మైనర్ బాలుడి కార్ డ్రైవింగ్.. మహిళల ప్రాణాలు బలిగొన్న మితిమీరిన వేగం
దేశంలో రోజురోజుకి రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాల సంఖ్య తీవ్రతరమవుతోంది. ఈ ప్రమాదాలు జరగటానికి కారణాలు కోకొల్లలు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత ప్రభుత్వాలు మోటార్ వాహన చట్టాన్ని మరింత కఠినతరం చేస్తున్నాయి. అయినప్పటికి ఈ ప్రమాదాలు పూర్తి స్థాయిలో నశించడం లేదు. ఇటీవల తెలంగాణలో ఒక కారు 4 మంది మహిళల మరణానికి కారణం అయ్యింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ నగరంలోని కమాన్ సెంటర్ వద్ద ఆదివారం ఉదయం ఒక కారు అదుపుతప్ప రోడ్డు పక్కన గుడిసెల మీదికి దూసుకెళ్లింది. కారు చక్రాలకింద నలిగిపోయి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన తరువాత నిందితులు కారును అక్కడే వదిలేసి అక్కడినుంచి జారుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మైనర్ బాలుడు కారును నడిపినట్లు వర్గాలు తెలుపుతున్నాయి. అయితే వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు తీసుకుంటున్నాము. ఇందులో చనిపోయిన నలుగురు కూలీ చేసుకుని జీవనం సాగించుకునేవారని తెలిసింది.
ఘటనలో నుజ్జయిపోయిన కారును పోలీసులు క్రేన్ ద్వారా బయటికి తీశారు. కరీంనగర్ పోలీస్ ఉన్నతాదికారులు, వైద్య అధికారులు మృతుల వివరాలను వెల్లడించారు. ఈ సమాచారం ప్రకారం చనిపోయిన నలుగురూ మహిళలే, ఇందులో ఒక మైనర్ బాలిక కూడా ఉంది. చనిపోయినవారిని సునీత(28), లతిత(25), జ్యోతి(13), ఫరియాద్(27) గా గుర్తించారు.

ప్రమాదానికి కారణమైన కారు హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా రుగా మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ కారుపై ఇప్పటికే 9 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి. ప్రమాదం సమయంలో డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు 100 కంటే ఎక్కువ వేగంతో వెళ్లినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ ప్రమాదంపై అక్కడి జిల్లా కలక్టర్ కూడా స్పందించారు. దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. అంతే కాకూండా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, స్థానిక ఎంపీ బండి సంజయ్ కూడా ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలంటూ పలు పార్టీలు, సంఘాలు కూడా ప్రభుత్వాలను డిమాండ్ చేసాయి.
ఈ హ్యుందాయ్ కారు ప్రమాదానికి ముందే పెట్రోల్ కొట్టించి రాంగ్ రూట్ లో వెళ్లి ఈ దుర్ఘటనకు కారకులయ్యారని చెబుతున్నారు. అంతే కాకుండా ఇందులో ఆ మైనర్ బాలుడితోపాటి మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇలాంటి సంఘటన జరగటం ఇదే మొదటి సారి కాదు. ఇందకు ముందు కూడా ఇలాంటి సంఘటనలో చాలానే వెలుగులోకి వచ్చాయి. దేశంలో మరియు ఆయా రాష్ట్రాల్లో మోటార్ వాహన చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొంతమంది తల్లితండ్రులు కూడా వారి మైనర్ పిల్లలకు కార్లు మరియు బైకులను ఇచ్చి, ఇలాంటి సంఘటనలు జరగటానికి మార్గదర్శకులవుతున్నారు.
నిర్ణీత వయసు వుండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ప్రజారహాదారులపైన డ్రైవింగ్ చేయడానికి అర్హులు. ఇది దాదాపు అందరికి తెలుసు, కానీ పాటించడంలో మాత్రం చాలా తక్కువమంది ఉన్నారు. సరైన డ్రైవింగ్ అనుభవం లేనివారు ఇలాంటి చర్యలకు పాల్పడతారు. తద్వారా కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇది చాలా అమానుషం. దీనిపైన పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకోవాలి.


Click it and Unblock the Notifications








