దేశంలో మరో అధునాతన రైల్వే వ్యవస్థ.. వచ్చే వారం తొలిదశ ప్రారంభం!
గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనపై అధికంగా దృష్టిసారించింది. నాలుగేళ్ల ముందు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే శాఖ.. తాజాగా భారత్‌లో తొలిసారిగా మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, RapidX ను ప్రవేశపెట్టనుంది. వచ్చే వారం ఈ వ్యవస్థ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రధాని మోడీ ఈ రైలు వ్యవస్థను ప్రారంభించనున్నారు.
ఈ RapidX రైళ్లు దేశ రాజధాని ప్రాంతం (NCR- National Capital Region) నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌ను కలుపుతుంది. ర్యాపిడ్‌ఎక్స్ అనేది సెమీ హైస్పీడ్ అర్బన్ ట్రైన్ సిస్టమ్. ఈ రైళ్లు గరిష్ఠంగా గంటకు 160km వేగంతో ప్రయాణం చేయగలవు. ఫలితంగా ఢిల్లీ, మీరట్‌ల మధ్య ప్రయాణం సమయం భారీగా తగ్గనుంది.

డిల్లీ-ఘాజియాబాద్-మీరట్ రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో 17 కిలోమీటర్లు దూరం అంటే సాహిబాబాద్ నుంచి దుహై మధ్య ఈ సెమీ హైస్పీడ్ అర్బన్ ట్రైన్ సిస్టమ్ నడవనుంది. ఈ కారిడార్ దూరం 82.1 కి.మీగా ఉంది. 2025 నాటికి మొత్తం కారిడార్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. గురువారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాహిబాబాద్ RapidX స్టేషన్‌ను సందర్శించారు. అక్కడ ఏర్పాట్లును పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు.
ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు ఈ వ్యవస్థ ఓ మంచి ఉదాహరణ. అయితే ఈ రైళ్లు ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఫలితంగా అధికవేగంతో ప్రయాణం చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. మరియు ఏరోడైనమిక్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. మరియు ప్రయాణికులకు అద్భుతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే విధంగా ఈ రైళ్లు పెద్ద విండో గ్లాస్‌లను ఏర్పాటుచేశారు.

ఢిల్లీ- ఘజియాబాద్- మీరట్ ర్యాపిట్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ద్వారా సంవత్సరానికి సుమారుగా 2,50,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఫలితంగా దేశ రాజధాని ప్రాంత పరిసరాల్లో కాలుష్యానికి కొంత చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా అందుబాటులోకి వచ్చాక మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు.
ఈ మొత్తం కారిడార్‌ను 2025 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మీరట్ ప్రజలకు మరింత మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు అదే ప్రాంతంలో మెట్రో స్టేషన్‌లను కూడా నిర్మిస్తున్నారు. మెట్రో, ర్యాపిడ్ రైలు రెండు కూడా ప్రీకాస్ట్ హైటెక్ బ్యాలస్ట్‌లెస్ ట్రాక్‌లపై ప్రయాణం చేస్తాయి.

ఇటీవల అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లు మంచి ఆదరణ పొందాయి. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల మధ్య అందుబాటులో ఉన్నాయి. వందే సాధారణ్, వందే భారత్ స్లీపర్, వందే మెట్రో రైళ్లను కూడా నడిపేందుకు రైళ్ల కసరత్తు చేస్తోంది. ఈ రైళ్లకు సంబంధించిన కోచ్‌లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








