తక్కువకే వస్తుందని ఆతృతతో ఢిల్లీ పాత కారు కొంటున్నారా ? తస్మాత్ జాగ్రత్త.. నష్టపోతారంటున్న అధికారులు
దేశంలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా భారతదేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. వాయు కాలుష్యం విషయంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రభావితమైన నగరాల్లో ఢిల్లీ ఎప్పుడూ అగ్రస్థానంలోనే నిలుస్తోంది. దీంతో అక్కడ గాలి నాణ్యత మరింత దిగజారిపోతోంది. పలు ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అయితే అవి అనుకున్నంత ఫలితాలను ఇవ్వలేదు. అందుకే ప్రభుత్వం మరింత కఠినమైన నిర్ణయాలను తీసుకుంది. వాటిలో ముఖ్యంగా 15 ఏళ్లు దాటిన కార్లు, ట్యాక్సీలను పూర్తిగా రోడ్లపై నడవనీయకుండా నిషేధం విధించింది. ముఖ్యంగా డీజిల్ కార్లను ఢిల్లీలో పూర్తిగా బ్యాన్ చేశారు. కాలుష్యాన్ని తగ్గించే దిశగా సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహిస్తున్నారు.
అంతేకాకుండా, నగరంలోని ప్రతి ప్రాంతంలో AI ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేసి పాత వాహనాలపై కఠినంగా నిఘా పెట్టారు. 15 ఏళ్లు దాటిన కార్లలో ఇంధనం నింపకుండా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. అలాగే అలాంటి వాహనాలు రోడ్లపైకి రాకుండా నియంత్రిస్తున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో తీసుకున్న చర్యలు అక్కడ పాత వాహనాల మార్కెట్‌ను కుదిపేశాయి. ఈ నిర్ణయంతో ఢిల్లీలో పాత పెట్రోల్ కార్ల యజమానులు వాటిని అమ్మేస్తున్నారు.

కొంతమంది తమ కార్లను ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడుతోంది. ఢిల్లీ నుండి పాత కార్లను తెచ్చి ఇక్కడ సెకండ్‌హ్యాండ్ కార్లుగా విక్రయిస్తున్న వ్యాపారులు పెరుగుతున్నారు. తక్కువ ధరలకు లభిస్తున్నాయనే కారణంగా చాలామంది వాటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటివల్ల మన రాష్ట్రాల్లో వాయు కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
అయితే, అధికారులు ఇలాంటి కార్లను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది మోసగాళ్లు పాడైపోయిన కార్లకు పైకి మెరుగులు దిద్దించి వాటిని అమ్మేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన చిత్రాలు పోస్ట్ చేసి, కొనుగోలుదారులను అడ్వాన్స్ డబ్బు చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారు. అలాంటి అడ్వాన్స్‌లు పంపిన తర్వాత మోసపోయిన ఘటనలు కూడా ఇప్పటికే చోటు చేసుకున్నాయి.

దీంతో అధికారులు ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు, ఢిల్లీ పాత కార్లు సెకండ్‌హ్యాండ్‌గా వస్తున్నాయనే పేరుతో కొనుగోలు చేసేముందు వాహనం రిజిస్ట్రేషన్ పేపర్లు, వాహన స్థితి, చట్టపరమైన అనుమతులను ఖచ్చితంగా చెక్ చేయాలని సూచిస్తున్నారు. లేకపోతే తక్కువ ధరకు కార్లు కొన్నామనుకుని, తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
కారు కొనుగోలు చేసేటప్పుడు తక్కువ ధరకు వస్తోందని వెంటనే నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరం. వాహనం కండిషన్‌ను పూర్తిగా పరిశీలించిన తరువాతే ముందుకు సాగాలి. ముఖ్యంగా మీకు తెలిసిన నమ్మకమైన మెకానిక్‌తో కారును ప్రతి విభాగంలోనూ చెక్ చేయించడం తప్పనిసరి. ఇంజిన్ స్థితి బాగానే ఉందా? ఆయిల్ గేజ్ సరిగ్గా పనిచేస్తుందా? అనే విషయాలను చూసుకోవాలి.

అలాగే ఇంజిన్ నంబర్, చాసిస్ నంబర్ లాంటి వివరాలు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC)లో పొందుపరిచిన వాటితో సరిపోతున్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలించాలి. ఇంతకుమించి, ఆ వాహనంపై ఎలాంటి కేసులు లేవని నిర్ధారించుకోవాలి. దానికి సంబంధించి పోలీస్ శాఖ నుండి ధృవీకరణ పత్రం పొందడం ఉత్తమం. ఇలా అన్ని పత్రాలు, టెక్నికల్ చెకప్ క్లియర్ అయిన తరువాతే కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను తప్పించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








