పెట్రోల్, పాల ట్యాంకర్లు గుండ్రంగానే ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా గమనించారా??.. దాని వెనుక అసలు కారణాలివే..
జాతీయ రహదారులపై పెద్ద ట్రక్కులు, లారీలు తరచూ వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. గూడ్స్ రవాణాలో కీలక పాత్ర పోషిస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నాయి. అయితే ట్రక్కులన్నీ ఒకే ఆకారంలో ఉండవని మీరెప్పుడైనా గమనించారా.?? ట్రక్కు(Tankers Shapes)ల్లోనూ వాటి ఉపయోగాన్ని బట్టి వివిధ షేపుల్లో ఉంటాయి. ఆ ఆసక్తికర సమాచారం ఈ కథనంలో..
సాధారణంగా భారత్‌లో వాడకంలో ఉన్న ట్రక్కుల్లో ఒక్కో ట్రక్కు ఒక్కో డిజైన్‌లో ఉండటం మీరు గమనించే ఉంటారు. కొన్ని ట్రక్కులు వెనుక భాగంలో సరుకుతో మరియు టార్పాలిన్‌తో కప్పబడి ఉంటాయి. కాగా కొన్ని దాదాపు వెనుక భాగంలో పూర్తిగా కప్పబడి ఉండటాన్ని చూడవచ్చు. ఇంకా పెట్రోల్, డీజిల్, పాలు లాంటి ద్రవ పదార్థాలను తీసుకెళ్లే ట్రక్కుల ట్యాంకర్లు గుండ్రని ఆకారంలో ఉంటాయి.

ద్రవ పదార్థాలను తీసుకెళ్లే ట్రక్కులు మినహా మిగతావి ఏవీ వృత్తాకార(Circular Shape)లో ఉండవు. అవి చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. అయితే పెట్రోల్‌తో సహా ద్రవ పదార్థాలను తీసుకువెళ్లే ట్రక్కులు మాత్రమే గుండ్రంగా ఎందుకు ఉంటాయి.. మిగతావి ఎందుకు ఉండవు మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా.. దీని వెనుక కొన్ని సైంటిఫిక్(Scientific Reasons Behind Tankers Shapes) కారణాలే ఉన్నాయి. అవేంటంటే.??
సాధారణంగా ఘన పదార్థాలు అంటే పత్తి, చెక్క సామగ్రి లేదా ఇతర గూడ్స్‌ను తరలించే ట్రక్కులు చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ఎందుకంటే ఇలా రెక్టాంగ్యులర్, స్క్రేర్ షేపులు ఉన్న లారీల్లో ఎక్కువ లోడ్‌ను తరలించవచ్చు. ఇంకా ఇంధనాన్ని ఆదా చేసేందుకు వీటిని ఈ రూపంలో నిర్మిస్తారు. కానీ ఇలాంటి ట్రక్కుల్లో లిక్విడ్ పదార్థాలను తరలించలేరు.

అయితే లిక్విడ్ ట్యాంకర్లు నాలుగు విభిన్న రకాల డిజైన్లలో ఉంటాయి. గుండ్రటి(Circular) ఆకారం, దీర్ఘ వృత్తాకారం(Elliptical), డబుల్ D ఆకారం(Double D Shape), పొడిగించిన ఉపరితలం(Extended Surface) ఆకారంలో ఉంటాయి. అయితే గుండ్రని ఆకారం అనేది సిలిండర్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
మరొకటి దీర్ఘచతురస్రాకార వృత్తాకారంలో ఉండి.. ఎగువ భాగంలో కొంచెం ఎత్తుగా ఉంటుంది. డబుల్ D షేప్ ట్యాంకర్లు రెండు వైపులా వెడల్పుగా ఉండటంతో పాటు ఎత్తు తక్కువగా ఉంటుంది. ఇక స్ట్రెచి టాప్ ఆకారం ఉన్న ట్యాంకర్లలో కేవలం పైభాగం మాత్రమే ఫ్లాట్‌గా(సమాంతరంగా) ఉంటుంది.

అయితే పైన పేర్కొన్న నాలుగు రకాల వాహనాల్లో ద్రవ ఉత్పత్తులను రవాణా చేయడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సాధారణంగా భారీ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్లు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు కొండలు, గుట్టలు, గుంతలు, స్పీడ్ బ్రేకర్ల లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ట్రక్కు ట్యాంకర్‌లో ద్రవ పదార్థం కదులుతుంటుంది.
రోడ్డుపై ట్రక్కులు టర్నింగులు తీసుకున్నప్పుడు లేదా.. గుంతల మీదుగా దాటినప్పుడు ట్యాంకర్‌లోని ద్రవ పదార్థం కదులుతుంటుంది. ఈ సమయాల్లో ద్రవ పదార్ధాలన్నీ ఒకే చోట పేరుకుపోతే అధిక బరువు కారణంగా వాహనం బోల్తా పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వాటిల్లకుండా పైన పేర్కొన్న నాలుగు రకాల ట్యాంకర్లలో పెట్రోల్, డీజిల్, పాల లాంటి ద్రవ పదార్ధాలను తరలిస్తారు.

దీని ద్వారా గరుకు రోడ్లపై సైతం ట్రక్కు బోల్తా పడకుండా ద్రవ పదార్థాలన్నీ మధ్య భాగంలోనే ఉంటాయి. అందుకోసమే ఈ ట్యాంకర్లను ఈ షేప్‌లో రూపొందించారు. ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ ద్రవ కార్గోను రవాణా చేయడానికి ఇలాంటి సర్క్యులర్ ట్రక్కులనే ఉపయోగిస్తారు. చతురస్రాకారంలో మరియు దీర్ఘచతురస్రాకారంలో ఉండే ట్రక్కుల కారణంగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండటంతో వీటిలో తరలించరు.


Click it and Unblock the Notifications








