గుర్రపు బండిని గుర్తించలేని టెస్లా ఆటోమేటిక్ కార్లు.. ఇలాంటివి మన రోడ్లపైకి వస్తే అంతే సంగతులు..!
ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు డ్రైవర్ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ గా వాహనాలు నడిచేలా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా ఇప్పటికే తమ కార్లలో అటానమస్ డ్రైవింగ్ లేదా ఆటో పైలట్ గా పిలువబడే సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని అందిస్తోంది.
Recommended Video
అయితే, ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ అన్ని సందర్భాల్లో పూర్తిస్థాయిలో పనిచేయదని మరోసారి నిరూపించబడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.

టెస్లా కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ వస్తాయని మనందరికీ తెలిసినదే. ఈ టెక్నాలజీలో కారు ముందు భాగంలో ఉండే 3డి సెన్సార్లు మరియు కెమెరాలు కారుకి ముందు మరియు సైడ్స్ లో ఉన్న వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని డ్యాష్‌బోర్డులో అమర్చిన స్క్రీన్ పై 3డి యానిమేషన్ రూపంలో తెలియజేస్తుంది. మన టెస్లా కారు ముందున్న వాహనం కారు అయితే, దానిని కారు బొమ్మగా, అదే ట్రక్కు అయితే ట్రక్కు బొమ్మగా లేదా మనిషి అయితే మనిషి బొమ్మగా 3డి యానిమేషన్ రూపంలో ప్రదర్శిస్తుంది.

ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఈ సెన్సార్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి ఓ సంఘటన గురించి ఈ కథనంలో చూద్దాం రండి. టెస్లా కారు ముందు ఓ గుర్రపు బండి నెమ్మదిగా వెళ్తోంది. అయితే, ఈ గుర్రపు బండిని గుర్తించడంలో టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ అన్నీ కూడా విఫలమయ్యాయి. టెస్లా ఈ గుర్రపు బండిని ఓసారి కారుగా, మరోసారి మనిషిగా, ఇంకోసారి ట్రక్కుగా గుర్తిస్తూ డ్రైవరును గందరగోళానికి గురిచేసింది.

సెల్ఫ్ డ్రైవింగ్ / ఆటో పైలట్ వంటి అత్యంత అధునాతన డ్రైవింగ్ టెక్నాలజీతో EV కార్ మార్కెట్లో టెస్లా ఇప్పటికే అగ్రగామిగా ఉంది. ఈ ఫంక్షన్ ఖచ్చితంగా ఫ్యూచరిస్టిక్ అయినప్పటికీ, ఇందులో కూడా లోపాలు ఉన్నాయని తాజా సంఘటన గుర్తు చేస్తోంది. అంటే, దీని అర్థం డ్రైవర్లు గుడ్డిగా ఇలాంటి అటానమస్ టెక్నాలజీలను ఉపయోగించి మోసపోకూడదు. టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్ గుర్రపు బండిని గుర్తించడంలో విఫలమైన విషయాన్ని ఓ యూజర్ వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు.
టెస్లా యొక్క ఏఐ సాఫ్ట్‌వేర్ ఈ గుర్రపు బండిని ఎలా గుర్తించలేకపోతుందో వీడియోలో చూపబడింది. ఈ గుర్రపు బండి వెనుక వైపు నుండి చతురస్రాకారంలో ఉండటంతో టెస్లా అటానమస్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్ దీనిని ట్రక్కుగా గుర్తించింది. అలాగే, ఓ సందర్భంలో ఎదురుగా వస్తున్న పొడవాటి ట్రక్కులా చూపబడింది. మరో సందర్భంలో ఎదురుగా వస్తున్న కారులా గుర్తించింది. ఈ గుర్రపు బండిపై ఇద్దరు వ్యక్తులు కూర్చుని ప్రయాణిస్తుంటారు. దీంతో వారు రోడ్డుపై నడుస్తున్నట్లు టెస్లా గుర్తించింది.

టెస్లా ఏఐ సాఫ్ట్‌వేర్ ఇలా గందరగోళానికి గురికావడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెస్లా అటానమస్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్ పూర్తిగా డ్రైవర్ రహితమైనది కాదు. నిర్ధిష్ట సమయం పాటు డ్రైవర్ స్టీరింగ్ మరియు యాక్సిలరేటర్ ఉపయోగించకుండా కారును ఆటోమేటిక్ గా నడిపేందుకు మాత్రమే ఇది అనుమతిస్తుంది. కాబట్టి, డ్రైవర్ సీటులో డ్రైవర్ ఎల్లప్పుడూ కూర్చుని ఉండటం చాలా అవసరం. కొంత సమయం ఆటోమేటిక్‌గా నడిపిన తర్వాత డ్రైవర్ నుండి ఎలాంటి ఇన్‌పుట్ (స్టీరింగ్ ను పట్టుకోవడం లేదా యాక్సిలరేటర్ నొక్కడం) లేనట్లు సాఫ్ట్‌వేర్ గుర్తిస్తే, కారు వేగం ఆటోమేటిక్ గా సున్నాకి చేరుకుని, ఆగిపోతుంది.

టెస్లా ఏఐ సాఫ్ట్‌వేర్ పట్టణ రహదారులు, సంక్లిష్ట కూడళ్లు మరియు ఫ్రీవేలను కూడా తెలివిగా నావిగేట్ చేయగలదు. అయితే, గుర్రపు బండిని గుర్తించడంలో విఫలమైన ఇలాంటి ఆటోమేటిక్ కార్లు రద్దీ ఎక్కువగా ఉండే మనలాంటి దేశాల్లో పూర్తిస్థాయిలో విజయవంతం కాలేవు. మనదేశపు రోడ్లు ఎద్దుల బండ్లు, సైకిల్ రిక్షాలు, ఆటోరిక్షాలు, రోడ్లపైనే నివసించే జంతువులు, రోడ్డుపై అడ్డదిడ్డంగా పరుగులు తీసే జనాలు ఇలా చాలా సందడిగా కనిపిస్తాయి. అలాంటి రోడ్లపై ఇలాంటి కన్ఫ్యూజ్డ్ ఆటోమేటిక్ కార్లు తిరిగినట్లయితే, నిత్యం ఏదో ఒక ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మీరేమంటారు..?

ఇదిలా ఉంటే, టెస్లా భారతదేశంలో తమ ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారం ప్రారంభించడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఇంపోర్టెడ్ కార్లపై దిగుమతి సుంకాలు తగ్గిస్తేనే భారతదేశంలోకి ప్రవేశిస్తామని టెస్లా చెబుతుంటే, భారత్‌లో నేరుగా టెస్లా కార్లను తయారు చేస్తేనే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. గతంలో ఈ విషయంపై టెస్లా బాస్ ఎలోన్ మస్క్ వ్యాఖ్యానిస్తూ.. "తాము కార్లు విక్రయించడానికి మరియు సర్వీస్ చేయడానికి అనుమతి లేని ఏ ప్రదేశంలోనైనా టెస్లా తమ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయదని" అన్నారు.


Click it and Unblock the Notifications








