లగ్జరీ బెంజ్ కారులో స్పెషల్ ట్రిప్.. తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్ మధుర క్షణాలు!
సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. క్రికెటర్లు, ధనవంతులు, సినిమా తారలు వంటి వారు మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ వచ్చిందంటే వెంటనే దాన్ని కొనుగోలు చేసి తమ గ్యారేజీలో పెట్టుకుంటారు. ముఖ్యంగా సినిపరిశ్రమకు చెందిన వారు ఇటీవల కాలంలో పలు ఈవెంట్‌లకు వెళ్లినప్పుడు లేదా ఎయిర్‌పోర్ట్‌ల వద్ద కోట్లు విలువ చేసే టాప్ బ్రాండ్‌లకు చెందిన లగ్జరీ కార్లతో ఎక్కువగా కనిపిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా బాలీవుడ్‌లో అత్యంత ప్రియమైన జంటలలో ఒకరైన నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) ఆయన భార్య నటి కియారా అద్వానీ (Kiara Advani) ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారుతో కనిపించారు. ఈ సెలబ్రిటీ జంట ఒక బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వీరిద్దరు కలిసి బయట కెమెరాల కంట పడ్డారు.
కియారా తాను గర్భవతినని ఇటీవల ప్రకటించిన తర్వాత వారిద్దరూ బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. ఖరీదైన కారులో నుంచి వీరు బయటకు వస్తున్న ఫోటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గర్భవతిగా ఉన్న సమయంలో కియారా మెర్సిడెస్ బెంజ్ కారును ప్రయాణానికి ఎంచుకున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ జంట చెయి చెయి కలిసి నడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

వారిద్దరు కలిసి వచ్చిన మెర్సిడెస్-బెంజ్ కారు గురించి ఆటో ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు. దీని పేరు మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఈ (mercedes benz gle) కారు. జర్మన్ బ్రాండ్ ఎప్పుడు కూడా సెలబ్రిటీల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో లగ్జరీ కార్లను విడుదల చేస్తుంది. ఇప్పడు సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా కారు జీఎల్‌ఈ మోడల్ కూడా ప్రీమియం లగ్జరీ సదుపాయాలు కలిగి ఉంటుంది. లోపల ఇంటీరియర్ చాలా అందంగా రూపొందించారు.
సీటింగ్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అందుకే గర్భవతిగా ఉన్న సమయంలో కియారా ఈ బెంజ్ కారును ఎంచుకున్నట్లు తెలుస్తుంది. భారతీయ మార్కెట్లో ఈ మెర్సిడెస్-బెంజ్ GLE కారు ప్రారంభ ధర రూ.99 లక్షల నుంచి ఉంటుంది. అదే దీని టాప్ వేరియంట్ విషయానికి వస్తే,రూ.1.17 కోట్ల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే. ఆన్‌రోడ్ అయితే వివిధ పన్నులు మొదలగు వాటితో కలిపి ఇంకా ఎక్కువ ఉంటుంది.

ఈ బెంజ్ కారు రెండు డీజిల్, ఒక పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. దీని ముఖ్యమైన ఫీచర్స్ విషయానికి వస్తే, కెపాసిటివ్ టచ్ కంట్రోల్ ప్యానెల్‌లతో లభిస్తున్నటువంటి మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను MBUX సిస్టమ్‌తో అప్‌డేట్ చేశారు. స్లైడింగ్ ఫంక్షన్ రిక్లైనింగ్ సీట్లు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చాయి. ఇవి మాత్రమే లోపల డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ ఉంటాయి.
లోపల 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్‌తో పనిచేయగల సన్ బ్లైండ్‌లు, ఫాస్ట్ ఛార్జింగ్ USB-C పోర్ట్‌లు, పవర్డ్ టెయిల్‌గేట్, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్ సిస్టమ్, ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు రక్షించడానికి లోపల 9 ఎయిర్‌బ్యాగ్‌లు, చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ వ్యూ కెమెరాలు వంటి ఇతర ఫీచర్స్ ఉన్నాయి.

ఈ లగ్జరీ కారు మాత్రమే కాకుండా వారి వద్ద లక్షల నుంచి మొదలుకుని కోట్లు విలువ చేసే చాలా కార్లు ఉన్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా మెర్సిడెస్-బెంజ్ M-క్లాస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ వంటి లగ్జరీ కార్లు, కియారా అద్వానీ వద్ద మెర్సిడెస్-బెంజ్ E-క్లాస్, మెర్సిడెస్-మేబాచ్ S580,BMW X5, BMW 5 సిరీస్, ఆడి A8L వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








