లండన్‌లో చోరీకి గురైన కారు పాకిస్థాన్‌లో దొరికింది.. అక్కడి నుండి ఇక్కడికి ఎలా వచ్చిందంటే..?
కార్ల దొంగతనాల గురించి మీరు చాలానే విని ఉంటారు, కానీ ఇలాంటి ప్రత్యేకమైన కార్ దొంగతం గురించి మాత్రం బహుశా ఇప్పుడే చదువుతున్నారేమో. లండన్‌లో చోరీకి గురైన ఓ కాస్ట్లీ కారును అధికారులు పాకిస్థాన్‌లో స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ కారు లండన్ నుండి పాకిస్థాన్‌కు ఎలా చేరింది, ఆ గజదొంగ ఎవరు తదితర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
Recommended Video
ప్రపంచంలోని ప్రతి దేశంలో వాహనాల దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. సైకిళ్ల నుంచి విమానాల వరకూ అనేక రకాల వాహనాలు చోరీకి గురవుతుంటాయి. దొంగలు ఇలా దొంగిలించిన వాహనాలను వేరే ప్రాంతాలలో నకిలీ పేపర్లతో విక్రయించడం లేదా విడిభాగాలుగా చేసి, బ్లాక్ మార్కెట్లో విక్రయించడం చేస్తుంటారు. తాజాగా, ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన కార్లలో ఒకటైన బెంట్లీ ముల్సాన్ కారును లండన్‌లో చోరీ చేసి, దానిని పాకిస్థాన్‌లో విక్రయించారు.

ఈ చోరీ విషయంలో కస్టమ్స్ అధికారులకు అందిన సమాచారం ప్రకారం, గత నెల 30వ తేదీన పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో గాలింపులు నిర్వహించారు. విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అందించిన సమాచారంతో కరాచీలోని డీహెచ్‌ఏ ప్రాంతంలో గాలించగా, అక్కడ గ్రే కలర్ బెంట్లీ మల్సాన్ కారు కనిపించింది. అయితే, అది స్థానిక పాకిస్థాన్ రిజిస్ట్రేషన్ నెంబరు ప్లేటును కలిగి ఉంది. అనుమానం వచ్చిన అధికారులు విన్ (VIN) నెంబరును తనిఖీ చేయగా, అది లండన్‌లో చోరీకి గురైన బెంట్లీ కారుగా గుర్తించారు.

బెంట్లీ ముల్సాన్ చాలా ప్రత్యేకమైన లగ్జరీ కారు. కంపెనీ ఈ కారును మాస్ ప్రొడక్షన్ చేయదు. చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 7500 బెంట్లీ ముల్సాన్ కార్లు మాత్రమే ఉన్నాయి. అంటే, ఎంత అరుదైనవో సులువుగా అర్థం చేసుకోవచ్చు. వీటిని కొనుగోలు చేసే కస్టమర్లు కూడా చాలా అరుదుగా మరియు అత్యంత హై-ప్రొఫైల్ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అందుకే, పోలీసులు ఈ కేసును సులువుగా ఛేదించగలిగారు.

లండన్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఈ ఖరీదైన బెంట్లీ ముల్సాన్ కారును కొనుగోలు చేశారు. అయితే, కొన్ని నెలల క్రితం ఈ కారు చోరీకి గురైంది. దీంతో అతను లండన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఖరీదైన కార్లను అక్కడి సెం బ్లాక్ మార్కెట్లో విక్రయించడం చాలా కష్టం, పైగా ఇది లిమిటెడ్ ఎడిషన్ కావడంతో దీనిని సులువుగా గుర్తించవచ్చని పోలీసులు భావించారు. కానీ, అది వారు అనుకున్నంత సులువు కాలేదు, దేశమంతా గాలించినా సదరు కారు జాడ లభించలేదు.

దీంతో, కారు దేశం దాటి వెళ్లిపోయింటుందేమో అన్న కోణంలో విచారణ చేపట్టగా, చివరకు అది పాకిస్థాన్ లో ఉన్నట్లు గుర్తించారు. లండన్ లో దొంగిలించిన కస్టమ్స్ ఉద్యోగుల సహకారంతో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి, పాకిస్థాన్‌కు దిగుమతి చేసుకున్నారు. ఇలా దిగుమతి చేసుకున్న సమయంలో దిగుమతి సుంఖాన్ని కూడా ఎగవేసినట్లుగా చెబుతున్నారు. ఈ కేసులో కారును దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. కరాచీలో ఈ కారును కొనుగోలు చేసిన యజమని మాట్లాడుతూ, తనకు కారు అమ్మిన వ్యక్తి 2022 నవంబర్ నాటికి చట్టపరంగా పత్రాలన్నీ పూర్తి చేసిస్తానని మాటిచ్చినట్టు చెప్పుకొచ్చారు.

లండన్ నుండి పాకిస్థాన్ చేరుకున్న ఈ లగ్జరీ కారు ఓ ఇంటి ముందు పార్క్ చేసి, నల్లగుడ్డతో కప్పబడి ఉంది. కారుని నడపడానికి తాళాలు లేకపోవడంతో క్యారియర్ సాయంతో దానిని తరలించినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎటువంటి చట్టపరమైన పత్రాలు లేకపోయినప్పటికీ, ఈ కారు సింధ్ ప్రాంతంలో రిజిస్టర్ అయినట్లు చూపబడుతోంది. సాధారణంగా, ఇలాంటి ఇంపోర్టెడ్ కార్ల రిజిస్ట్రేషన్ కోసం విదేశీ వ్యవహారాల శాఖ మరియు కస్టమ్స్ అధికారుల అనుమతి కావాలి. అలాగే, దిగుమతి సుంకాలు మరియు రిజిస్ట్రేషన్ పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ స్కామ్‌లో భాగమైన వారు కూడా హై-ప్రొఫైల్ దొంగలు మాదిరిగా తెలుస్తోంది. కస్టమ్స్ అధికారులు, మోటార్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, పన్నుల శాఖకు సంబంధించిన చాలా మంది అధికారులను లంచాలతో ప్రలోభపెట్టి ఈ కారును పాకిస్థాన్ లో రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం, ఈ కారుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ కారు లండన్ నుంచి పాకిస్తాన్‌కు అక్రమంగా రవాణా కావడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

లండన్‌లో దొంగిలించబడిన బెంట్లీ కారు యొక్క VIN నంబర్ SCBBA63Y7FC001375 మరియు ఇంజన్ నంబర్ CKB304693 గా ఉంది. అదే నెంబరును పాకిస్థాన్ లో లభ్యమైన బెంట్లీ ముల్సాన్ కారుపై గుర్తించారు. దీంతో ఇది లండన్ లో చోరీకి గురైన కారుగా అధికారులు ధృవీకరించారు. పాకిస్థాన్ లో లభ్యమైన ఈ కారు ప్రస్తుత యజమానికి పోలీసులు ప్రశ్నించగా, ఇది తాను వేరొకరి నుంచి కొనుగోలు చేశానని చెప్పాడు. దీంతో ఇప్పుడు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బెంట్లీ ముల్సాన్ లగ్జరీ కారు విషయానికి వస్తే, దీని ధర రూ.5.50 కోట్లకు పైగా (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ కారులోని శక్తివంతమైన ట్విన్-టర్బోచార్జ్డ్, 6752 సీసీ వి8 ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 505 బిహెచ్‌పి శక్తిని మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 752 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.1 సెకండ్లలోనే గంటకు గరిష్టంగా 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 296 కిలోమీటర్లుగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








