రతన్ టాటా కోసం ప్రత్యేకమైన టాటా నానో ఎలక్ట్రిక్ కారు.. పూర్తి చార్జ్ పై 160 కిలోమీటర్ల రేంజ్!
ఇటీవలి కాలంలో భారతదేశంలోని కొనుగోలుదారులలో ఎలక్ట్రిక్ వాహనాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి మరియు ప్రస్తుతం ఈ విభాగంలో టాటా మోటార్స్ (Tata Motors) ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా కొనసాగుతోంది. అంతేకాకుండా, దేశంలో చవకైన ఎలక్ట్రిక్ కార్లను మరియు అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న కంపెనీగా టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం, టాటా మోటార్స్ రెండు ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తోంది. వాటిలో టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) మరియు టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)లు ఉన్నాయి.

టాటా మోటార్స్ తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనాల కోసం పవర్‌ట్రెయిన్ సొల్యూషన్స్ అందించడంలో ఎలక్ట్రా ఈవీ (Electra EV) సంస్థ అగ్రగామిగా ఉంది. ఇప్పుడు ఈ సంస్థ, టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా (Ratan Tata) కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ కస్టమైజ్డ్ టాటా నానో ఎలక్ట్రిక్ కారు (Tata Nano ELectric Car) ను తయారు చేసి, ఆయనకు కానుకగా ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఓ తెల్లటి టాటా నానో ఎలక్ట్రిక్ కారు పక్కన రతన్ టాటా నిలుచొని కనిపిస్తారు.

లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో షేర్ చేసిన సందేశం ప్రకారం, "మా వ్యవస్థాపకులు ఎలక్ట్రా ఈవీ పవర్‌ట్రెయిన్ యొక్క ఇంజనీరింగ్ శక్తితో నడిచే అనుకూల-నిర్మిత 72V నానో ఈవీలో ప్రయాణించడం అనేది టీమ్ ఎలెక్ట్రా ఈవీకి ఓ నిజమైన క్షణం!", "మిస్టర్ టాటాకు నానో ఈవీని అందజేయడం మరియు అతని అమూల్యమైన ఫీడ్‌బ్యాక్ నుండి అంతర్దృష్టులను పొందడం మాకు చాలా గర్వంగా ఉంది" అని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ఫోటోలో, నానో కారు పక్కన రతన్ టాటా గారితో పాటుగా అతని 28 ఏళ్ల అసిస్టెంట్ శంతను నాయుడు కూడా కనిపిస్తారు. రతన్ టాటా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కస్టమ్-బిల్ట్ టాటా నానో ఎలక్ట్రిక్ కారులో ఎలక్ట్రా వీ సంస్థ 72V పవర్‌ట్రైన్ ని ఉపయోగించింది. ఈ నిర్మాణం ఎలక్ట్రా EVకి టిగోర్ EV (టాక్సీ వేరియంట్) యొక్క మునుపటి 140 కి.మీలను 200 కి.మీ లకు పైగా విస్తరించడానికి మరియు డ్రైవింగ్ రేంజ్ ను పెంచడానికి డిజైన్‌ను సవరించడంలో సహాయపడింది.

టాటా టిగోర్ యొక్క టాక్సీ వేరియంట్ అయిన టాటా ఎక్స్‌ప్రెస్-టి ఈవీ (Xpress T EV) వెర్షన్ యొక్క రేంజ్ ను పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పు లేకుండా 213 కిమీలకు పెంచబడింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్ చూడటానికి అచ్చం పెట్రోల్‌తో నడిచే నానో మాదిరిగానే కనిపిస్తుంది. ఇదొక 4-డోర్, 4-సీటర్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్. ఈ ఎలక్ట్రిక్ కారులో సూపర్ పాలిమర్ లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఫలితంగా, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 160 కి.మీల డ్రైవింగ్ రేంజ్ ను అందిస్తుంది.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టాటా నానో ఎలక్ట్రిక్ కారు కేవలం 10 సెకన్లలోనే గంటకు 0-60 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. లక్షల రూపాయల కారుగా, మధ్య తరగతి ప్రజల కలల కారుగా అప్పట్లో సంచలనం సృష్టించి, కొన్ని అనివార్య కారణాల వలన మార్కెట్ కు దూరమైన టాటా నానో కారు, ఇప్పుడు మరింత పర్యావరణ సాన్నిహిత్యమైన ఎలక్ట్రిక్ కారు రూపంలో తిరిగి వస్తే, ఇది పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని, ఓ ఆదర్శవంతమైన సిటీ కారుగా నిరూపించబడుతుందని భావిస్తున్నారు.

టాటా నానో వాస్తవానికి రతన్ టాటా యొక్క ఆలోచన మరియు దేశంలోని ప్రజలందరికీ కారును అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ కారు విడుదల సమయంలో ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా ఇది చరిత్ర సృష్టించింది.

అయితే, పశ్చిమ బెంగాల్ లో జరిగిన గొడవల కారణంగా, టాటా నానో ప్లాంట్ ను గుజరాత్ కి మార్చడంలో ఈ కారు తయారీ ఖర్చు భారీగా పెరిగిపోయింది. అయినప్పటికీ, టాటా మోటార్స్ మొదటి లక్ష కస్టమర్లకు ఈ కారును లక్ష రూపాయలకే విక్రయించింది.

అయితే, ఆ తర్వాతి కాలంలో టాటా నానో మార్కెటింగ్‌తో సహా వివిధ కారణాల వల్ల, ఈ కారు మార్కెట్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది. నిజానికి ఇదొక గొప్ప సిటీ కారు, రద్దీగా ఉండే మనలాంటి దేశాలకు చాలా అనుకూలమైన కారు.

మనదేశంలో ఈ కారు నేటికీ చాలా మందికి విలాసవంతమైనదిగా పరిగణించబడుతుంది. కానీ, 'ప్రపంచంలో అత్యంత చౌకైన కారు'గా విక్రయించబడిన కారు కొంతమంది కొనుగోలుదారుల్లో మంచి అభిప్రాయాన్ని కలిగించలేకపోయింది.

అయితే, టాటా నానో కారును ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడం ఇదేం మొదటిసారి కాదు. గత కొన్ని సంవత్సరాల క్రితం, ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన ఓలా సంస్థ కూడా టాటా నానో యొక్క బ్యాటరీతో పవర్డ్ వేరియంట్‌ను అభివృద్ధి చేసింది.

కోయంబత్తూరుకు చెందిన జయం ఆటోమోటివ్స్‌తో కలిసి పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్ నానోలు తయారు చేయబడ్డాయి. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి దశకు చేరుకోలేకపోయింది. కాగా, ఇప్పుడు ఎలక్ట్రా ఈవీ ద్వారా వచ్చిన ఈ టాటా నానో ఈవీ నగరంలో రోజువారీ డ్రైవ్ కోసం ఓ చక్కటి ఆప్షన్ గా ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








