సొంత జిల్లాలో మూడు రైళ్లను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఫుల్ ఖుషీలో స్థానికులు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలోని గిరిజన ప్రాంతం, ఆమె సొంత జిల్లా అయిన బాదంపహార్ నుంచి మంగళవారం(నవంబర్ 21) మూడు రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వాటిలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాగా మరొకటి ప్యాసింజర్ రైలు. కాగా 91 ఏళ్ల చరిత్రలో ఆ సెక్షన్ నుంచి నడుస్తున్న మొదటి సుదూర ప్యాసింజర్ రైళ్లు ఇవే.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత జిల్లాలో మూడు రైళ్లను ప్రారంభించారు. అవి షాలిమార్- బాదంపహార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, బాదంపహార్ - రూర్కెలా వీక్లీ ఎక్స్‌ప్రెస్, బాదంపహార్ - టాటానగర్ MEMU రైళ్లు. కాగా సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్ మీదుగా ఇంతకుముందు ఒక్క ప్యాసింజర్ రైలు మాత్రమే నడుస్తుండటం గమనార్హం.

రైళ్ల ప్రారంభోత్సవంతో పాటు.. అమృత్ భారత్ స్టేషన్ ప్రాజెక్ట్ కింద స్టేషన్ పునరాభివృద్ధికి భారత రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. దీని ద్వారా స్టేషన్ పునరాభివృద్ధితో పాటు ప్రయాణికులకు రైలు రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి. క్రమంగా ఈ ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రారంభోత్సవం అనంతరం ద్రౌపది ముర్ము మాట్లాడారు. ఒక ప్రాంత అభివృద్ధి ఎప్పుడైనా.. ఆ ప్రాంతానికి సంబంధించిన రవాణా వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. రైల్వేలు, రోడ్లు, పోస్టల్ సర్వీసులు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు. తాజాగా ప్రవేశపెట్టిన మూడు రైళ్లతో స్థానికులకు.. ఝార్ఘండ్, వెస్ట్ బెంగాల్ వంటి పొరుగు రాష్ట్రాలకు రవాణా సౌకర్యం సులభతరం అవుతుందని తెలిపారు.

ఇకపై ఒడిశాలోని పారిశ్రామిక పట్టణం రూర్కెలాకు రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండదని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. దేశంలో గిరిజనుల అభివృద్ధి లేకుండా సంపూర్ణ అభివృద్ధి అసాధ్యమని ఆమె వెల్లడించారు. గిరిజన వర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గిరిజన యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వయం అభివృద్ధికి ప్రతి ఒక్కరి కృషి అవసరమని స్పష్టం చేశారు.
కాగా ఈ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో ఎక్కువ భాగం రాయరంగపురలోనే గడిపినట్లు తెలిపారు. ద్రౌపది ముర్ము తన రాజకీయ జీవితాన్ని ఒక చిన్న పట్టణం నుంచి ప్రారంభించారు. కౌన్సిలర్‌గా ఎన్నికై రాయరంగపురా పౌర సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2000 మరియు 2009 మధ్య రెండుసార్లు రాయంగ్‌పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు తన సేవలందించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, బిశ్వేశ్వర్‌తో సహా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒడిశా అభివృద్ధికి కృషి చేస్తున్నారని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. గతంలో ఒడిశాకు కేవలం రూ. 800 కోట్లు నిధులు మాత్రమే వచ్చేవని ఆయన గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 10,000 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని కేంద్ర మంత్రి వైష్ణవ్ అన్నారు. ఒడిశాలోని 57 స్టేషన్లను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications








