మోటోజీపీ భారత్ రేసింగ్ ఈవెంట్‌లో సందడి చేసిన సద్గురు.. ఆసక్తికర విషయాలు పంచుకున్న జగ్గీ..
గ్రేటర్ నోయిడాలో MotoGP Bharat Grand Prix ఉత్సాహంగా జరుగుతోంది. నేడు రెండో రోజు క్వాలిఫయర్ రేస్ జరుగుతోంది. మొట్టమొదటిసారిగా భారత్‌లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌ను చూసేందుకు రేసింగ్ లవర్స్, ఔత్సాహికులు, సెలబ్రిటీస్ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ మోటోజీపీ భారత్ రేసింగ్ ఈవెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
సద్గురు(Sadhguru jaggi Vasudev)కి బైక్‌లంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే మోటోజీపీ భారత్ బైక్ రేసును చూసేందుకు జగ్గీ వాసుదేవ్ బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌కి వెళ్లారు. MotoGP రేసులను ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన రేసులుగా పరిగణిస్తారు. ఇప్పటివరకు ఈ పోటీలు విదేశాల్లో మాత్రమే జరిగేవి. దేశంలోని బైక్ రైడర్లలో ఆసక్తిని పెంచడానికి భారత ప్రభుత్వం MotoGP రేసింగ్‌ను ఈ సారి దేశంలో నిర్వహిస్తోంది.

MotoGP Bharat 2023 గ్రాండ్ ప్రిక్స్ బైక్ రేస్ పోటీ ప్రస్తుతం నోయిడా మెట్రోపాలిటన్ ఏరియాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరుగుతోంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీకి సంబంధించి ఫైనల్స్ ఆదివారం(సెప్టెంబర్ 24) జరగనున్నాయి. ఈ బైక్ రేస్‌ను చూసేందుకు ప్రస్తుతం వేలాది మంది ప్రజలు BIC కి తరలివస్తున్నారు.
ఈ సందర్భంగా కోయంబత్తూరులో ఉన్న ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ రేసింగ్ ఈవెంట్‌ను చూసేందుకు నోయిడా వెళ్లారు. ఈవెంట్ జరుగుతున్న చోటుకి బైక్‌పై వెళ్లి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. బైక్ రైడింగ్‌తో సద్గురుకి మంచి అనుబంధం ఉంది. తరచుగా సద్గురు బైక్‌పై దేశమంతటా పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ సందర్భంగా సద్గురు MotoGP గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భారత్‌లో ఎక్కువగా బైక్‌లను ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజుల్లో యువత తమకున్న ఎనర్జీ, ఆసక్తిని ప్రదర్శించడానికి ఈ బైక్ రేస్ కీలకమైన పాత్ర పోషిస్తుందని సద్గురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
చాలా మంది బైక్ రేసింగ్ ప్రమాదకరమైన పోటీగా భావిస్తారని సద్గురు అన్నారు. అయితే ట్రాక్‌పై బైక్‌తో రేస్ చేయడం కంటే రోడ్డుపై బైక్ నడపడం చాలా కష్టమన్నారు. ట్రాక్‌లో జరిగే ప్రతిదీ నియంత్రణలో జరుగుతుందని.. ఇక్కడ కొన్ని నియమాలుంటాయని వెల్లడించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించలేమని చెప్పారు. కానీ రోడ్డుపై అలాంటి నియమాలు లేనప్పటికీ తరచుగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.
'నాకు 18 ఏళ్లు నిండిన వెంటనే నా టూ వీలర్ లైసెన్స్ వచ్చింది. నేను బైక్ నడిపేటప్పుడు కేవలం రవాణా సాధనంగానే ఉపయోగిస్తాను. దానిపై రేసింగ్ చేయను. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత నేను భారతదేశం అంతటా ప్రయాణించడం స్వేచ్ఛగా భావించాను.' అని సద్గురు తెలిపారు.
తాను చాలాసార్లు బైక్ దేశమంతటా తిరిగినట్లు సద్గురు అన్నారు. తన దగ్గర సూపర్ బైక్‌లు లేవన్నారు. సాధారణ 250 సీసీ, సింగిల్ సిలిండర్ బైక్ ఉందని సద్గురు వెల్లడించారు. అందుకే MotoGP Bharat రేసింగ్ ఈవెంట్ వీక్షించేందుకు బైక్‌పై రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అలా వస్తూ మార్గమధ్యలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నట్లు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొనడం భారతదేశంలో బైక్ రైడింగ్ పట్ల మక్కువ ఉన్న చాలా మంది దృష్టిని ఆకర్షించింది. బైక్ రైడింగ్ క్రేజ్‌కి వయసు అడ్డంకి కాదని సద్గురు నిరూపించారు. ఇక MotoGP భారత్ పోటీల విషయానికొస్తే, ప్రస్తుతం 41 టీంలలో 82 మంది రైడర్లు పాల్గొంటున్నారు. ఫైనల్స్ రేపు జరుగుతాయి. ఫైనల్స్ ముగిసిన తర్వాతే విజేతలను ప్రకటిస్తారు.


Click it and Unblock the Notifications








