Viral video బైక్‌పై ‘త్రీ ఇడియట్స్' సీన్ రీ క్రియేట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పోలీసులు..
కొంత మంది రీల్స్ చేయడానికి వెనుకాముందు ఏం ఆలోచించడం లేదు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కొందరు రీల్స్ చేస్తున్నారు. పబ్లిక్ రోడ్లపై బైక్‌పై స్టంట్లు చేయడం, కారు నడుపుతుండగా డోరు తీసి వేలాడటం, బ్యానెట్‌పైకి ఎక్కి కూర్చోవడం, సన్‌రూఫ్ ద్వారా బయటకు రావడం ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.
ఈ విషయాన్ని గ్రహించిన పోలీసులు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ కంటెంట్‌ను వినియోగించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అందుకే ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా పేజీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా మనల్ని తరచుగా అలరిస్తాయి. తీవ్రమైన సమస్యలపై అవగాహన కల్పించేందుకు వారు తీసుకుంటున్న చర్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. మీమ్స్ మరియు ట్రెండింగ్ రీల్స్‌తో, ఢిల్లీ పోలీసులు తమ విధులను వినూత్నంగా నిర్వర్తిస్తారు.

తాజాగా ఓ వీడియోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఢిల్లీ పోలీసులు. 'త్రీ ఇడియట్స్' మూవీ చూసే ఉంటారు కదా.. ఆ సినిమాలో ఓ సీన్‌ను రీ క్రియేట్ చేశారు కొందరు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు వారికి ఝలక్ ఇచ్చారు. ఇంతకీ ఆ సీన్ ఏంటి.. పూర్తి వివరాలు ఈ కథనంలో చదవండి.
అమీర్ ఖాన్ స్టార్‌గా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ 'త్రీ ఇడియట్స్'లో స్కూటీపై ముగ్గురు ఆస్పత్రికి వెళ్తారు. మధ్యలో అనారోగ్యంతో ఉన్న వృద్ధుడు కిందపడకుండా తాడుతో తనకి కలిపి కట్టుకుంటాడు హీరో. ఆ సీన్‌ను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు కొందరు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు తమదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి బుల్లెట్ బైక్‌ను నడుపుతుండటాన్ని చూడవచ్చు. 'త్రీ ఇడియట్స్' సినిమా పాట 'జానే నహీ దేంగే తుజే...' బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంది. అతివేగంగా వెళ్తున్న ఆ బైక్‌పై ఓ యువకుడితో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి అమీర్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో, ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లింది. అంతే కాకుండా బైక్ నడుపుతున్నప్పుడు ఎవరూ హెల్మెట్ ధరించకపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వీడియోను 'ఢిల్లీ పోలీస్' (@DelhiPolice) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా జూలై 24న పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 'ఆల్ ఈజ్ నాట్ వెల్' అనే టైటిల్ కూడా పెట్టారు. అదేంటంటే.. సినిమా స్ఫూర్తితో వాహనం నడిపితే.. నిజజీవితంలో జరిమానా తప్పదన్నదే ఈ వీడియోలోని మెయిన్ పాయింట్.
వీడియో చివరలో "బినా చలాన్ కే జానే నహీ దేంగే తుజే (మేము మిమ్మల్ని చలాన్ లేకుండా వెళ్ళనివ్వము)" అని కూడా రాశారు. 'రోడ్ల మీద మూర్ఖులు కావద్దు' అంటూ వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయరాదని ప్రజలను కోరుతూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు.
ఇప్పటివరకు ఈ వీడియోకు 31 వేలకు పైగా వ్యూస్, 250కి పైగా లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు దీనిపై భిన్నరకాలుగా స్పందించారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఢిల్లీ పోలీసులే ఈ విధంగా వీడియో రూపొందించారని మరికొందరు కామెంట్స్ చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








