ఇండియాలో టెస్లా మొట్టమొదటి షోరూమ్ అక్కడే ఓపెన్ కాబోతుంది.. నెలకు అద్దె ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీలో దిగ్గజ కంపెనీ ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన టెస్లా (Tesla) ఇండియాలో తన కార్యకలాపాలను ప్రారంభించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్లాంట్‌లో ఏర్పాటు చేయడానికి దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోని అనువైన ప్రాంతాలను ఎంపిక చేసే పనిలో ఇప్పటికే ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన తన వాహనాలను విక్రయించడానికి మొదటి షోరూమ్‌ను ఏర్పాటు చేయడానికి గత కొంత కాలంగా కీలక నగరాల్లో అనువుగా ప్రాంతాలను పరిశీలిస్తుండగా, తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, టెస్లా తన మొదటి షోరూమ్‌ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఒక వాణిజ్య టవర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కంపెనీ తన షోరూమ్ అవసరాల మేరకు దాదాపు 4,000 చదరపు అడుగుల స్థలానికి లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ చదరపు అడుగుకు రూ.900 అద్దె చెల్లించనుంది.
ఈ స్థలాన్ని లీజుకు తీసుకున్నందుకు గాను ఎలాన్ మస్క్ నెలకు ఏకంగా రూ.35 లక్షల వరకు అద్దె చెల్లించనున్నారని సంబంధిత వర్గాల వారు తెలిపారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) దేశంలో అత్యంత ఖరీదైన ప్రాంతం. ఈ డీల్ ఆటో పరిశ్రమలో ఇప్పటి అత్యంత ఖరీదైన షోరూమ్ అద్దె. భారీ మొత్తం అద్దెను చెల్లించడానికి టెస్లా సిద్ధపడిందంటేనే కంపెనీ భారతీయ మార్కెట్‌ను ఎంత ముఖ్యమైనదిగా చూస్తుందో తెలిసిపోతుంది.

కంపెనీ తన మొదటి షోరూమ్‌ను ఇక్కడే ప్రారంభించి కార్లను దేశీయ వినియోగదారులకు విక్రయించాలని చూస్తుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో షోరూమ్‌కు సంబంధించి ఐదేళ్ల లీజును ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే టెస్లా ముంబైతో పాటు దేశరాజధాని ఢిల్లీలో కూడా తన రెండో షోరూమ్‌ను ప్రారంభించడానికి సిద్దంగా ఉంది. నివేదికల ప్రకారం, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) సమీపంలోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాపర్టీలో ఏరోసిటీలో రెండవ షోరూమ్‌ను ఏర్పాటు చేయబోతుంది.
ఏరోసిటీలో లీజుకు తీసుకున్నందుకు గాను నెలకు టెస్లా రూ.25 లక్షలు అద్దె చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం. చాలా కాలంగా టెస్లా తన షోరూమ్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని అన్వేషిస్తుంది. మధ్యలో ఇది కొంత ఆలస్యం అయింది. అయితే ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కలిసిన తరువాత కొద్ది రోజులకే షోరూమ్ ఏర్పాటుకు సంబంధించి లీజు ఖరారు అయింది.

అలాగే వీరిద్దరి భేటీ తర్వాత ఇండియాలో టెస్లా ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పనులు సైతం ముందుకు సాగాయి. కంపెనీకి సేల్స్ పెంచడంతో పాటు, నిర్వహణ కోసం అత్యంత కీలకమైన ఉద్యోగాలకు అభ్యర్థులను నియమించడం మొదలుపెట్టింది. ఈ నియామకాలు ఢిల్లీ, ముంబై పరిధిలో ఉండనున్నాయి. భారత ఈవీ మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్దదిగా అవతరించడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో టెస్లా ఎంట్రీతో దేశీయ ఈవీ పరిశ్రమ మరో ఎత్తుకు వెళ్తుంది.
ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో టెస్లా కంపెనీ అగ్రస్థానంలో ఉంది. దీనికి ప్రధాన ప్రత్యర్థి కంపెనీలు వేగంగా తమ మార్కెట్‌ను పెంచుకోడానికి అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కూడా తమ కార్యకలాపాలను మొదలుపెట్టాయి. ప్రస్తుత కాలంలో భారత్ ఈవీకి గమ్యస్థానంగా ఉంది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చినట్లయితే లాభాలు మరింత పెరగనున్నాయి. ఈ క్రమంలో టెస్లా భారత్‌ను అత్యంత లాభదాయకమైన దేశంగా భావించి ప్లాంట్‌ను నెలకొల్పబోతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








