వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి.. ఐదు నెలల్లో ఇది ఆరోసారి..
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. దశల వారీగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైళ్లను ప్రత్యక్ష్యంగా, వర్చువల్‌గా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు సేవలందిస్తున్నాయి.
అయితే ఇటీవల G20 డెలిగేట్స్ బృందం వందే భారత్ రైలులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. వందే భారత్ రైలులోని అధునాతన సౌకర్యాలు, బయో టాయిలెట్ వ్యవస్థను చూసి జీ 20 ప్రతినిధులు ఫిదా అయ్యారు. అయితే వందే భారత్ రైళ్లు ప్రశంసలతో పాటు విమర్శలూ ఎదుర్కొంటున్నాయి. గత కొద్ది కాలంగా ఈ రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. గతంలో ఈ ఘటనలపై కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీ - భోపాల్ మధ్య నడిచే వందే భారత్ రైలు సోమవారం మధ్యాహ్నం రాళ్ల దాడిలో దెబ్బతింది. కాగా ఐదు నెలల్లో నమోదైన ఆరో కేసు ఇది కావడం గమనార్హం.
ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మధుర జిల్లాలోని ఓఖ్లా స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. దాడిలో C-5, E-1 అనే రెండు కోచ్‌ల కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కు సమాచారం అందించారు.
దీనిపై ఆగ్రా రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) శ్రీవాస్తవ స్పందించారు. ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఆర్పీఎఫ్ కోసికలన్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగ్రా కాంట్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, పగిలిన అద్దానికి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు.
గత ఐదు నెలల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై దాడి చేయడంతో దెబ్బతిన్న 40 విండో మరియు డోర్ అద్దాలను మార్చారు. ఇక్కడ గమనార్హమైన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఢిల్లీ - ఆగ్రా మార్గంలో నడుస్తున్న ఈ రైలుపైనే రాళ్ల దాడి ఎక్కువగా జరగింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై గతంలో ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో C 12 కోచ్ ఎమర్జెన్సీ విండో ధ్వంసం అయ్యింది. రైలు విశాఖ చేరుకున్న తర్వాత సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టి విండోను మార్చారు.
కొద్ది రోజుల క్రితం కేరళలోని కోజికోడ్ జిల్లాలోని వటకర వద్ద వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దాడిలో ఈ రైలు C-8 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
అంతకు ముందు కన్నూర్ జిల్లాలో మంగళూరు-చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, నేత్రావతి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఏసీ కోచ్‌ల కిటికీ అద్దాలు డ్యామేజ్ అయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కూడా రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా కర్నాటకలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి కేసు కూడా నమోదైంది. జూన్ 27న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన కొద్ది రోజులకే ధార్వాడ్- బెంగళూరు వందే భారత్ రైలుపై ధవనగిరి స్టేషన్ సమీపంలో రాళ్ల దాడి జరిగింది. దీంతో C-4 కిటికీ దెబ్బతింది. ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దేశంలోని రైల్వే రంగంలో ఒక విప్లవాత్మక అడుగు.. ఇవి సాధారణ రైలు కంటే కూడా గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తాయి. ఇంకా గంట ముందుగా గమ్యాన్ని చేరుకుంటాయి. వందే భారత్ రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, పూర్తి AC సిస్టమ్‌తో ప్రీమియం రైలుగా గుర్తింపు పొందింది. అయితే ఈ తరహా రాళ్ల దాడి కేసులు పదే పదే నమోదవుతుండటంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications








