హైదరాబాద్‌లో ‘సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్'.. ఇక్కడ సైక్లింగ్ మాత్రమే కాదు, మరెన్నో ప్రత్యేకతలు
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్(Solar Roof Cycling Track) అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ నేచర్‌తో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను HMDA ఆధ్వర్యంలో నిర్మించారు. మంత్రి కేటీఆర్(KTR) ఆదివారం(అక్టోబర్ 1) ఈ సైకిల్ ట్రాక్‌ను ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని నార్సింగి దగ్గర ఈ సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 23 కిలోమీటర్ల మేర HMDA ఈ సైకిల్ ట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. నార్సింగి నుంచి పోలీసు అకాడమీ వరకు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు నగరవాసుల కోసం ఈ సైకిల్ ట్రాక్‌ను రూపొందించారు.

23 కిలోమీటర్ల మేర ఉన్న ఈ హైటెక్ సైక్లింగ్ ట్రాక్ ద్వారా 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ విశేషం. ఈ గ్రీన్ ఫీల్డ్ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ పర్యావరణ హితంగానే కాకుండా అటు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ఇటు నగరవాసులకు సైక్లింగ్‌కు దోహదపడుతూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో నార్సింగి- గండిపేట మార్గంలో 4.25 మీటర్ల వెడల్పుతో మూడు లైన్లలో ఈ సోలార్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు. అయితే నార్సింగి నుంచి పోలీస్ అకాడమీ వరకు 8.5 కి.మీ మేర సైకిల్ ట్రాక్ ఉంటుంది. ఇంకా నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14 .5 కిలోమీటర్లు ఉంటుంది.

సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ మార్గాల్లో సైక్లింగ్ చేసేవారికి ఆటవిడుపుగా ఎన్నో వసతులు ఏర్పాటు చేశారు. సైకిలిస్టులు తమ సైకిళ్లను పార్కింగ్ చేసుకునేందుకు పార్కింగ్ ఏరియా సౌకర్యం కల్పించారు. అంతే కాకుండా ట్రాక్ అంతటా సీక్రెట్ కెమెరాలతో నిఘా ఉండటం భద్రతా దృష్ట్యా మరో ప్రత్యేకత.
భోజన ప్రియుల కోసం ఈ ట్రాక్‌పై వివిధ రకాల ఫుడ్ కోర్టులు కూడా అందుబాటులో ఉంటాయి. సైకిల్ ట్రాక్‌ను చూడటానికి వచ్చే సందర్శకులకు, సైకిలిస్టులకు త్రాగునీరు సదుపాయం కల్పించారు. వారికి ఆహ్లాదాన్ని కలిగించేలా ట్రాక్ పక్కన సువాసనలను వెదజల్లే పూల మొక్కలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విశ్రాంతి గదులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

హెచ్‌ఎండీఏ తెలిపిన వివరాల ప్రకారం సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ మార్గంలో సైకిల్ రిపేర్ స్టోర్లు ఉన్నాయి. అంతే కాకుండా అద్దె సైకిల్ స్టోర్లు కూడా ఇక్కడ ఉంటాయట. కేవలం పగటి వేళల్లో మాత్రమే కాకుండా ఈ ట్రాక్ 24 గంటల పాటు అందుబాటులో ఉండటం నగరవాసులకు సంతోషాన్ని కలిగిస్తుందనే చెప్పవచ్చు.
మరో ప్రత్యేకత ఏంటంటే.. అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీలు నిర్వహించేందుకు అనుకూలంగా ఈ ట్రాక్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృధ్ది చేసినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు వివరించారు. ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ద్వారా 32 వేల స్ట్రీట్ లైట్స్‌కు పవర్ సప్లయ్ చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టిన పెట్టుబడి.. ఆరేళ్లలో సోలార్ పవర్ ద్వారా ట్రాక్ ద్వారా వెనక్కి వచ్చేస్తుందన్నారు.

ఈ ట్రాక్‌పై 16వేల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ సైక్లింగ్ లాంటి శారీరక శ్రమ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్ మొత్తం గండిపేట చుట్టూ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ద్వారా నగరంలో కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా.. ఐటీ కారిడార్‌లో సైక్లిస్టులకు ఈ ట్రాక్ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. మొదటి సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ సౌత్ కొరియాలో ఉండగా.. భారత్‌లో అదీ మన హైదరాబాద్‌లో ఇది మొట్టమొదటిది. 2022 సెప్టెంబర్ 6న మంత్రి కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేయగా ఏడాది కాలంలోనే ఇది పూర్తయింది.


Click it and Unblock the Notifications








