సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు చేయి ఊపిన రజినీ కాంత్.. ఇలా చేయడం కరెక్టేనా?
భారత్‌లో సన్‌రూఫ్‌తో కూడిన కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. గతంలో లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమైన సన్‌రూఫ్ టెక్నాలజీ.. ఇప్పుడు సాధారణ కార్లలోనూ ఓ ముఖ్యమైన ఫీచర్‌గా మారింది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తన కారు సన్‌రూఫ్ నుంచి అభిమానులకు అభివాదం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ తన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారులో ప్రయాణిస్తూ.. కారు సన్‌రూఫ్‌ను తెరిచారు. పోలీస్ కాన్వాయ్‌తో వస్తున్న రజినీ.. సన్‌రూఫ్‌లో నుంచి బయట గుమిగూడిన అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. దీనిని పలువురు వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా సన్‌రూఫ్ ద్వారా చేతులు ఊపడం కేవలం సూపర్ స్టార్ రజనీ కాంత్ మాత్రమే కాదు.. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఇటీవల ఇలా ప్రవర్తించడం మనం చూశాం. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం కొన్ని కార్యక్రమాల్లో రోడ్ షో సందర్భంలో ఈ విధంగా సన్‌రూఫ్ ద్వారా బయటకు వచ్చి ప్రజలను పలకరించారు.
సెలబ్రిటీలు ఇలా చేయడం అభిమానులకు ఆనందం కలిగించినప్పటికీ.. ఇందులో పెద్ద ప్రమాదం ఉంది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని సాధారణ ప్రజలు కూడా సన్‌రూఫ్ తెరిచి, దాని ద్వారా బయటకు వచ్చి వింత చర్యలకు పాల్పడుతున్నారు. అది కూడా వేగంగా వెళ్తున్న కారులో ప్రయాణిస్తూ ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రమాదం వాటిల్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది.
గతంలో కేవలం లగ్జరీ కార్లలో మాత్రమే సన్‌రూఫ్ ఫీచర్లు ఉండేవి. ఆ తర్వాత సాధారణ కార్లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. సన్‌రూఫ్ ద్వారా కారు లోపల ఎక్కువ వెలుతురు ప్రవహించేలా చేస్తుంది. అంతే కాకుండా బయటి వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా వీక్షించవచ్చు. కానీ కార్లలో సన్‌రూఫ్‌ను ఎలా ఉపయోగించాలనేది అనేది ఇక్కడ చాలా ముఖ్యం.
కాగా వాహనదారులకు తమ కార్లలో ఇష్టమైన ఫీచర్లలో సన్‌రూఫ్ ఒకటని పలు సర్వేలు వెల్లడించాయి. కానీ సన్‌రూఫ్‌ను కార్లలో ఎందుకు పొందుపరిచారో అందుకు మాత్రం వాహనదారులు ఉపయోగించడం లేదు. వెంటిలేషన్, స్వచ్ఛమైన గాలి సరఫరా కోసం కార్లలో సన్‌రూఫ్ ఫీచర్‌ను తీసుకువచ్చారు. కానీ కదులుతున్న వాహనంలో సన్‌రూఫ్ ద్వారా బయటకు చూడటం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.
సన్‌రూఫ్‌ను తెరిచి కారును వేగంగా నడుపుతున్నప్పుడు గాలి వేగంగా లోపలికి వస్తుంది. దీంతో మీరు బయటకి చూస్తున్నప్పుడు దుమ్ము, క్రిములు మీ కళ్ళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇది చిన్న పిల్లలకు చాలా ప్రమాదకరం. అంతే కాకుండా కారు సడెన్ బ్రేకులు వేసినప్పుడు ముందుకు పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అంతేకాకుండా సన్‌రూఫ్ ద్వారా బయటకు చూస్తున్నప్పుడు విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ఇటువంటి ప్రమాదాలను నివారించేందుకు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. పబ్లిక్ రోడ్లపై సన్‌రూఫ్‌ను తెరిచి అందులో నుంచి బయటకు చూస్తూ ప్రయాణించడం ద్వారా ఇతరులూ మిమ్మల్ని అనుసరించే అవకాశం ఉంది. సన్‌రూఫ్‌లను బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. అప్పుడే వాహనంలోని ప్రయాణికుల క్షేమానికి భంగం వాటిల్లకుండా ఆహ్లాదకర ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.


Click it and Unblock the Notifications








