సైనా నెహ్వాల్‌కు బిఎమ్‌డబ్ల్యూ కారుని అందజేసిన సచిన్

చాముండేశ్వరీనాథ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఒలంపిక్స్‌లో భారత్ తరఫున పతకాన్ని సాధించినట్లయితే, సైనాకు ఓ కారును బహుకరిస్తానని ఆమె ఒలంపిక్స్‌కు వెళ్లకముందు ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే సైనా నెహ్వాల్‌కు ఈ లగ్జరీ కారును ఆమె అభిమానించే సచిన్ చేతుల మీదుగా అందజేశారు. కాగా.. ఒలంపిక్స్‌లో ఇండియాకు కాంస్యం తెచ్చిపెట్టిన సైనాకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 లక్షల నగదు రివార్డును కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ సైనా నెహ్వాల్ గురించి మాట్లాడుతూ.. సైనా సంతోషంగా ఉందని, అయితే సంతృప్తిగా మాత్రం లేదని తాను భావిస్తున్నానని అన్నారు. గోపీచంద్ మార్గదర్శకంలో సైనా మరిన్ని అత్యున్నత శిఖరాలకు చేరుకోగలదన్న విశ్వాసం తామందరికీ ఉందని, మరిన్ని మంచి రోజులు ముందున్నాయని ఆయన అన్నారు. ఒక క్రీడాకారుడిగా ఎల్లప్పుడూ తాను సాధించాల్సింది ఇంకా ఉందనే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సచిన్ చెప్పారు.
ఇది వరకు చెప్పుకున్నట్లు గానే, జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇటీవల సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా దేశీయ విపణిలో విడుదల చేసిన ఎంట్రీ-లెవల్ లగ్జరీ కారు బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌నే సైనా నెహ్వాల్‌కు బహుమతిగా ఇవ్వటం జరిగింది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఇది మొత్తం ఐదు వేరియంట్లలో (1 పెట్రోల్, 4 డీజిల్) లభిస్తుంది. ఈ కారు ధరలు రూ. 28.90 లక్షల నుంచి రూ. 37.90 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉన్నాయి.
ఈ సెగ్మెంట్లోని ఆడి ఏ4 సెడాన్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మోడళ్లకు ఇది గట్టి పోటీగా నిలువనుంది. డీజిల్ వెర్షన్ 3 సిరీస్ (320డి)లో ఉపయోగించిన 4-సిలిండర్ ట్విన్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ లీటర్ డీజిల్‌కు 18.88 కి.మీ. మైలేజీనిస్తుంది.
అలాగే, పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ (328ఐ)లో ఉపయోగించిన ట్విన్ పవర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 245 బిహెచ్‌పిల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ పెట్రోల్‌కు 14.79 కి.మీ. మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications








