జనవరి 22 టాటా టి1 - ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్
దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్ భారత్‌కు ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను పరిచయం చేయనున్నట్లు గడచిన నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కంపెనీ ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఈ నెల 22న భారతదేశపు మొట్టమొదటి 'టి1 - ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్'ను ప్రకటింటనున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. టాటా మోటార్స్ ఈ మేరకు మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలను పంపించింది.
భారతదేశంలో ఇప్పటి వరకు పలు రకాల మోటార్‌స్పోర్ట్ కార్యక్రమాలు జరిగాయి కానీ, ఇంత వరకు ఇలాంటి ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ గతంలో ఎన్నడూ జరగలేదు. ఇలాంటి భారీ వాహనాలను సైతం హ్యాండిల్ చేయగలిన రేస్ ట్రాక్ బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (ఇదే ట్రాక్‌పై ఫార్ములా వన్‌తో వివిధ మోటార్‌స్పోర్ట్ కార్యక్రమాలు జరుగుతుంటాయి)పై టాటా మోటార్స్ ద్వారా నిర్వహించబడే ట్రక్ రేసింగ్ జరగవచ్చని ఫెడరేషన్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎమ్ఎస్‌సిఐ) అధ్యక్షుడు వికీ ఛాంధోక్ తెలిపారు.

టాటా మోటార్స్ తమ టి1 - ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ కోసం దాదాపు ఏడాదిన్నరగా సన్నాహాలు చేస్తుంది. టాటా ఇప్పటికే 12 ప్రైమా బ్రాండ్ హెవీ ట్రక్కులను మోడిఫై చేసి, జంషడ్‌పూర్ ప్రాంతంలో టెస్టింగ్ చేస్తోంది. ట్రక్ రేసింగ్ ప్రారంభ సంవత్సరంలో భాగంగా, టాటా మోటార్స్ సింగిల్ రౌండ్‌ను మాత్రమే నిర్వహించాలని యోచిస్తోంది. ఆ తర్వాత దీనికి లభించే స్పందనను బట్టి మల్టీ-బిల్డ్ సిరీస్‌గా మార్చే అవకాశం ఉంటుంది. ఈ రేస్‌లో 12 ట్రక్కులను ఉపయోగిస్తారు.
దేశ విదేశాలకు చెందిన డ్రైవర్లు ఈ ట్రక్ రేసింగ్‌లో పాల్గొంటారు. ఈ ట్రక్కులు సాధారణ ట్రక్కుల మాదిరి కాకుండా, రేస్‌కు అనుగుణంగా ఫుల్ రోల్ కేజ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, రేస్ స్పెసిఫిక్ ఫ్యూయెల్ ట్యాంక్, బ్రేక్ కూలర్స్, బకెట్ సీట్స్ మొదలైన మోడిఫికేన్లతో ఉంటాయి. రేసింగ్ ట్రక్కులు ఎల్లప్పుడూ ఆరు చక్రాలను కలిగి ఉండి, వెనుక వైపు లోడ్ క్యారీయింగ్ ట్రైలర్లను తొలగించబడి ఉంటాయి. యూరప్ దేశాల్లో ఇప్పటికే ట్రక్ రేసింగ్ ఓ మేజర్ అట్రాక్షన్‌గా ఉంటుంది. మరిన్ని వివరాలు ఈనెల 22న వెల్లడయ్యే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








