ఇక ఫాస్ట్‌ట్యాగ్ లేని వారికి నో టెన్షన్..యూపీఐ ద్వారా టోల్ చెల్లిస్తే డబుల్ ఛార్జీలుండవు
కారు ఉన్నవారందరికీ ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) అనేది సుపరిచితమైన పదం. వాహనం ముందు అద్దంపై అతికించి ఉండే ఈ సిస్టమ్ టోల్ ప్లాజా లావాదేవీల ప్రక్రియలను సులభతరం చేయడానికి, ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడానికి అమలు చేశారు. అయితే, కొత్తగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై జాతీయ రహదారులపై ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి టోల్ వసూలు చేసే విధానంలో మార్పులు చేసింది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్ 15, 2025 నుంచి అమలులోకి వస్తాయి.
ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద యూపీఐ వంటి డిజిటల్ పద్ధతుల్లో డబ్బు చెల్లిస్తే, వారు కేవలం 25 శాతం మాత్రమే ఎక్స్ ట్రా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీని అర్థం టోల్ ఫీజు చెల్లించే విధానాన్ని బట్టి ఛార్జీలు మారుతాయి. గతంలో, ఫాస్టాగ్ లేనివారు నగదు లేదా డిజిటల్ పద్ధతిలో చెల్లించినా, సాధారణ టోల్ ఫీజుకు రెట్టింపు చెల్లించాల్సి వచ్చేది.

ఒకవేళ ఫాస్టాగ్ ద్వారా టోల్ ఫీజు రూ.100 అనుకుంటే, కొత్త నిబంధన ప్రకారం.. ఫాస్టాగ్ లేని యూజర్లు యూపీఐ ద్వారా చెల్లిస్తే రూ.100లో 1.25 రెట్లు, అంటే రూ.125 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంతకుముందు, వీరు రూ.200 (రెట్టింపు మొత్తం) చెల్లించాల్సి వచ్చేది. అయితే, టోల్ ప్లాజాల వద్ద నగదు ఉపయోగించి టోల్ చెల్లించేవారు మాత్రం పాత నిబంధన ప్రకారం రెట్టింపు మొత్తాన్నే చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మార్పు ఉద్దేశం, ప్రయోజనం
1. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం
జాతీయ రహదారులపై టోల్ వసూళ్లలో జరిగే నగదు లీకేజీని అరికట్టడం ఈ కొత్త నిర్ణయం ముఖ్య లక్ష్యం. పాత విధానంలో నగదు వాడేవారు లేదా యూపీఐ వాడేవారు కూడా రెట్టింపు టోల్ చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, నగదుపై ఆధారపడటాన్ని తగ్గించడం, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగే సమయాన్ని తగ్గించడం కేంద్రం లక్ష్యాలు.

2. మెరుగైన ప్రయాణ అనుభవం
డిజిటల్ లావాదేవీల ద్వారా పారదర్శకత పెరుగుతుంది. ప్రయాణం వేగంగా, సాఫీగా సాగుతుంది. ఈ కొత్త వ్యవస్థ నవంబర్ 15, 2025 నుండి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం జాతీయ రహదారులలో 98 శాతం మంది ఫాస్టాగ్ వినియోగదారులు ఉన్నారు. ఈ కారణంగానే 2022 లో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండే సగటు సమయం 47 సెకన్లకు తగ్గిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ఇటీవల, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూ.3,000 విలువైన యాన్యువల్ ఫాస్టాగ్ పాస్‌ను కూడా అమలులోకి తీసుకొచ్చింది. ఇది ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే ఈ వార్షిక పాస్ లక్ష్యం.

ఈ యాన్యువల్ పాస్ నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ.3,000 ఒక్కసారి చెల్లిస్తే, ఇది యాక్టివేషన్ అయిన తేదీ నుండి ఒక సంవత్సరం వరకు లేదా 200 ప్రయాణాల వరకు చెల్లుబాటు అవుతుంది. రాజ్‌మార్గ యాత్ర యాప్‌లో, NHAI, MoRTH అధికారిక వెబ్‌సైట్లలో ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి, రెన్యూవల్ చేసుకోవడానికి ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








