కియా వారి నయా కారుతో కనిపించిన 'సచిన్ టెండూల్కర్'.. రోడ్డుపక్కనే ఛాయ్ & అభిమానులతో మంతనాలు: వీడియో వైరల్
క్రికెట్ అంటేనే మొదటగా చాలామందికి గుర్తొచ్చే పేరు 'సచిన్ టెండుల్కర్' అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే భారతీయ క్రికెట్ చరిత్రకే మకుటాయమానంగా నిలిచిన క్రికెట్ దేవుడు 'సచిన్'. అయితే క్రికెట్ అంటే ఎంత ఇష్టమో కార్లంటే కూడా సచిన్ కి అంతే ఇష్టమని అతి తక్కువమందికి మాత్రమే తెలుసు. గతంలో కూడా ఖరీదైన కార్లలో సచిన్ కనిపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో లేటెస్ట్ కారులో కనిపించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

సచిన్ టెండూల్కర్ ముంబై నుంచి గోవాకి రోడ్ ట్రిప్ వెళ్తున్నట్లు తెలిసింది. ఈ రోడ్ ట్రిప్ కోసం సచిన్ 'కియా' (Kia) కంపెనీ యొక్క 'కారెన్స్' (Carens) ఎంచుకున్నాడు. అయితే సచిన్ కనిపించే ఈ కియా కారెన్స్ అతనిదేనా లేకుండా వేరేవాళ్లదా అనేది స్పష్టంగా తెలియదు.

ముంబై ఉంచి గోవా వెళ్లే సమయంలో బెల్గాం-గోవా హైవేపై టీ తాగడానికి ఆగినట్లు సచిన్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇందులో సచిన్ రోడ్డు పక్కన ఉన్న ఒక టీ షాపులో టీ మరియు రిస్క్ తీసుకోవడం చూడవచ్చు. ఆ తరువాత కారెన్స్ పక్కన నిలబడి రస్క్ తింటూ మాట్లాడటం కూడా వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియోకి ఇన్‌స్టాగ్రామ్ లో ఏకంగా 10 లక్షలకు పైగా లైకులు, ఎక్కువ సంఖ్యలో కామెంట్స్ కూడా వచ్చాయి. కారులో కూర్చున్న డ్రైవర్ మరియు ప్రయాణీకులు లాంగ్ డ్రైవ్ లో అలసిపోతారు కాబట్టి ప్రయాణాలలో ఇలాంటి చిన్న విరామాలు చాలా అవసరం. సచిన్ టీ తాగేసిన తరువాత అక్కడి స్థానికులతో మాట్లాడటం, అభిమానులతో సెల్ఫీలు దిగటం కూడా ఇందులో చూడవచ్చు.

కియా కారెన్స్ దేశీయ మార్కెట్లో అద్భుతమైన 7 సీటర్ కారు. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటంతో పాటు అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కియా కారెన్స్ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే సచిన్ కనిపించిన కారు ఏ వేరియంట్ అనేది స్పష్టంగా తెలియదు.

కియా కారెన్స్ మొత్తం మూడు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 1.5 పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్.
ఇందులోని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 డిసిటితో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. మూడవ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అందుబాటులో ఉంటుంది, ఈ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

నిజానికి సచిన్ కార్ గ్యారేజిలో అత్యంత ఖరీదైన కార్ల దగ్గర నుంచి మారుతి 800 వరకు ఉన్నాయి. ఇటీవల 'సచిన్ టెండూల్కర్' 'పోర్షే 992 టర్బో ఎస్ స్పోర్ట్స్' కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కారు కస్టమైజేషన్ చేసినట్లు అర్థమవుతోంది.

ఈ కారు యొక్క ముందు మరియు వెనుక భాగంలో డిఫ్యూజర్‌లు అమర్చబడ్డాయి, అలాగే కారు బానెట్‌లో కూడా మార్పులు చేయబడ్డాయి. రియర్ స్పాయిలర్ కూడా విలాసవంతమైన అల్లాయ్ వీల్స్‌తో ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది కారుని మరింత స్పోర్టీగా కనిపించేలా చేస్తుంది.

పోర్స్చే 992 టర్బో ఎస్ లో 3.8-లీటర్ 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 650 బిహెచ్‌పి పవర్ మరియు 800 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్టాండర్డ్‌గా 4X4 డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు గరిష్టంగా 330 కిలోమీటర్ల వరకు ఉంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
సచిన్ టెండూల్కర్ వద్ద ఉన్న చాలా కార్లను గురించి గతంలో కూడా చాలా సార్లు చాలా కథనాల్లో తెలుసుకున్నాం. సచిన్ వద్ద ''మారుతి 800, ఫెరారీ 360 మొడెనా, బిఎండబ్ల్యూ ఐ 8, నిస్సాన్ జిటి-ఆర్, బిఎండబ్ల్యూ 7 సిరీస్, బిఎండబ్ల్యూ ఎమ్ 6 గ్రాన్ కూపే మరియు బిఎండబ్ల్యూ 30 జహ్రే ఎమ్5 ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త కియా కారెన్స్ ఎవరికి సంబంధించినది అనేది స్పష్టంగా తెలియదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








