పర్యాటకులకు ‘స్టార్ ఎయిర్ ఫ్లైట్స్' బంపర్ ఆఫర్.. తక్కువ ధరలో హైదరాబాద్, తిరుపతి, గోవా చుట్టేయండి.!!
ఫ్లెట్ జర్నీ చేయాలనుకునేవారికి స్టార్ ఎయిర్ ఫ్లైట్స్(Star Air Flights) తీపి కబురు తీసుకొచ్చింది. ఇక నుంచి హైదరాబాద్, తిరుపతి, గోవాలకు విమాన సర్వీసులను సులభతరం చేసింది. తక్కువ ఖర్చులో ప్రయాణికులు ఫ్లైట్ జర్నీ చేసేయొచ్చు. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి ఈ సర్వీసులను నేటి(నవంబర్ 21) నుంచి ప్రారంభించింది.
కర్ణాటకలోని శివమొగ్గ(షిమోగా) నుంచి హైదరాబాద్, తిరుపతి, గోవా వెళ్లానుకునేవారికి స్టార్ ఎయిర్ ఫ్లైట్స్ సరికొత్త సర్వీసులను ఈ రోజు నుంచి ప్రారంభించింది. షిమోగాలోని కువెంపు విమానాశ్రయం నుంచి హైదరాబాద్, తిరుపతి, గోవాలకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. స్టార్ ఎయిర్ తన కొత్త ఎంబ్రేయర్ E175 ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఈ సర్వీసును అందిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, తిరుపతికి ఈ విమాన సదుపాయం అందుబాటులోకి రావడంతో వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతుంది. అంతే కాకుండా తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలను యాత్రికులు సందర్శించేందుకు సౌకర్యంగా ఉంటుంది. గోవా బీచ్‌లో వీకెండ్స్ గడపాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని స్టార్ ఎయిర్ ఫ్లైట్స్ తెలిపింది.
కాగా స్టార్ ఎయిర్‌కు చెందిన ఎంబ్రేయర్ E175 విమానాన్ని చాలా అధునాతనంగా నిర్మించారు. ఇది టూ క్లాస్ సీటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉండటం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇందులో 12 - లగ్జరీ బిజినెస్ క్లాస్, 64 - ఎకానమీ క్లాస్ ఉన్నాయి. ఇందులో భోజన సదుపాయం కూడా ఉంది.

ఈ మేరకు శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర సోమవారం తన X (ట్విటర్) ఖాతాలో సంబంధిత సమాచారాన్ని పంచుకున్నారు. శివమొగ్గ విమానాశ్రయం ఇప్పుడు మరో మైలురాయికి సిద్ధమైందని.. నవంబర్ 21 (మంగళవారం) నుంచి షిమోగా నుంచి 3 కొత్త రూట్లలో (గోవా, తిరుపతి, హైదరాబాద్) విమాన రాకపోకలు ప్రారంభమవుతున్నాయని ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎంబ్రేయర్ E175 విమానం ఉదయం 11 గంటలకు షిమోగా నుండి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. మళ్లీ అక్కడి నుంచి మధ్యాహ్నం 12:25 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు షిమోగా ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. కాగా ప్రయాణ సమయం 1 గంట మాత్రమే.

ఇక షిమోగా నుంచి హైదరాబాద్‌కు సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరుతుంది. కేవలం గంట 5 నిమిషాలు అంటే సాయంత్రం 5:35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. గోవాకు విమానం షిమోగా నుంచి మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2:45 గంటలకు గోవా ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది.
రిటర్న్ జర్నీలో గోవా నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి 4:05 గంటలకు షిమోగా విమానాశ్రయం చేరుకుంటుంది. కాగా గోవా నుంచి షిమోగాకు ప్రయాణ వ్యవధి కేవలం 50 నిమిషాలు మాత్రమే. ఫ్లైట్ టిక్కెట్ ధరలు రూ.1,999 నుంచి ప్రారంభమవుతాయి. సీట్ల లభ్యత ఆధారంగా ధరలు మారుతుంటాయని గమనించాలి.
షిమోగా నుంచి గోవా, తిరుపతి, హైదరాబాద్‌కు విమాన సర్వీసు ప్రారంభం కావడం పర్యాటకులకు ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు. శివమొగ్గలో పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు తెలుగు ప్రజలకు ఇది మంచి అవకాశం. అంతే కాకుండా తక్కువ ఖర్చులో విమాన ప్రయాణం చేయవచ్చు. దీని ద్వారా పర్యాటక రంగాలతో పాటు వివిధ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








