కండక్టర్‌గా పనిచేసిన బస్ డిపోలో రజినీ కాంత్.. తలైవా సింప్లిసిటీకి ఫిదా అయిన సిబ్బంది..
సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం ఆయనను చూసే నేర్చుకోవాలి. ఆయన సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా ఎదిగినా తన మూలాలను ఎక్కడా మరిచిపోలేదు. కండక్టర్‌గా మొదలైన తన జీవిత ప్రస్థానం సినిమాల్లో సూపర్ స్టార్‌గా నిర్విఘ్నంగా కొనసాగుతోంది.
ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమా 'జైలర్' సూపర్ సక్సెస్ కావడంతో ఆయన ఫుల్ ఖుష్‌లో ఉన్నారు. ఈ సినిమా 600 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ స్టడీగా వసూళ్లను రాబడుతోంది.

అయితే తలైవా ఈరోజు బెంగళూరులోని జయనగర్ 4వ డిపోను ఆకస్మికంగా సందర్శించి సిబ్బందిని ఆశ్చర్యపరిచారు. రజినీకాంత్ తాను పనిచేసిన బెంగళూరు జయనగర్‌లోని డిపోను తన మిత్రుడు రాజ్ బహదూర్‌తో కలిసి సందర్శించారు. జయనగర్ బీఎంటీసీ 4వ డిపోకు ఉదయం 11.30 గంటలకు సాధారణ వ్యక్తిలా ఆయన చేరుకున్నారు. 11.45 వరకు డిపోలోని సిబ్బందితో మాట్లాడుతూ గడిపారు.
రజినీ ఆకస్మిక రాకతో అక్కడి స్టాఫ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తలైవాతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. సిబ్బందితో కొద్దిసేపు ఫొటోలు దిగిన అనంతరం తలైవా డిపో అంతా ఒక రౌండ్ వేసి అక్కడ పనితీరును తెలుసుకున్నట్లు సమాచారం. డిపోలోని సభ్యులు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వారితో ముచ్చటించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. అక్కడ ఆయన పర్యటన ఉద్దేశ్యం గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సహా అక్కడ పనిచేసిన వాళ్లు రజినీకాంత్ ఒకపుడు తాను పనిచేసిన డిపోను సందర్శిస్తారని తాము అనుకోలేదన్నారు. ఏది ఏమైనా రజినీ సింప్లిసిటీకి ఇది నిదర్శనమని.. తలైవాను రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే రజనీకాంత్ ఎవరికీ తెలియకుండా బెంగుళూరు వస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అలాగే ఉండవచ్చని వారు అంటున్నారు. గతంలో బీఎంటీసీ ట్రాన్స్‌పోర్ట్‌లో రజినీ కండక్టర్‌గా పనిచేశారు. ఆయన సాధారణ జీవనశైలి నేడు ఆయనకు భాషతో సంబంధం లేకుండా భారతదేశం అంతటా అభిమానులను సంపాదించింది.

భారతదేశపు అత్యున్నత చలనచిత్ర పురస్కారం, ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత, రజనీకాంత్ తన ప్రసంగంలో బెంగళూరులోని తన స్నేహితుడిని గుర్తు చేసుకున్నారు. బెంగళూరులో బస్సు డ్రైవర్ మరియు సహోద్యోగి అయిన తన స్నేహితుడు రాజ్ బహదూర్ తాను బస్ కండక్టర్‌గా ఉన్నప్పుడు తన నటనా ప్రతిభను గుర్తించి చిత్ర పరిశ్రమలో చేరడానికి తనను ప్రోత్సహించినట్లు తెలిపారు.
76 ఏళ్ల రిటైర్డ్ బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) డ్రైవర్ మరియు చామరాజ్‌పేట నివాసి, పి. రాజ్ బహుదూర్ తొలినాళ్లలో రజనీకాంత్‌ను గుర్తించి, చిత్ర పరిశ్రమలోకి రావడానికి ప్రోత్సహించారు. రాజ్ బహుదూర్ బీఎంటీసీలో పనిచేస్తుండగా, రజనీకాంత్ అదే బస్సులో కండక్టర్‌గా పనిచేశారు.

డిపోలో సందర్శన అనంతరం రజినీకాంత్ అక్కడ డ్యూటీలో ఉన్న వాళ్లకు అభివాదం చేసి వెళ్లిపోయారు. 1970 మొదట్లో రజినీకాంత్ .. తన మిత్రుడు రాజ్ బహదూర్‌తో కలిసి ఈ డిపోలో పనిచేశారు. ఆ తర్వాత డైరెక్టర్ బాలచందర్ దృష్టిలో పడి నటుడు అయ్యారు. ఆపై తన కష్టంతో సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఇక రజినీకాంత్‌తో పనిచేసిన వాళ్లు ఎపుడో రిటైర్ అయ్యారు.

ఇప్పుడు కూడా రజినీ తన పాత రోజులను గుర్తుచేసుకోవడానికి డిపోను సందర్శించి ఉండవచ్చు. రజనీకాంత్‌ను చూసి జయనగర్ డిపో సిబ్బంది చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే సిబ్బందితో కలిసి కెమెరాకు ఫోజులిచ్చారు. ఇద్దరూ డిపోలోని తమ స్నేహితులు, సిబ్బందితో కాసేపు గడిపారు. రజనీకాంత్ గాంధీ బజార్‌లోని విద్యార్థి భవన్ మరియు రాఘవేంద్ర స్వామి మఠాన్ని కూడా సందర్శించారు. రజినీ బెంగళూరులో తన చిన్ననాటి జీవితాన్ని గడిపారు.


Click it and Unblock the Notifications








