ఇన్నేళ్లయినా క్రేజ్ తగ్గని రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్.. చోరీ అయిన ఈ బైక్ కోసం ఇతను ఏం చేశాడో తెలుసా.??
కొన్ని దశాబ్దాలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్(Royal Enfield Bullet)లపై యూత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ప్రత్యేకమైన లుక్, సౌండ్ మరియు ఆకట్టుకునే డిజైన్‌తో అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే నేటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను నడపడమంటే చాలా మందికి థ్రిల్‌గా ఉంటుంది.
అరవై ఏళ్లకు పైగా అదే క్రేజ్‌ను, అదే ట్రెండ్‌ను కొనసాగించడం ఒక్క రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు మాత్రమే చెల్లింది. అయితే ఈ మధ్యనే రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 350ని విడుదల చేసింది. కానీ పాత తరం మోడల్‌కు మాత్రం ఇప్పటికీ భారీ అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల తర్వాత, ఓ యువకుడు తన తండ్రి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కొత్తగా బైక్‌గా పునరుద్ధరించాడు.

ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ బైక్ 20 ఏళ్ల క్రితం చోరీకి గురైంది. ఆ బైక్‌ను గుర్తించి కొత్త బైక్‌గా పునరుద్ధరించి తన తండ్రికి కానుకగా ఇచ్చారు. అరుణ్ అనే వ్యక్తి తండ్రి 1971లో బుల్లెట్ మోడల్ కొనుగోలు చేశారు. అరుణ్ తండ్రి కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకర్‌గా పనిచేసేవారు. ఆయన తన బ్యాంకింగ్ కెరీర్‌లో ఈ బుల్లెట్ బైక్‌ను ఎక్కువగా ఉపయోంగించడం ఇదే మొదటి బైక్ కావడం విశేషం.
అనంతరం 1991 లో, అరుణ్ తండ్రి మొదటి కారును కొనుగోలు చేశారు. తర్వాత అతని తండ్రి మణిపాల్‌కు బదిలీ కావడంతో బుల్లెట్‌ను చాలా అరుదుగా ఉపయోగించేవారు. దీంతో తన సహోద్యోగి బుల్లెట్ బైక్‌ను తనకు విక్రయించాలని కోరగా.. దానికి అరుణ్ తండ్రి తిరస్కరించారు.

కానీ, ఆ తర్వాత అతను బైక్‌ను అమ్మాలనుకుంటే తిరిగి తనకే విక్రయించాలనే షరతుతో బైక్‌ను విక్రయించాడు. తర్వాత అరుణ్ తండ్రి సర్వీసు నుండి రిటైర్ అయ్యి బెంగళూరులో స్థిరపడ్డారు. కానీ ఆయన 1997లో బజాజ్ చేతక్‌ని కొనుగోలు చేశారు. అరుణ్ తండ్రి జీవితంలో ఎన్నో వాహనాలు వినియోగించినా చివరికి పద్మిని మరియు చేతక్ మిగిలిపోయాయి. కానీ అరుణ్ తండ్రి బుల్లెట్‌ను మిస్సవుతూనే ఉన్నారు.
అయితే మళ్లీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను కొనుగోలు చేయాలని అరుణ్ ప్రయత్నించారు. కానీ ధర ఎక్కువగా ఉండటంతో బైక్ గురించి అడగడానికి తన పాత సహోద్యోగిని పిలవమని తండ్రిని కోరారు. అయితే అతనిని కలిసిన తర్వాత 1996లోనే అతని ఇంట్లో ఆ బైక్ చోరీకి గురైందని తెలిసింది. ఆ బైక్‌కు ఆర్‌సీ బుక్ కూడా లేదని తెలిసింది.

దీంతో అరుణ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌పై ఆశలు కోల్పోయాడు. అయితే 2021లో, అరుణ్ బుల్లెట్ కోసం వెతుకుతున్నప్పుడు, అదే మోటార్‌సైకిల్ యొక్క బీమా ఇటీవల పునరుద్ధరించబడిందని ఆర్టీవో ద్వారా అతనికి తెలిసింది. మైసూరు సమీపంలోని మాండ్యాకు చెందిన వ్యక్తి పేరుపై బైక్ రిజిస్టర్ అయిందని తెలిసింది.
ఇది చూసిన తర్వాత, అతను ప్రస్తుత యజమాని గురించి పూర్తి వివరాలను పొందడానికి RTO ఏజెంట్‌ను సంప్రదించాడు. అందులో బీమా పాలసీ ID ఉంది. ఎట్టకేలకు యజమాని నంబర్‌ను సంపాదించి ప్రస్తుత యజమానిని సంప్రదించగా బుల్లెట్ అతని వద్ద ఉందని తెలిసింది.

దీంతో చోరీకి గురైన బైక్ 25 ఏళ్ల తర్వాత బయటపడింది. ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని హాసన్ పోలీస్ స్టేషన్‌లో పార్క్ చేసినట్లు ప్రస్తుత యజమాని తెలిపారు. 2015లో శాఖ ఈ వాహనాలన్నింటినీ వేలం వేయగా మైసూర్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.1800కు బుల్లెట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఆ వ్యక్తి ఈ మోటార్‌సైకిల్‌ను ప్రస్తుత యజమానికి విక్రయించాడు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ని తిరిగి కొనుగోలు చేసేందుకు అరుణ్ ఆసక్తి చూపడంతో, సమయం కోరగా వారం రోజుల్లోనే ప్రస్తుత యజమాని అంగీకరించారు. దీంతో తిరిగి తన తండ్రి ఫేవరెట్ బైక్‌ను అరుణ్ కొనుగోలు చేశారు. బైక్ కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో దానిని పునరుద్ధరించారు.

బైక్‌ను పాత బుల్లెట్ మోటార్‌సైకిళ్లను ప్రత్యేకంగా రూపొందించే వర్క్‌షాప్‌కు తీసుకెళ్లారు. ఈ పాత బైక్‌ని కొత్తగా చూపించడానికి దాదాపు వారం రోజులు పట్టింది. అధీకృత రాయల్ ఎన్‌ఫీల్డ్ సర్వీస్ సెంటర్‌లలో బైక్ కోసం విడిభాగాలను తీసుకుని ఒక వారం తరువాత, బైక్‌ను పూర్తిగా కొత్తగా తయారుచేసి అరుణ్ తన తండ్రికి ఇచ్చారు.



Click it and Unblock the Notifications








