భారత్‌కు టెస్లా..! 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందంటే?
ప్రధాని మోడీ తన అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య భారత్‌లో టెస్లా కార్యకలాపాలపై ప్రధానంగా చర్చ జరిగింది. భేటీ అనంతరం భారత్‌లో టెస్లా ఎంట్రీపై ఎలాన్ మస్క్ స్పష్టమైన ప్రకటన చేశారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా వచ్చే సంవత్సరం మస్క్ భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది.
ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా ఎలాన్ మస్క్.. భారత్‌లో టెస్లా కార్యకలాపాలపై మరోసారి ఆసక్తిని వ్యక్తపరిచారు. కానీ ప్రస్తుతం దేశంలో విధిస్తున్న దిగుమతి సుంకాలు భారత్‌లో టెస్లా విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. టెస్లా సంస్థ 2021లోనే భారత్‌లో తన సంస్థను నమోదు చేసింది. బెంగళూరులో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో రిజిస్టర్ చేశారు. అయితే అనంతరం ఆ ప్రణాళిక ముందుసాగలేదు.

అయితే ప్రధాని మోడీతో మస్క్ భేటీతో భారత్‌లో టెస్లా అడుగుల ముందుకు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే భారత్‌లో టెస్లా విస్తరణపై ఎప్పుడు ఏం జరిగిందో ఓసారి చూద్దాం. 2019 సంవత్సరంలో ఓ ట్విట్టర్ వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఎలాన్ మస్క్.. భారత్‌లో టెస్లా సంస్థ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు.
2020 అక్టోబర్‌లో మరో ట్విట్టర్ వినియోగదారుడు భారత్‌లో టెస్లా ప్రణాళిక ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన మస్క్.. వచ్చే సంవత్సరంలో కచ్చితంగా ఉంటుందని తెలిపారు. అనంతరం 2020 డిసెంబర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో 2021 నుంచి భారత్‌లో టెస్లా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. తొలుత దిగుమతులతో ప్రారంభించి. అనంతరం భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తారని చెప్పారు.
2021 జనవరి ప్రారంభంలో టెస్లా తన సంస్థను భారత్‌లో నమోదు చేసింది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో బెంగళూరులో నమోదు చేసింది. మరియు ముగ్గురు డైరెక్టర్లను నియమించింది. అదే సంవత్సరం అప్పటి సీఎం బీఎస్ యడ్యూరప్ప టెస్లా తన OEM (Original Equipment Manufacturer) యూనిట్‌ను తమ రాష్ట్రంలో ప్రారంభిస్తుందని ప్రకటించారు.
అదే సమయంలో టెస్లా ఆర్ అండ్ డీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతం అదే సంవత్సరం మార్చిలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంలో భాగంగా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
2021 ఏప్రిల్‌లో భారత్‌లో టెస్లా సంస్థ తొలి కార్యాలయం సహా రిటైల్ దుకాణం ఏర్పాటుకు ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో తొలుత తమ వాహనాలను దిగుమతి చేసుకొని విక్రయించాలని నిర్ణయించుకుంది.
2021 ద్వితీయార్ధంలో టెస్లా భారత్ ప్రభుత్వంతో విస్తృతంగా సంప్రదింపులు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. పూర్తి అసెంబ్లింగ్ చేయబడిన కార్లలో 40000 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 40 శాతానికి పన్నులు తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఫలితంగా తక్కువ ధరకే ఈవీలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. అయితే పన్నులు తగ్గించే అవకాశాలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది.

అదే సంవత్సరం డిసెంబర్‌లో టెస్లా మోటార్స్ తన ఏడు ఎలక్ట్రిక్ మోడళ్ల కార్లను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే పన్నుల అంశంపై స్పష్టత లేకపోవడంతో ఎప్పటిలోగా తన మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేది టెస్లా వెల్లడించలేదు.
2022 సంవత్సరం ప్రారంభంలో తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ మంత్రులు టెస్లా సంస్థను తమ రాష్ట్రాల్లోకి ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం తాము భారత్ ప్రభుత్వంతో సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఎలాన్ మస్క్ వారికి బదులిచ్చారు.
కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డు ఛైర్మన్ పన్నుల విధానంలో మార్పులు చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. కానీ కార్ల విడిభాగాలను భారత్‌కు తీసుకొచ్చి ఇక్కడే అసెంబ్లీంగ్ చేసుకోవాలని టెస్లాకు సూచించారు. అప్పటి నుంచి భారత్‌లో తన కార్యకలాపాల ప్రారంభంపై టెస్లా బ్రేకులు వేసింది.
2023 మే సంవత్సరంలో టెస్లాకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారత్‌లో పర్యటించారు. ప్రధాని మోడీ సహా ఇతర అధికారులతో భేటీ అయ్యారు. దేశంలో గిగా ఫ్యాక్టరీని నెలకొల్పడంపై ఆసక్తిని వ్యక్తం చేశారు. వివిధ విడిభాగాలు, బ్యాటరీలకు భారత్ కేంద్రంగా ఉంటుందని, ఆసియా సహా ఇతర మార్కెట్లకు భారత్ నుంచి ఎగుమతులు చేస్తామని ప్రాతిపాదనలు సమర్పించారు.
2023 జూన్‌లో తమ అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మస్క్‌తో భేటీ అయ్యారు. ఫలితంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆసక్తి చూపారు. భారత్‌లో ఫ్యాక్టరీ స్థాపించేందుకు ఇరువురు కీలక చర్చలు చేశారు. 2024లో ఎలాన్ మస్క్ భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








