మెట్రోలో మూర్ఛ వచ్చినట్లు నటిస్తూ యువకుడి ప్రాంక్.. ఆ వీడియోతో అడ్డంగా దొరికిపోయాడు.!!
ఈ మధ్య కాలంలో మెట్రోలో కొందరు చేస్తున్న పనులు తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. అంతే కాకుండా మరికొందరు తాము వైరల్ అవ్వడం కోసం మెట్రో రైళ్లలో మితిమీరి ప్రవరిస్తున్నారు. ఇటీవల ఓ యువకుడు బెంగళూరు మెట్రోలో(Prank In Metro) ప్రాంక్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ఇటీవల కాలంలో మెట్రో ట్రైన్ అనగానే చాలా మందికి వైరల్ వీడియో(Metro Viral Videos)లే గుర్తుకువస్తున్నాయనడంలో డౌట్ లేదు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ కొందరు మెట్రో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బెంగళూరు మెట్రో రైలులోనే ఓ వ్యక్తి గోబీ మంచూరియా తింటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది అధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు అతనికి రూ. 500 జరిమానా విధించారు.

కాగా ప్రాంక్ వీడియోలు చేసే యువకుడు ఈ ఏడాది జూలైలో మెట్రో రైలు, స్టేషన్‌లో మూర్ఛ(Prank Video In Metro) వచ్చినట్లు నటించి తోటి ప్రయాణికులను హడలెత్తించాడు. బెంగళూరులోని విజయనగర నుంచి మెజిస్టిక్‌కు ప్రయాణించే సమయంలో నమ్మ మెట్రో రైలులో ప్రయాణిస్తూ మూర్ఛ వచ్చినట్లు నటించి ప్రాంక్ చేశాడు. ఈ వీడియోను యువకుడు జూలై 23 న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
మొదటగా యువకుడు మెట్రో స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై పైకి వస్తూ ఒక్కసారిగా మూర్ఛ వచ్చినట్లు ప్రవర్తించాడు. హఠాత్మరిణామంతో ఎస్కలేటర్‌పై యువకుడి వెనుక నించున్న మహిళలు భయాందోళనకు గురయ్యారు. తర్వాత యువకుడు మామూలుగా ఉండి పైకి చేరుకున్నాడు. ఇలా ప్రాంక్ వీడియోతో తోటి ప్రయాణికులను గాభరా పెట్టాడు.

ఆ కాసేపటి తర్వాత మెట్రో రైలులో ప్రయాణం చేస్తూ నిలబడి ఉన్న యువకుడు మూర్ఛ వచ్చినట్లు నటించి అక్కడ ఉన్న ప్రయాణికులను గురిచేశాడు. అతడి ప్రవర్తనతో అక్కడ ఏం జరుగుతుందో తోటి ప్రయాణికులకు అర్థం కాలేదు. వారంతా షాక్‌తో అలాగే చూస్తూ ఉండిపోయారు. అనంతరం ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడు.
ఈ వీడియో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(BMRCL) అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించారు. పబ్లిక్ ప్లేస్‌లో మూర్ఛ వచ్చినట్లు నటించి ప్రయాణికులను కంగారు పెట్టిన యువకుడిని గుర్తించారు. కాగా అతడి పేరు ప్రజ్వల్ అని.. అతడి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పేరు ప్రాంకర్ ప్రజు(Pranker Praju) అని తెలిసింది.

ఆ యువకుడు మరొక రీల్‌లో ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా అతడిని బెంగళూరు మెట్రో అధికారులు గుర్తించారు. ప్రజ్వల్ నాగర్‌భావి నివాసి అని తెలిపారు. యువకుడిపై కేసు నమోదైందని దర్యాప్తు కొనసాగుతోందని బీఎంఆర్‌సీఎల్ అధికారి ఒకరు తెలిపారు. అతనికి రూ. 500 జరిమానా విధించినట్లు తెలిపారు.
గురువారం మెట్రో అధికారులు ప్రజ్వల్‌ని గోవిందరాజ్ నగర్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు పాల్పడనని ప్రజ్వల్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా BMRCL ఇటీవలి రోజుల్లో ప్రయాణికులు తన ఆస్తులపై విచక్షణారహిత చర్యలకు పాల్పడటంతో వారు కఠినంగా వ్యవహరించడం ఇది మూడోసారి.

మరోసారి గత నెలలో ఓ యూట్యూబర్ మెట్రో స్టేషన్‌లోకి చొరబడి టిక్కెట్ లేకుండా ప్రయాణించినందుకు మెట్రో అధికారులు కేసు బుక్ చేశారు. మెట్రో రైల్వే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టం ప్రకారం మెట్రో ఆస్తులకు నష్టం కలిగించడం నేరం. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, ఆస్తుల ధ్వంసం, అసభ్యత, దుర్భాష లేదా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తే రూ. 500 జరిమానా విధిస్తుంది.


Click it and Unblock the Notifications








