దేశవ్యాప్తంగా త్వరలో 500 EV ఛార్జింగ్ స్టేషన్లు.. ఒప్పందం కుదుర్చుకున్న టాటా పవర్, ఐఓసీఎల్
దేశవ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ వాహనాల(EVs) ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్‌నకు చెందిన టాటా పవర్ ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) తో అవగాహన ఒప్పందం(MOU) కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు ఓ కారణమైతే.. ఈవీల మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉండటంతో ఎలక్ట్రిక్ కార్లు, టూ వీలర్ల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. కానీ వీటిలో ఛార్జింగ్ ప్రధాన సమస్యగా మారుతోంది. లాంగ్ జర్నీలు చేసినప్పుడు వాహనదారులు ఛార్జింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు అవి సరిపోవడం లేదు. దీంతో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టాటా పవర్ ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్(Tata Power EV Charging Solutions), IOCL కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా 500 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు అహగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(Indian Oil Corporation Limited) లిమిటెడ్ అనేక రకాల ఫ్యూయెల్ బంకులను కలిగి ఉంది. ఇండియన్ ఆయిల్ తన కీలకమైన ఆయిల్ అవుట్‌లెట్లలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి టాటా పవర్ EV సొల్యూషన్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ కూటమి ద్వారా త్వరలో దేశంలో 500 ఈవీ ఛార్జింగ్‌లు ఏర్పాటు కానున్నాయి.
కొత్తగా ఏర్పాటయ్యే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో.. ఫాస్ట్ మరియు అల్ట్రా ఫాస్ట్ EV ఛార్జింగ్ కేంద్రాలను టాటా పవర్ అభివృద్ధి చేయనుంది. మొదటగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెస్తామని ఇండియన్ ఆయిల్ సంస్థ తెలిపింది. క్రమక్రమంగా వీటిని విస్తరించనున్నారు.
మొదటి దశలో ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పూణె, కొచ్చితో సహా ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్‌వే, సేలం-కొచ్చి, చెన్నై-గుండూరు హైవేలు వంటి ప్రధాన జాతీయ రహదారులపై వీటిని నెలకొల్పనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల యజమానుల కోసం టాటా పవర్ గ్రూప్, ఇండియన్ ఆయిల్ సంస్థ తీసుకున్న నిజంగా వారికి చాలా దోహదపడుతుంది.
కాగా చమురు కంపెనీలతో టాటా పొత్తు పెట్టుకోవడం ఇది తొలిసారి కాదు. ఇటీవలే టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా 7,000కు పైగా భారత్ పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేశాయి.
కాలుష్య రహిత సమాజం కోసం ఆటో కంపెనీలతో పాటు సంబంధిత సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు చొరవ తీసుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు సరికొత్త డిజైన్లతో ఆటో కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి.
కాగా టాటా పవర్-పీబీసీఎల్ ఒప్పందం, టాటా పవర్-ఇండియన్ ఆయిల్ మధ్య ఒప్పందం.. దేశాన్ని విద్యుదీకరణ దిశగా నడిపించడంలో దోహదపడతాయి. అయితే చాలా కంపెనీలు కూడా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రాథమిక సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుండటం అభినందనీయం. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు త్వరితగతిన ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి వచ్చినట్లయితే వాహనదారులకు ప్రధాన సమస్య తీరుతుంది.


Click it and Unblock the Notifications








