బండిపై హోలీ రంగులు పడ్డాయా? సర్ఫ్ వాడకండి.. ఈ చిన్న చిట్కాతో కొత్తదానిలా మెరిపించండి!
హోలీ పండుగ అంటేనే రంగుల హంగామా. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆనందంగా గడిపే ఈ పండుగలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, మన వాహనాలపై రంగులు పడటం సహజం. అయితే, ఈ రంగులు పడటం వరకు బానే ఉంటుంది కానీ, వాటిని వదిలించడమే అసలైన టాస్క్. ముఖ్యంగా ఎండలో ఆ రంగులు వాహనంపై ఆరిపోతే, అవి మొండి పచ్చల్లా మారిపోతాయి. వాటిని వదిలించడానికి మనం సర్ఫ్ లేదా గట్టి సబ్బులతో రుద్దితే, వాహనం ఒరిజినల్ పెయింట్ పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎటువంటి ఖరీదైన కెమికల్స్ వాడకుండా, మీ ఇంట్లో ఉండే కేవలం రెండు మూడు వస్తువులతో మీ కారు లేదా బైక్‌ను సరికొత్తగా ఎలా మార్చుకోవచ్చో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
చాలామంది తమ వాహనాలను వాష్ చేయడానికి డిటర్జెంట్ సర్ఫ్ లేదా బట్టల సబ్బును వాడుతుంటారు. దీనివల్ల వాహనం శుభ్రపడటం ఏమో గానీ, ఆరిపోయిన తర్వాత వాహనంపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. సర్ఫ్ అనేది పెయింట్ మెరుపును తగ్గించి, గరుకుగా మారుస్తుంది. దీనికి బదులుగా మీరు ఇంట్లో వాడే షాంపు, ఈనో (ENO), టూత్ పేస్ట్ (Colgate) కలిపి ఒక అద్భుతమైన క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు.

ఒక ప్లాస్టిక్ మగ్‌లో సగం కంటే తక్కువ నీరు తీసుకుని, అందులో ఒక షాంపు ప్యాకెట్, కొద్దిగా టూత్‌పేస్ట్ వేసి బాగా కలపాలి. చివరగా అందులో సగం ప్యాకెట్ ఈనో వేయగానే నురుగు వస్తుంది. ఈ మిశ్రమాన్ని పాత టూత్ బ్రష్ సహాయంతో వాహనంపై ఎక్కడైతే మొండి రంగు మచ్చలు ఉన్నాయో అక్కడ రాసి కాసేపు వదిలేయాలి.
ఈ మిశ్రమం ఎందుకు అంత బాగా పనిచేస్తుందంటే.. ఈనోలో సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి పైన పేరుకుపోయిన మురికిని లేదా గట్టిపడిన రంగును పొంగేలా చేసి, పెయింట్ నుంచి విడదీస్తాయి. టూత్‌పేస్ట్ గరుకుగా ఉండే మురికిని తొలగించి మెరుపును ఇస్తుంది.

ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత కాసేపటికే మెత్తని బట్టతో లేదా నీటితో కడిగేస్తే, మీ వాహనంపై ఉన్న మొండి రంగు మచ్చలు మటుమాయం అవుతాయి. పెయింట్‌కు ఎటువంటి హాని కలగదు. వాహనం శుభ్రం చేయడం ఒక ఎత్తు అయితే, అది షోరూమ్ నుంచి వచ్చిన కొత్త వాహనంలా మెరవడం మరో ఎత్తు. వాహనం పూర్తిగా ఆరిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లు మసకగా కనిపిస్తుంటుంది.
అలాంటప్పుడు మార్కెట్లో దొరికే రూ.100 లోపు ఉండే షైన్ స్ప్రే లేదా పాలిష్ వాడటం మంచిది. వాహనాన్ని కడిగిన తర్వాత తడి లేకుండా మెత్తని కాటన్ బట్టతో తుడవాలి. ఆ తర్వాత ఈ షైన్ స్ప్రేను బాడీపై చల్లి, మరో పొడి బట్టతో సమానంగా రుద్దాలి. దీనివల్ల మీ వాహనం అద్దంలా మెరుస్తుంది. పెయింట్‌పై ఒక రక్షణ పొర ఏర్పడి, భవిష్యత్తులో ధూళి త్వరగా అంటుకోకుండా చూస్తుంది.

వాహనాన్ని కడిగేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ముందుగా వాహనంపై ఉన్న ఎండు దుమ్మును పొడి బట్టతో దులిపేయాలి. దుమ్ము ఉండగానే నీరు పోస్తే అది బురదగా మారి పెయింట్‌పై గీతలు (Swirl marks) పడేలా చేస్తుంది. అలాగే, ఎండలో వాహనాన్ని కడగకూడదు, ఎందుకంటే నీరు త్వరగా ఆరిపోయి నీటి మచ్చలు పడతాయి.
నీడలో నిలబెట్టి పైన చెప్పిన చిట్కాలను పాటిస్తే, మీ కారు లేదా బైక్ హోలీ రంగుల నుంచి విముక్తి పొంది, మునుపటి కంటే అందంగా మెరుస్తుంది. ఈ చిట్కాలను పాటిస్తే మీరు సర్వీసింగ్ సెంటర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.


Click it and Unblock the Notifications








