సింగూర్ వివాదంలో టాటా విజయం.. రూ. 766 కోట్లు పరిహారం చెల్లించాలని దీదీ సర్కారుకు ఆదేశాలు
పశ్చిమ బెంగాల్ సర్కార్‌పై ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ విజయం సాధించింది. సింగూర్‌లో స్థాపించాలనుకున్న టాటా నానో కార్ ప్రాజెక్ట్‌ను మమత ప్రభుత్వం రద్దు చేయడం వల్ల కలిగిన నష్టాలకు టాటా మోటార్స్ ఇప్పుడు రూ. 766 కోట్ల భారీ పరిహారం అందుకోనుంది.
సింగూర్ నానో ప్లాంట్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి త్రిసభ్య ధర్మాసనం నుంచి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టాటా మోటార్స్ తన వాదనను గెలుచుకుంది. సింగూర్‌లో నానో కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు టాటా మోటార్స్ రూ. 1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.

కాగా దీనిపై అప్పటి పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ నిరవధిక దీక్ష కారణంగా నానో కార్ ప్రాజెక్ట్‌ను టాటా మోటార్స్ నిలిపివేయవలసి వచ్చింది. దీంతో భారీగా పెట్టుబడులు పెట్టిన టాటా కంపెనీకి భారీ నష్టం వాటిల్లింది. అనంతరం టాటా మోటార్స్ ఈ ప్లాంట్‌ను గుజరాత్‌కు మార్చింది.
కానీ సింగూర్‌లో పెట్టిన పెట్టుబడుల కారణంగా భారీ నష్టాలు రావడంతో ఆ నష్టాన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వమే భర్తీ చేయాలని త్రిసభ్య కమిటీ ధర్మాసనంలో టాటా మోటార్స్ కేసు వేసింది. ఈ కేసులో సోమవారం తీర్పు వెలువడింది. టాటా మోటార్స్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.
పశ్చిమ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (WBDIC) పరిహారం చెల్లించాలని ముగ్గురు సభ్యులతో ఏర్పడిన మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఆదేశించి.. ఈ విచారణకు ముగింపు పలికింది. పెట్టిన పెట్టుబడికి 11 శాతం వార్షిక వడ్డీతో పాటు రూ. 765.78 కోట్ల మొత్తాన్ని రికవరీ చేసుకునే అర్హత టాటా మోటార్స్‌కు ఉంది. అయితే ఇప్పుడు ఈ వడ్డీ సెప్టెంబరు 1, 2016 నుంచి పరిహారం చెల్లించే తేదీ వరకు లెక్కిస్తారు.
2008 అక్డోబర్‌లో, తృణమూల్ కాంగ్రెస్ నిరసనల కారణంగా టాటా మోటార్స్ తన నానో కార్ల ఉత్పత్తి ప్రాజెక్టును సింగూర్ నుంచి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ఆ రాష్ట్రంలోని సనంద్‌కు మార్చింది. కాగా సింగూర్‌లో వచ్చిన ఈ నష్టాన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వమే భరించాలంటూ టాటా మోటార్స్ న్యాయ పోరాటం చేసింది.
దేశంలోని మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ బడ్జెట్‌లో అంటే కేవలం రూ. లక్ష ప్రారంభ ధరతో నానో కార్లను టాటా మోటార్స్ పరిచయం చేసింది. అయితే ఈ కార్లకు డిమాండ్ పడిపోవడంతో 2019లో నానో ఉత్పత్తిని టాటా మోటార్స్ నిలిపివేసింది. అయితే భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రలో ఈ కారు ప్రత్యేక ఉనికిని కలిగి ఉంది.
కాగా గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో ప్రస్తుతం టాటా హ్యాచ్‌బ్యాక్ కార్లను తయారు చేస్తోంది. 2020 నుంచి నానో కార్ల సేల్స్ ఆగిపోయాయి. కాగా సింగూర్‌లో టాటా నానో కార్స్ ప్లాంట్ కోసం దాదాపు 13 వేల మంది రైతుల నుంచి 1000 ఎకరాల భూమిని సేకరించారు. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక ఈ మొత్తం భూమిని తిరిగి రైతులకు ఇచ్చేయాలని ఆమె నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








