హమాస్ దాడిలో వ్యక్తి ప్రాణాలు కాపాడిన ‘టెస్లా' కారు.. ఎలాన్ మస్క్ ట్వీట్ వైరల్
ఇజ్రాయెల్- హమాస్(Israel- Hamas War) మధ్య పదిరోజులుగా భీకర యుద్ధం జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి మారణహోమం సృష్టించారు. అంతేకాకుండా మహిళలు, చిన్నారులు, పసిపిల్లలను అతిక్రూరంగా హతమార్చారు. ఇంతటి భీకర పరిస్థితుల్లో ఓ వ్యక్తి టెస్లా కారు సాయంతో హమాస్ దాడి నుంచి తనను తాను రక్షించుకున్నాడు.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిలో ఓ వ్యక్తి టెస్లా కారు సాయంతో ప్రాణాలను రక్షించుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వ్యక్తిపై ఎలా దాడి జరిగింది.. వారి నుంచి ఎలా బయటపడ్డారు.. ఆ సాహసోపేతమైన ఘటనను X(గతంలో ట్విట్టర్)లో పంచుకున్నారు. దీనిపై టెస్లా(Tesla) బాస్ ఎలాన్ మస్క్(Elon Musk) స్పందించారు.

ఘటనకు సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్ ఫ్రీడమ్ పార్టీ నేత గిలాద్ ఆల్పర్ తన X అకౌంట్‌లో షేర్ చేశారు. అయితే బాధితుడి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల్లో హమాస్ మిలిటెంట్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన ఏకైక వ్యక్తి అని తెలిపారు. అతను తన ప్రాణాలను కాపాడుకునేందుకు టెస్లా కారు హెల్ప్ చేసిన తీరు అద్భుతమని కొనియాడారు.
"హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేశారని తెలియగానే ఎమర్జెన్సీ టీమ్ సభ్యులకు అధికారుల నుంచి పిలుపు వచ్చింది. అందులో బాధితుడు ఓ సభ్యుడు. దీంతో వెంటనే ఆ వ్యక్తి తన టెస్లా మోడల్(Tesla Model 3) కారులో అసెంబ్లీ పాయింట్‌కు బయలుదేరాడు. అయితే రోడ్డుపై టెస్లా కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో అతడిని పది అడుగుల దూరం నుంచే హమాస్ మెలిటెంట్లు గమనించారు.

వారు పికప్ ట్రక్కులలో వస్తుండగా వారి వద్ద పెద్ద మెషీన్ గన్‌లు ఉన్నాయి. వ్యక్తిని కారులో చూసిన వెంటనే.. టెస్లా కారుపై కాల్పులు ప్రారంభించారు. ముందుగా కారు ఫ్రంట్ భాగంలో ఆ తర్వాత కుడి వైపు కాల్పులు జరిపారు. అయితే ఆ కారు డీజిల్ కారు కాదని.. ఎలక్ట్రిక్ కారు అని వాళ్లకి తెలియదు. దీంతో ముందు ఇంజిన్, కుడివైపు డీజిల్ ట్యాంక్ ఉంటుందని భావించి ఆ ప్లేసుల్లో కాల్పులు జరిపారు.
కానీ టెస్లా కార్లకు ముందు భాగంలో ఎలక్ట్రిక్ స్టోరేజ్ ఉంటుంది. అందుకే వాళ్లు వరుసగా కాల్పులు జరిపినా వేగాన్ని ఆపకుండా అలాగే పోనిస్తూ ఉన్నాడు. దీంతో హమాస్ మిలిటెంట్లు ఈ సారి.. కారు ఫ్రంట్ భాగంలోని అద్దం, కుడివైపు డోర్, టైర్లపై వరుసగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బాధితుడి తల, కాలుకు బుల్లెట్ గాయాలయ్యాయి.

అయినప్పటికీ ఆ వ్యక్తి తన దూకుడు తగ్గించకుండా మరింత వేగంగా కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో టెస్లా ఎలక్ట్రిక్ కారు వేగాన్ని వాళ్లు అందుకోలేక.. వెంబడించినంత వారు చాలనుకున్నారేమో వెనక్కి వెళ్లిపోయారు. ఘటనలో టైర్లు బాగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ టెస్లా ఎలక్ట్రిక్ కారులోని డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ యాక్టివేట్ కావడంతో కారు ఎక్కడా ఆగలేదు. సులభంగా ముందుకు వెళ్లిపోయింది.
అలా హమాస్ మిలిటెంట్ల ఛేజింగ్‌లో వ్యక్తికి గాయాలైనప్పటికీ టెస్లా ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన పనితీరుతో వారి నుంచి తప్పించుకోగలిగాడు. శరీరం నుంచి రక్తం కారుతున్నా కారును చాకచక్యంగా డ్రైవ్ చేసుకుంటూ దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు." ఇదంతా సదరు వ్యక్తి చెప్పినట్లు గిలాద్ పేర్కొన్నారు.
బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారని గిలాద్ ట్వీట్ చేశారు. కారుపై సుమారు 100 కు పైగా బుల్లెట్ గాయాలున్నాయని.. కారు నుంచి అతడిని బయటకు తీసేందుకు అద్దాలు పగలగొట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. విండ్ షీల్డ్ గట్టిగా ఉండటంతో ప్రాణాలకు హాని కలగలేదని వివరించారు.
X లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఘటనపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. అతను ప్రాణాలతో బయటకు పడినందుకు సంతోషంగా ఉందని ట్వీట్‌కు స్పందిస్తూ రిప్లై ఇచ్చారు. ఏదేమైనా ఘటనలో టెస్లా కారు తన అద్భుతమైన పనితీరుతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications








