దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో మార్గం.. ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు(Underwater Metro Tunnel)ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో హుగ్లీ నది నీటి అడుగున ఉండే ఈ మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించగా.. దేశం యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే కీలక మైలురాయి ప్రాజెక్టుగా ఇది నిలుస్తుంది.
ఇప్పటివరకూ మనం భూమి మీదుగా రైళ్లలోనే ప్రయాణించాం. ఇక నుంచి నీటి అడుగున కూడా రైళ్లలో ప్రయాణించవచ్చు. ఇందుకు కోల్‌కతా మహానగరం వేదికైంది. కోల్‌కతాలోని హూగ్లీ నది కింద 520 మీటర్ల దూరం ఈ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ఉంటుంది. కేవలం 45 సెకన్లలో ఈ దూరం ప్రయాణించేలా అండర్ వాటర్ మెట్రో మార్గాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ.. విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు.

విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ ఎస్‌ప్లనేడ్ నుంచి హావ్‌డా మైదాన్ స్టేషన్ వరకు ప్రయాణించారు. మెట్రో సిబ్బందితో ముచ్చటిస్తూ.. ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ వాటర్ మెట్రో రైలు ప్రయాణ విశేషాలను మోదీకి మెట్రో సిబ్బంది వివరించారు. అనంతరం వెస్ట్ బెంగాల్‌లో రూ. 15,400 కోట్లతో చేపట్టనున్న మల్టీ కనెక్టివిటీ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
ఇక దేశంలోనే తొలిసారిగా 1984లో కోల్‌కతాలో(Kolkata Underwater Metro Tunnel)నే మెట్రో సేవలు మొదలయ్యాయి. ఇప్పుడు అండర్ వాటర్ టన్నెల్ మెట్రో మార్గంతో రికార్డు సృష్టించింది. కోల్‌కతా ఈస్ట్- వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు రూ. 120 కోట్ల వ్యయంతో హుగ్లీ నది కింద ఈ ఈ టన్నెల్ మార్గాన్ని నిర్మించారు.

ఈ మార్గం పొడవు మొత్తం 16.6 కి.మీ కాగా.. 10.8 కి.మీ భూగర్భంలోనే ఉంటుంది. 4.8 కి.మీ మేర హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య లైన్‌లో భాగంగా హుగ్లీ నది అడుగున 520 మీటర్ల పొడవు అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని చేపట్టారు. నదిలో ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటవచ్చు. దీంతో ప్రయాణికులు కొత్త అనుభూతిని పొందవచ్చు.
ఈ టన్నెల్ నదీ గర్భానికి 16 మీటర్ల లోతులో, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో ఉంటుంది. కాగా హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లడానికి 90 నిమిషాల సమయం పడుతుండగా.. అండర్‌వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ రైలు నడిచే మార్గంలో మొత్తం 6 స్టేషన్లు ఉండగా.. అందులో మూడు భూగర్భంలోనే ఉండటం విశేషం.

ఇక ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలను పరిశీలిస్తే.. అండర్ వాటర్ టన్నెల్‌లో రైలును నడపడానికి ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ అనే టెక్నాలజీని ఉపయోగించారు. మెట్రో ట్రైన్ లోకో పైలట్.. కేవలం ఒక బటన్‌ను నొక్కాల్సి ఉంటుంది. ఇక మిగిలినవన్నీ ఆటోమేటిక్‌గా ఉంటూ.. తదుపరి స్టేషన్‌కు వెళ్లేలా దీనిని రూపొందించారు.
కాగా కోల్‌కతాలో ఈస్ట్-వెస్ట్ కారిడార్ మెట్రో మార్గానికి 2009 ఫిబ్రవరిలో పునాది పడగా.. 2017 లో అండర్ వాటర్ మెట్రో మార్గాన్ని నిర్మాణాన్ని ప్రారంభించారు. బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రకృతి విపత్తులను సైతం తట్టుకునేలా ఈ అండర్ వాటర్ టన్నెల్ ఉంటుంది.


Click it and Unblock the Notifications








