాన్వాయ్‌నే ఉపయోగించడం విశేషం. ఇకపై ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లోనూ ఇంధన పొదుపుపై అవగాహన పెంచేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
భద్రత తగ్గలేదంటున్న అధికారులు
కాన్వాయ్ పరిమాణం తగ్గినా భద్రతలో ఎలాంటి రాజీ లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్ని ఎస్‌పీజీ నిబంధనలు అలాగే అమలులో ఉంటాయని చెబుతున్నారు. అవసరమైన అన్ని సాంకేతిక భద్రతా వ్యవస్థలు యథావిధిగా కొనసాగుతున్నాయని సమాచారం.


Click it and Unblock the Notifications