భారతదేశపు తొలి ఫ్లయింగ్ టాక్సీ e200.. మీ ఇంటి మిద్దె మీదనే ల్యాండింగ్ మరియు టేకాఫ్..!!
పెరుగుతున్న వాహనాల కొనుగోళ్లతో రోడ్లపై రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ వాహనంతో ఉన్న చోటు నుండే టక్కున గాల్లోకి ఎగిరిపోతే ఎలా ఉంటుంది. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ, మనం మాత్రం ఇలాంటి పరిస్థితిని చూసే సమయం మరెంతో దూరం లేదనిపిస్తోంది. ఇప్పుడు, ప్రపంచంలోని కొన్ని కంపెనీలు ఎగిరే కార్లపై పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసినదే. కొన్ని కంపెనీలైతే ప్రోటోటైప్‌లను కూడా తయారు చేసి, తమ ఫ్యూచర్ మోడళ్ల ప్రొడక్షన్ కోసం ఆర్డర్లను కూడా స్వీకరిస్తున్నాయి.

మరి మన భారతదేశంలో ఫ్లయింగ్ కార్లను తయారు చేసే సత్తా ఎవ్వరికీ లేదా అంటే, మేమున్నాం అంటూ ముందుకు వచ్చింది తమిళనాడుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈప్లేన్ (ePlane). కేవలం కాన్సెప్ట్ ఫ్లయింగ్ కార్లను తయారు చేయడం మాత్రమే కాదు, వచ్చే ఏడాది కమర్షియల్ ఫ్లయింగ్ ట్యాక్సీని కూడా ప్రజల వినియోగార్థం ప్రారంభించాలని ఈప్లేన్ యోచిస్తోంది. కంపెనీ ప్రస్తుతం తన మొదటి ఫ్లయింగ్ టాక్సీ ప్రోటోటైప్ మోడల్, ఈ200 (E200)ని సిద్ధం చేస్తోంది.

ఈప్లేన్ ఈ200 ఫ్లయింగ్ టాక్సీ 2024 సంవత్సరం నాటికి విక్రయించబడుతుందని భావిస్తున్నారు. ఇదొక (e200) ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు. ఇది గాలిలో విమానంగా మరియు నేలపై కారుగా ప్రయాణించగలదు. ఇది పూర్తి ఛార్జింగ్‌తో 200 కిమీల రేంజ్‌ను అందిస్తుందని సమాచారం. ఇదొక టూ-సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీగా ఉంటుంది. ఇది సుమారు 200 కిలోల వరకూ బరువును గాలిలో ఎగిరించగలదు.

ఈప్లేన్ ఈ200 క్వాడ్‌కాప్ట్ లేదా డ్రోన్ మాదిరిగా నాలుగు ప్రొపెళ్లర్లను కలిగి ఉంటుంది. కాబట్టి, ఇది నిఠారుగా ఉన్న చోటు నుండే గాలిలోకి ఎగురగలదు మరియు నిటారుగా గాలిలోకి ల్యాండ్ కాగలదు. దీని డిజైన్ కూడా చాలా కాంపాక్ట్ గా ఉంటుంది కాబట్టి టేకాఫ్ మరియు ల్యాండిగ్ కోసం ఎక్కువ సమయం కూడా పట్టదు. ఈ ఎగిరే క్యాబ్‌లో నాలుగు ఫ్యాన్‌లు (ప్రొపెల్లర్లు) ఉంటాయి, వీటిలో రెండు టేకాఫ్ మరియు ల్యాండింగ్‌లో సహాయపడతాయి, మిగిలిన రెండు ఈ విమానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తాయి.

ఈ ఫ్లయింగ్ టాక్సీని కూడా వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా కారును ఇంటి వద్దనే ఛార్జ్ చేసినట్లుగా చార్జ్ చేయవచ్చు. ఈ టాక్సీలో నార్మల్ చార్జింగ్ తో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కంపెనీ అందించనుంది. ఈ ఫ్లయింగ్ టాక్సీలో ప్యాసింజర్ మరియు కార్గో వేరియంట్‌లను కంపెనీ త్వరలో భారతదేశంలో విడుదల చేయాలని చూస్తోంది. సమాచారం ప్రకారం, కంపెనీ డిసెంబర్ 2022లో e200 కార్గో కోసం ఓ ధృవీకరణ లేఖను కూడా పొందే అవకాశం ఉంది.
కాగా, 2024 సెప్టెంబర్‌లో ప్రయాణికుల కోసం టాక్సీ సేవ ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. కంపెనీ 2025 నాటికి యూఎస్ ప్రభుత్వం యొక్క ఫెడరల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ నుండి కూడా ధృవీకరణను పొందుతుంది. ప్రస్తుతం, ఈప్లేన్ కంపెనీ e200ని అసెంబ్లింగ్ చేస్తోంది. దాని డిజైన్ కూడా తుది దశలో ఉంది మరియు ePlane కంపెనీ త్వరలో దానిని అధికారికంగా నిర్మించడం ప్రారంభించనుంది. ఈప్లేన్ కంపెనీని IIT మద్రాస్‌కి చెందిన ప్రొఫెసర్ సత్య చక్రవర్తి మరియు IIT మద్రాస్ పూర్వ విద్యార్థి ప్రాంజల్ మెహతా కలిసి స్థాపించారు.

ఇంటి పైకప్పు నుండి సులువుగా టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేయగల సామర్థ్యం ఉన్న అత్యంత కాంపాక్ట్ మరియు తేలికైన ఎగిరే ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయాలనుకుంటున్నట్లు సత్య చక్రవర్తి చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ200ని రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓ నివేదిక ప్రకారం, ePlane కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో స్పెషలే ఇన్వెస్ట్ మరియు మిసెలియో నేతృత్వంలోని ప్రాజెక్ట్ కోసం సుమారు 5 మిలియన డాలర్ల పెట్టుబడిని పొందింది.

ఈ స్టార్టప్ ఈ60 (e6) అనే ఓ కాంపాక్ట్ వెర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ఎలక్ట్రిక్ (eTOL) విమానాన్ని కూడా అభివృద్ధి చేసింది. ఇది ఒకేసారి 6 కిలోల పేలోడ్‌ను మోయగలదు. చిన్నపాటి కార్గో అవసరాల కోసం తయారు చేసిన ఈ మినీ ప్లేన్ పూర్తి చార్జ్ పై ది 80 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. ఇవే కాకుండా, ePlane కంపెనీ ఈ50 (e50) అనే మరొక ప్రోటోటైప్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది, ఇది 50 కిలోల పేలోడ్‌ను మోయగలదు మరియు ఇది 2023 నాటికి వాణిజ్య ఉపయోగం కోసం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

ఫ్లయింగ్ కార్స్ మరియు ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీల వంటి వాహనాలపై నేడు అనేక దేశాల్లోని సంస్థలు పరిశోధనలు మరియు అభివృద్ధి చేస్తున్నాయి. గత సంవత్సరం, eVTOL అనే సంస్థ తన ఫ్లయింగ్ టాక్సీకి ధృవీకరణ పొందింది. ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీలు రద్దీగా ఉండే నగర ట్రాఫిక్ నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా నగరాల్లో కాలుష్యాన్ని కూడా తగ్గించడంలో కూడా సహాయపడతాయి మరియు గమ్యాలను త్వరగా చేరుకునేందుకు సహకరిస్తాయి. హాస్పిటల్ రంగంలో క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications