110 కి.మీ వేగంతో రైలును నడుపుతూ లోకోపైలెట్ ఏం చేశాడో తెలుసా?
ఒడిశా బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాద ఘటన అనంతరం రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రైల్వే కార్యకలాపాలు, నిర్వహణ సమయాల్లో ప్రోటోకాల్ పాటించాలని అన్ని జోన్లకు రైల్వే బోర్డు స్పష్టం చేసింది. రైల్వే అంతటా ప్రస్తుతం సేఫ్టీ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
గతవారం ఒడిశాలోని బాలాసోర్‌లో లూప్‌లైన్‌లో నిలిపి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఆ బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో బెంగళూరు- హౌరా రైలు ఆ ట్రాక్‌పైకి వచ్చింది. ట్రాక్‌పైనున్న బోగీలను ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ పెను ప్రమాదంలో 288 మంది మరణించారు. సుమారు 900 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.

తాజాగా రైల్వే మదురై డివిజన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఓ లోకోపైలెట్.. రైలును సుమారుగా 110 కి.మీ వేగంతో నడుపుతూ మధ్యలో తరచుగా తన చేతికున్న స్మార్ట్‌వాచ్‌ను చూస్తుండడాన్ని గమనించింది. దీంతో అప్రమత్తమైన మదురై డివిజన్ అధికారులు.. రైలు రన్నింగ్‌లో ఉన్న సమయంలో ఉద్యోగులు స్మార్ట్‌వాచ్‌లు ధరించకుండా నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
రన్నింగ్ రైలులో ఉన్న ఉద్యోగులు ఫోన్లు వినియోగించకుండా రైల్వే శాఖ ఇప్పటికే నిషేధం విధించింది. దాంతోపాటు రైల్వే ఉద్యోగులు ఎక్కువగా స్మార్ట్‌వాచ్‌లను వినియోగిస్తున్నట్లు గుర్తించింది. కొంత మంది తమ ఆరోగ్య స్థితిని తెలుసుకొనేందుకు వినియోగిస్తుండగా, మరికొందరు స్మార్ట్‌ఫోన్లను స్మార్ట్‌వాచ్‌లతో కనెక్ట్ చేసి వినియోగిస్తున్నట్లు గుర్తించింది.
'ఇటీవల చేసిన తనిఖీల్లో డ్యూటీలో ఉన్న ఓ లోకోపైలట్ రైలును 110 కి.మీ వేగంతో నడుపుతూ.. తరచూ తన స్మార్ట్‌వాచ్‌ను చూస్తున్నట్లు గుర్తించాం. ఇది అత్యంత ప్రమాదకరం" అని రైల్వే మధురై డివిజన్ తన తాజా ఉత్తర్వులో స్పష్టం చేసింది. నిషేధానికి సంబంధించిన ఉత్తర్వులను అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు పంపింది.

కొన్ని స్మార్ట్‌వాచ్‌లు స్మార్ట్ ఫోన్‌తో కనెక్ట్ చేసినప్పుడు.. ఫోన్‌లు చేయడం సహా అనేక పనులు చేయవచ్చని రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి గుగనేశన్ తెలిపారు. అందువల్లనే రైళ్లలో డ్యూటీలో ఉన్న రైల్వే ఉద్యోగులు స్మార్ట్‌వాచ్‌లు వినియోగించకుండా నిషేధం విధించినట్లు చెప్పారు.
ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంపై నిషేధం ఉన్న నేపథ్యంలో రైల్వే అధికారులు కొన్ని సార్లు తనిఖీలు చేస్తుంటారు. సదరు ఉద్యోగులు ఇచ్చిన ఫోన్ నంబర్లు స్వీచ్ ఆఫ్ చేయబడి ఉన్నాయనే నిర్ధారించేందుకు తనిఖీలు నిర్వహిస్తారు. విధుల్లో ఉన్న సమయాల్లో ఉద్యోగులు పరధ్యానంలో ఉండకూడదనే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
'లోకోపైలెట్‌లు డ్యూటీలో ఉన్న సమయంలో ఫోన్ల వినియోగంపై నిషేధం ఉంది. వారి ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి దూరంగా పెట్టాలి' అని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ వెల్లడించారు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








