నాన్నకు ప్రేమతో 25 ఏళ్ల కిందటి కారుని గిఫ్ట్‌గా ఇచ్చిన కుమారులు..
ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అపురూపమైన చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి. వారి వారి తల్లిదండ్రులు ఉపయోగించే వాహనాలపై వారికి ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొందరి జీవితాల్లో ఆ వాహనాలు అదృశ్యమైపోతాయి. చాలామంది దానిని మళ్లీ తమ జీవితంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
ఇలాంటి సంఘటనే ఒకటి కేరళలో చోటుచేసుకుంది. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం, ఎంతో ఇష్టంగా చూసుకుంటూ ఉన్న తమ కుటుంబం నుంచి దూరమైన అంబాసిడర్ కారును 'ఫాదర్స్ డే' సందర్భంగా పిల్లలు తమ తండ్రికి తిరిగి బహుమతిగా ఇచ్చారు. ఈ కారును చూసిన ఆనందంలో తండ్రి కళ్లలో సంతోషం వర్ణించలేనిది. కుటుంబం మొత్తం ఆ కారుతో ఫొటో దిగి సంబరాలు చేసుకున్నారు.

కేరళలో 84 ఏళ్ల అచ్యుతన్ నాయర్ కుటుంబంతో కలిసి ఉండేవారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాత నీలిరంగు కారు ఇంటి ముందు ఆగింది. ఆ కారును చూసిన అచ్యుతన్ నాయర్‌కు ఏం అర్థం కాలేదు. కానీ, 1959 మోడల్ అంబాసిడర్ కారు త్రిసూర్ రిజిస్ట్రేషన్ నంబర్ చూడగానే అతనికి ఆ కారుతో పాత జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి. ఆ కారుతో 23 ఏళ్ల పాటు కొనసాగిన అనుబంధం గుర్తుకువచ్చింది.
మలయాళ కవి వల్లట్టోల్ సోదరి కుమారుడు అచ్యుతన్ నాయర్ డాక్టర్ విఆర్ మీనన్ వద్ద సహాయకుడిగా పనిచేశారు. డాక్టర్ మీనన్ 1968లో ఈ అంబాసిడర్‌ని కొనుగోలు చేశారు. అతనికి సహాయకుడిగా ఉన్న అచ్యుతన్ నాయర్ దాని నిర్వహణను చూసుకునేవారు. నాయర్ కుమారులు అజిత్, సుజిత్‌లు కూడా అంబాసిడర్ కారును తమ ఇంటి వద్దే పార్క్ చేయడంతో దానిపే ప్రత్యేక అభిమానం పెంచుకున్నారు.
అచ్యుతన్ నాయర్ జీవితంలో అంబాసిడర్ కారు అంతర్భాగంగా ఉండేది. 23 ఏళ్ల పాటు ఆ కారుతో ఎనలేని అనుబంధం కొనసాగింది. సరిగ్గా 23 ఏళ్ల తర్వాత డాక్టర్ వీఆర్ మీనన్ ఆ కారును విక్రయించారు. ఆ తర్వాత డాక్టర్‌గా రెండేళ్లు పనిచేసిన అచ్యుతన్ నాయర్.. పిల్లలు ఉద్యోగం చేయడంతో తన ఉద్యోగం మానేశారు.
అచ్యుతన్ నాయర్ ఈ కారుతో తన బంధాన్ని తరచూ గుర్తుచేసుకునేవారు. ఈ విషయం గమనించిన కుమారులు అజిత్, సుజిత్ అంబాసిడర్ కారు కోసం వెతకడంలో ప్రారంభించారు. ఈ కారు ప్రస్తుత యజమానులను గుర్తించిన తర్వాత ఆ కారును విక్రయించాలని కోరారు. మొదట, ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ఈ కారుతో తమ తండ్రి జ్ఞాపకాలను చెప్పగానే ఇవ్వడానికి అంగీకరించారు.
25 ఏళ్ల క్రితం, ఈ అంబాసిడర్ కారుకు నలుపు రంగు వేసి, సరికొత్త రూపంతో ఉండేది. ఇప్పుడు, ఆ కారు నీలం రంగుతో ఉంది. అచ్యుతన్ నాయర్ పిల్లలు కారుతో పాత మరియు కొత్త చిత్రాన్ని పంచుకున్నారు. తండ్రికి ఇష్టమైన బహుమతిని ఇవ్వడం పట్ల అందరూ వారిని మెచ్చుకుంటున్నారు.
ఇంగ్లండ్ బేస్‌డ్ మారిస్ ఆక్స్‌ఫర్డ్ కంపెనీకి చెందిన ఈ అంబాసిడర్ కారును 'హిందూస్థాన్ మోటార్' భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 1957 నుండి 2014 వరకు ఇది మార్కెట్‌లో విక్రయంలో ఉంది. ప్రధాన మంత్రుల నుంచి సామాన్యుల వరకు ఈ కారును వినియోగించారు. కానీ, ఆకర్షణీయమైన ఫీచర్లతో కొత్త కార్లు రావడంతో అంబాసిడర్ ఆదరణ రోజురోజుకూ తగ్గి చరిత్ర పుటలో చేరింది.


Click it and Unblock the Notifications








